
వాషింగ్టన్: అమెరికా, చైనా(China) మధ్య టారిఫ్‌ల కారణంగా ట్రేడ్ వార్ కొనసాగుతోంది. అరుదైన ఖనిజాలపై చైనా ఆధిపత్యం విషయంలో అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో చైనాకు వ్యతిరేకంగా భారత్ మద్దతు ఇవ్వాలని ఆశిస్తున్నట్లు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్(Scott Bessent) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో చైనాను టార్గెట్ చేసి.. ప్రపంచ పంపిణీ వ్యవస్థలపై చైనా గురిపెట్టిందని ఆరోపణలు గుప్పించారు.
అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ తాజాగా ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘అమెరికా ప్రపంచ శాంతి, ఆర్థిక స్థిరత్వం కోసం కృషి చేస్తోంది. ఇదే సమయంలో చైనా ప్రపంచంలో వార్ ఎకానమీకి ఫైనాన్స్ చేస్తోందని ఆరోపించారు. అరుదైన ఖనిజాల(rare Metals) ఉత్పత్తి, సరఫరాపై చైనా పెంచుకుంటున్న ఆధిపత్యాన్ని అడ్డుకోవడంలో భారత్, యూరోపియన్ దేశాలు అమెరికాతో కలిసి నడవాలని పిలుపునిచ్చారు. అయితే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆధునిక సాంకేతిక పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ సామగ్రి తయారీలో ఈ ఖనిజాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. చైనా ఈ వనరులలో దాదాపు 70% సరఫరాను నియంత్రిస్తుండటంతో, అమెరికా దీనిని వ్యూహాత్మక ముప్పుగా చూస్తోంది. ఇక, అక్టోబర్ 9 నుంచి అరుదైన ఖనిజాల ఎగుమతులకు అనుమతులు తప్పనిసరి చేస్తూ చైనా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
NEW:
🇺🇲🇮🇳 US Treasury Secretary Scott Bessent now expects to receive support from India in the case of China's rare earth materials, despite the fact that a few weeks ago Trump imposed tariffs on them and blackmailed India to stop buying oil from Russia. pic.twitter.com/S0ol7tWiR8— Megatron (@Megatron_ron) October 14, 2025
అయితే.. ఆయన మాటల్లో స్పష్టంగా చైనాపై వ్యతిరేక ధోరణి కనిపించింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు, సాంకేతిక పరమైన పోటీ, దక్షిణ చైనా సముద్రం వివాదం వంటి అంశాలు ఇప్పటికే ఉద్రిక్తతలను పెంచాయి. ఇప్పుడు అరుదైన ఖనిజాల విషయం కూడా ఆ వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. అమెరికా ఈ వనరుల సరఫరాను చైనా నుండి స్వతంత్రంగా మార్చుకునే ప్రయత్నంలో ఉంది. భారత్ ఈ రంగంలో విస్తారమైన వనరులు కలిగి ఉండటంతో, అమెరికా వ్యూహాత్మకంగా భారత్ వైపు మొగ్గు చూపుతోంది.
మరోవైపు, అమెరికా ఇటీవల భారత్‌పై కొన్ని ఉత్పత్తులపై టారిఫ్‌లు విధించడం, వాణిజ్య పరమైన అడ్డంకులు సృష్టించడం విమర్శలకు దారితీసింది. టారిఫ్‌లతో భారత్ ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తూనే, చైనాపై పోరులో మద్దతు కోరడం విరుద్ధ ధోరణిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. అయినప్పటికీ, ఖనిజాల రంగంలో భారత్ భాగస్వామ్యం అమెరికాకు వ్యూహాత్మకంగా అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు.