
అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు రాజ్‌నాథ్ సింగ్ విజ్ఞప్తి
శ్రీనగర్: అత్యంత దుష్ట దేశమైన పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలు ఉండడం ప్రపంచానికి ఎప్పటికైనా ప్రమాదకరమేనని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తేల్చిచెప్పారు. వాటిని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఏఈఏ) పర్యవేక్షణలోకి తీసుకురావాలని అన్నారు. పాక్ అణ్వాయుధాలు ఐఏఈఏ పరిధిలో ఉంటేనే ప్రపంచ భద్రతకు ముప్పు వాటిల్లదని స్పష్టంచేశారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత రాజ్‌నాథ్ సింగ్ తొలిసారిగా గురువారం జమ్మూకశ్మీర్‌లో పర్యటించారు.
పహల్గాం ఉగ్రవాద దాడి మృతులతోపాటు పాకిస్తాన్‌పై దాడిలో ప్రాణత్యాగం చేసిన జవాన్లకు నివాళు లర్పించారు. శ్రీనగర్‌లోని బాదామీబాగ్ కంటోన్మెంట్‌లో సైనికులను ఉద్దేశించి మాట్లాడా రు. పాక్ అణు బెదిరింపులను భారత్ ఏమాత్రం లెక్కచేయలేదని గుర్తుచేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేసే విషయంలో మన పట్టుదలను దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చని అన్నారు.
భారత్‌పై అణ్వాయుధాలు ప్రయోగిస్తామని పాక్ ఎన్నోసార్లు బెదిరించిందని తెలిపారు. పాక్ నిజస్వరూపం ప్రపంచం మొత్తం చూసిందని పేర్కొన్నారు. ధూర్త దేశం చేతిలో అణ్వాయుధాలు ఉండడం సరైనదేనా? అని ప్రపంచ దేశాలను రాజ్‌నాథ్ ప్రశ్నించారు. అందుకే పాక్ అణ్వాయుధాలను ఐఏఈఏ పరిధిలోకి తీసుకురావాలని స్పష్టంచేశారు. ఉగ్రవాదంపై మన పోరాటంలో ‘ఆపరేషన్ సిందూర్’ అతిపెద్ద చర్య అని వెల్లడించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించే విషయంలో ఎంతదూరమైన వెళ్తామని నిరూపించామని పేర్కొన్నారు.