
పాక్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ వార్నింగ్
న్యూఢిల్లీ: భారత్ సహనాన్ని పరీక్షించవద్దని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్తాన్‌ను తీవ్రంగా హెచ్చరించారు. రెచ్చగొడితే తగు రీతిలో సమాధానం ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. ఆపరేషన్ సిందూర్‌కు బదులుగా భారత్‌లోని 15 సైనిక లక్ష్యాలపై పాక్ దాడికి యత్నించడం బదులుగా గురువారం పాక్ వ్యాప్తంగా ఉన్న మిలటరీ రాడార్లతోపాటు లాహోర్‌లోని రాడార్ వ్యవస్థను భారత వైమానిక దళం ధ్వంసం చేసిన నేపథ్యంలో రాజ్‌నాథ్ పైవిధంగా స్పందించారు. నేషనల్ క్వాలిటీ కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ..‘మనం ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా, ఎంతో సంయమనంతో వ్యవహరిస్తూ వచ్చాం.
చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలనే నమ్ముతున్నాం. దీనిని అలుసుగా తీసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం దీటుగా బదులిస్తాం’అని ఆయన స్పష్టం చేశారు. పాక్‌తోపాటు పీవోకేలోని ఉగ్ర స్థావరాలను నామరూపాలు లేకుండా చేసిన వీర సైనికులను ఆయన అభినందించారు. దాడుల సమయంలో సామాన్యులకు హాని వాటిల్లకుండా అనితర సాధ్యమైన కచ్చితత్వంతో దాడులు జరిపామన్నారు. దేశ సార్వ¿ౌమత్వాన్ని పరిరక్షించుకునే విషయంలో ఏ శక్తీ ఆపజాలదన్నారు. పాక్, పీవోకేల్లోని ఉగ్ర స్థావరాలపై జరిగిన దాడుల్లో పెద్ద సంఖ్యలో ముష్కరులు హతమయ్యారని వెల్లడించారు.