పాక్‌లో ప్రతి అంగుళం ‘బ్రహ్మోస్‌’ పరిధిలోనే.. | Every inch of Pakistan within BrahMos range says Rajnath Singh | Sakshi
Sakshi News home page

పాక్‌లో ప్రతి అంగుళం ‘బ్రహ్మోస్‌’ పరిధిలోనే..

Oct 19 2025 4:28 AM | Updated on Oct 19 2025 12:40 PM

Every inch of Pakistan within BrahMos range says Rajnath Singh

‘సిందూర్‌’ ఒక ట్రైలర్‌ మాత్రమే: రాజ్‌నాథ్‌ వ్యాఖ్య   

భారత్‌ వైపు కన్నెత్తి చూడొద్దని పాకిస్తాన్‌కు పరోక్షంగా హెచ్చరిక  

లక్నోలో తయారైన మొదటి బ్యాచ్‌ బ్రహ్మోస్‌ క్షిపణులు సైన్యానికి అప్పగింత  

లక్నో: రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పాకిస్తాన్‌ను గట్టిగా హెచ్చరించారు. పాకిస్తాన్‌లో ప్రతి అంగుళం బ్రహ్మోస్‌ క్షిపణి పరిధిలోనే ఉందని స్పష్టంచేశారు. ఆపరేషన్‌ సిందూర్‌ కేవలం ఒక ట్రైలర్‌ మాత్రమేనని అన్నారు. భారత్‌పై మరోసారి కయ్యానికి కాలుదువి్వతే అసలు సినిమా చూపించక తప్పదని పరోక్షంగా తేల్చిచెప్పారు. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో బ్రహ్మోస్‌ క్షిపణుల శక్తిసామర్థ్యాలు ఏమిటో ప్రపంచం చూసిందన్నారు.

యుద్ధంలో భారత్‌ విజయం సాధించడం యాదృచ్చికం కాదని, అదొక అలవాటుగా మారిందని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ యూనిట్‌లో తయారైన మొదటి బ్యాచ్‌ బ్రహ్మోస్‌ క్షిపణులను రాజ్‌నాథ్‌ సింగ్‌ శనివారం సైన్యానికి అప్పగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నానాటికీ బలీయమైన స్వదేశీ శక్తిగా ఎదుగుతున్న భారత్‌కు ఈ క్షిపణులు ఒక ప్రతీక అని అభివరి్ణంచారు. 

బ్రహ్మోస్‌ అంటే కేవలం మిస్సైల్‌ కాదని, భారతదేశ వ్యూహాత్మక విశ్వాసానికి ఆధారమని చెప్పారు. త్రివిధ దళాలకు ఇదొక మూలస్తంభంగా మారిందన్నారు. ‘‘ఆపరేషన్‌ సిందూర్‌లో జరిగినదంతా ట్రైలర్‌ మాత్రమే. ఒక కొత్త పాకిస్తాన్‌ను భారత్‌ సృష్టించగలదని పాకిస్తాన్‌కు తెలిసొచ్చింది. కానీ, ‘సమయం వచ్చినప్పుడు’.. ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మీరంతా తెలివైనవాళ్లని నాకు తెలుసు. చెప్పకుండానే అర్థం చేసుకోగలరు’’ అని రాజ్‌నాథ్‌ వ్యాఖ్యానించారు.  

రక్షణ రంగంలో స్వయం సమృద్ధి  
ఆపరేషన్‌ సిందూర్‌ భారతీయుల్లో నూతన విశ్వాసాన్ని నింపిందని రక్షణ శాఖ మంత్రి ఉద్ఘాటించారు. ఈ విశ్వాసాన్ని ఇలాగే కొనసాగించడం మనందరి సమ్మిళిత బాధ్యత అని పిలుపునిచ్చారు. మన దేశ శక్తిని ప్రపంచమంతా గుర్తిస్తోందని, కలలను నెరవేర్చుకోగలమన్న విశ్వాసాన్ని బ్రహ్మోస్‌ క్షిపణులు మరింత బలోపేతం చేశాయని చెప్పారు. 

రక్షణ రంగంలో స్వయం సమృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, మనకు అవసరమైన ఆయుధాలు, రక్షణ పరికరాలను మనమే తయారుచేసుకోవాలని సంకల్పించామని తెలిపారు. రక్షణ తయారీ రంగంలో పెరుగుతున్న మన విశ్వాసానికి, సామర్థ్యానికి బ్రహ్మోస్‌ మిస్సైల్స్‌ ఉత్పత్తి కేంద్రం ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు.

 లక్నో అంటే పార్లమెంట్‌ నియోజకవర్గం మాత్రమే కాదని, ఈ నగరం తన హృదయంలో ఉందని చెప్పారు. సంస్కృతి సంప్రదాయాలతోపాటు ఆధునిక టెక్నాలజీ, పరిశ్రమలకు ప్రధాన కేంద్రంగా మారిందని ఆనందం వ్యక్తంచేశారు. లక్నోలో బ్రహ్మోస్‌ క్షిపణు లు ఉత్పత్తి కావడం చూస్తే ఒకనాటి స్వప్నం నేడు నెరవేరినట్లు తేటతెల్లమవుతోందని ఉద్ఘాటించారు. 

సహనం, కఠోర శ్రమ, అంకితభావానికి ఈ ప్రాజెక్టును ఒక ప్రతీకగా భావించవచ్చని వివరించారు. ఇక్కడ ప్రతిఏటా దాదాపు 100 క్షిపణులను ఉత్పత్తి చేయొచ్చని, వందలాది మందికి ప్రత్యక్షంగా ఉపా ధి లభిస్తుందని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ యూనిట్‌ టర్నోవర్‌ రూ.3,000 కోట్లకు చేరుతుందని, తద్వారా జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి రూ.500 కోట్ల ఆదాయం వస్తుందన్నారు.

బ్రహ్మాస్త్రమే 
→ బ్రహ్మోస్‌ క్షిపణి సూపర్‌సానిక్‌ క్రూయిజ్‌ మిస్సైల్‌ రకానికి చెందినది.  
→ దాదాపు 300 కిలోల వార్‌హెడ్లను మోసుకెళ్లగలదు.  
→ పొడవు 8.4 మీటర్లు. వ్యాసం 0.6 మీటర్లు. బరువు 3 టన్నులు  
→ భూ ఉపరితలంపైనుంచి ప్రయోగించే క్షిపణి పరిధి 290 కిలోమీటర్లు. నౌకలపైనుంచి ప్రయోగించి క్షిపణి పరిధి 450 కిలోమీటర్లు. ఈ పరిధిని 800 కిలోమీటర్లకు పెంచడానికి ప్రయోగాలు జరుగుతున్నాయి.  
→ జీపీఎస్‌ రాడార్‌ గైడెన్స్‌ సిస్టమ్‌ ఆధారంగా దూసుకెళ్తుంది.  
→ బ్రహ్మోస్‌ మిస్సైల్‌లో ఘన ఇంధన బూస్టర్, ద్రవ ఇంధనం క్రూయిజ్‌ దశ ఉంటాయి.  
→ గంటకు 3,400 నుంచి 3,700 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు.  
→ భూఉపరితలంతోపాటు యుద్ధ విమానాల నుంచి, నౌకల నుంచి, జలాంతర్గాముల నుంచి ప్రయోగించవచ్చు.  
→ 2005 నుంచి బ్రహ్మోస్‌ క్షిపణులు భారత సైన్యంలో సేవలందిస్తున్నాయి. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఆపరేషన్‌ సిందూర్‌లో కీలక పాత్ర పోషించాయి. పాకిస్తాన్‌లో ఉగ్రవాదుల స్థావరాలను, శిక్షణ కేంద్రాలను, పాక్‌ వైమానిక దళం ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేశాయి.  

ఆర్థిక రంగానికీ లబ్ధి  
దేశీయంగా బ్రహ్మోస్‌ క్షిపణుల తయారీతో మన రక్షణ రంగంతోపాటు ఆర్థిక రంగానికి సై తం ఎంతో లబ్ధి చేకూరుతుందని రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టంచేశారు. రెండు దేశాలకు క్షిపణులు ఎగుమ తి చేయడానికి మన బ్రహ్మోస్‌ టీమ్‌ ఒప్పందాలు కుదుర్చుకుందని, వీటి విలువ రూ.4,000 కోట్లు అని వెల్లడించారు. శుభప్రదమైన ధన త్రయోదశి రోజే క్షిపణులను సైన్యానికి అప్పగిస్తుండడం ఆనందంగా ఉందన్నారు. లక్ష్మీదేవి ఆశీస్సులు రక్ష ణ రంగంపై, ఆర్థిక రంగంపై ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొన్నారు. లక్నోలో బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ యూనిట్‌ ఈ ఏడాది మే 11న ప్రారంభమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement