టారిఫ్‌లు 18 శాతానికి తగ్గింపు: ట్రంప్
అమెరికాపై భారత్ సుంకాల ఎత్తివేత!
ప్రధానితో ఫోన్ చర్చల తర్వాత అధ్యక్షుడు
మోదీ అభ్యర్థన మేరకే నిర్ణయమని వెల్లడి
భారత్ ఇక మానుంచే చమురు కొంటుంది
రష్యా చమురు కొనుగోళ్లకు గుడ్‌బై: ట్రంప్
న్యూఢిల్లీ: కొంతకాలంగా ఒడిదుడుకుల్లో పడ్డ భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న వాణిజ్య ఒప్పందం కొలిక్కి వచ్చినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అందులో భాగంగా భారత్‌పై సుంకాల భారాన్ని తగ్గిస్తున్నట్టు కూడా వెల్లడించారు. గతేడాది తాను విధించిన 25 శాతం ప్రతీకార సుంకాలు 18 శాతానికి తగ్గుతాయని ప్రకటించారు. భారత ఉత్పత్తులపై అమెరికా ప్రస్తుతం 50 శాతం టారిఫ్‌లు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం ట్రంప్ ఫోన్‌లో సంభాíÙంచారు. ఆ వెంటనే వాణిజ్య ఒప్పందం, సుంకాల తగ్గింపుపై ప్రకటన చేశారు.
‘‘మోదీతో నా స్నేహం, ఆయనపై గౌరవం దృష్ట్యా, ఆయన విజ్ఞప్తి మేరకు ఇరు దేశాల నడుమ ఒప్పందం కుదిరింది. ఇది తక్షణం అమల్లోకి వచి్చంది’’అని ట్రంప్ వెల్లడించారు. తన సోషల్ మీడియా ట్రూత్‌సోషల్‌లో ఈ మేరకు పోస్టు పెట్టారు. అంతేకాదు, ‘‘అమెరికాపై టారిఫ్, టారిఫేతర అడ్డంకులన్నింటినీ సున్నాకు తగ్గించే దిశగా భారత్ చర్యలు చేపట్టనుంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ పూర్తిగా నిలిపేయనుంది. ఇకపై వెనెజువెలా, అమెరికా నుంచి చమురును దిగుమతి చేసుకుంటుంది’’అని కూడా ట్రంప్ పేర్కొన్నారు. ఈ పరిణామం ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి తెర దించేందుకు దోహదపడుతుందని హర్షం వెలిబుచ్చారు. ‘‘నేను, మోదీ మాటల మనుషులం కాదు.
పక్కా చేతల వ్యక్తులం. కనుక భారత్, అమెరికా నడుమ ఇప్పటికే ఉన్న అద్భుత సంబంధాలు మున్ముందు మరింత బలోపేతం కానున్నాయి’’అని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. మోదీని తన అత్యుత్తమ మిత్రుల్లో ఒకరిగా అభివర్ణించారు! ‘‘వర్తకం, రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి తెర దించడంతో పాటు పలు అంశాలపై మోదీతో సుదీర్ఘంగా చర్చించా. ఇకపై అమెరికా వస్తువులను భారత్ మరింత భారీ పరిమాణంలో కొనుగోలు చేస్తుందని మోదీ నాకు హామీ ఇచ్చారు. 500 బిలియన్ డాలర్లకు పైగా విలువ చేసే చమురు, టెక్నాలజీ, వ్యవసాయ, బొగ్గు తదితర ఉత్పత్తులను అమెరికా నుంచి దిగుమతి చేసుకునేందుకు అంగీకరించారు’’అని చెప్పుకొచ్చారు.
తుది టారిఫ్ 18 శాతమే: గోర్
సోమవారం ట్రంప్, మోదీ ఇరువురూ ఫోన్లో సంభాషించుకున్నారని అమెరికా నూతన రాయబారి సెర్గియో గోర్ వెల్లడించిన కాసేపటికే వెంటవెంటనే కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ‘‘ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడే ప్రధాని మోదీతో మాట్లాడారు. (ఏం జరగనుందో) వేచి చూడండి’’అంటూ గోర్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తున్నందుకు భారత్‌పై అదనంగా విధించిన మరో 25 శాతం టారిఫ్ గురించి మాత్రం ట్రంప్ ప్రస్తావించలేదు. రష్యా నుంచి భారత చమురు కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయని వ్యాఖ్యానించి సరిపెట్టారు.
ఆ టారిఫ్‌ను తొలగిస్తున్నదీ లేనిదీ స్పష్టత ఇవ్వలేదు. అయితే గోర్ ఇండియా టుడే వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘భారత్‌పై అమెరికా తుది టారిఫ్‌లు 18 శాతం మాత్రమే’అంటూ స్పష్టత ఇచ్చారు. తద్వారా, రష్యా చమురు టారిఫ్‌ను తొలగించినట్టేనని అన్యాపదేశంగా చెప్పారు. ఇక అమెరికాపై టారిఫ్‌లను దశలవారీగా పూర్తిగా ఎత్తేసే విషయమై ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ అధికారికంగా స్పందించలేదు.
ఒప్పందంపై మోదీ మౌనం
ఈ పరిణామంపై మోదీ కూడా స్పందించారు. భారత వస్తువులపై అమెరికా ఇకపై 18 శాతం సుంకమే విధిస్తుందని చెప్పేందుకు ఎంతో సంతోíÙస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘‘ఇంత గొప్ప ప్రకటన చేసినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరఫున ప్రెసిడెంట్ ట్రంప్‌కు ఎంతగానో కృతజ్ఞతలు. ప్రపంచ శాంతి, సుస్థిరత, ప్రగతికి ఆయన సారథ్యం ఎంతో కీలకం’’అంటూ కొనియాడారు. శాంతిసాధన దిశగా ఆయన ప్రయత్నాలకు భారత్ పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు.
‘‘ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆరి్థక, ప్రజాస్వామిక వ్యవస్థలు కలసికట్టుగా పని చేస్తే అంతిమంగా ప్రజలకు ఎనలేని మేలు కలుగుతుంది. ఇరు పక్షాలకూ లాభదాయంగా అపారమైన అవకాశాలకు తలుపులు తెరుచుకుంటాయి. భారత్, అమెరికా సంబంధాలను నూతన శిఖరాలకు తీసుకెళ్లే దిశగా ట్రంప్‌తో కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నా’’అని పేర్కొన్నారు. అయితే ట్రంప్ చెప్పిన భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందంపై మాత్రం మోదీ ఎలాంటి ప్రకటనా చేయకపోవడం గమనార్హం!


