
ఆఫ్ఘన్-పాకిస్థాన్ సరిహద్దును మూసివేసిన దృశ్యం
కాబూల్/ఇస్లామాబాద్: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు గంటగంటకూ ముదురుతున్నాయి. ఇరువైపులా భీకరంగా కాల్పులు జరుగుతున్నాయి. కాబూల్‌పై పాక్ కవ్వింపు చర్యలకు వ్యతిరేకంగా తాము కాల్పులు జరిపినట్లు తాలిబన్ ప్రభుత్వం చెబుతుండగా.. అకారణంగా ఆఫ్ఘన్ తమపై కాల్పులకు దిగిందని పాక్ వాదిస్తోంది.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ రెండు సరిహద్దులను పూర్తిగా మూసివేసింది. అయితే.. తమ సేనలు జరిపిన కాల్పుల్లో 58 మంది పాక్ సైనికులు హతమయ్యారని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ తెలిపారు. 30 మంది సైనికులు గాయపడ్డట్లు పేర్కొన్నారు. ఆఫ్ఘన్ వైపు తొమ్మిది మంది సైనికులు మరణించగా.. 18 మంది గాయపడ్డట్లు ఆదివారం మధ్యాహ్నం కాబూల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అయితే.. పాకిస్థాన్ మాత్రం ఈ గణాంకాలను నిర్ధారించలేదు. తమవైపు ముగ్గురు సైనికులు, ఒక పౌరుడు మృతిచెందినట్లు ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్(ఐఎస్‌పీఆర్) ప్రకటించింది. తమ ప్రధాని షెహబాజ్ షరీఫ్, అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ముక్తకంఠంతో ఆఫ్ఘన్ చర్యలను ఖండించినట్లు పాక్ మీడియా తెలిపింది. తాలిబన్ సర్కారుకు గట్టి బదులిచ్చేందుకు పాక్ సైన్యం సిద్ధమైనట్లు వెల్లడించింది.
టీటీపీ లక్ష్యంగా డ్రోన్ దాడులు
తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్(టీటీపీ) చీఫ్ నూర్ వలీ మహ్సూద్ టార్గెట్‌గా పాక్ సైన్యం దాడులు జరుపుతోంది. ఈ క్రమంలో నిన్న సాయంత్రం కాబూల్‌లో డ్రోన్ దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఇద్దరు టీటీపీ సీనియర్ నేతలు మరణించగా.. వారిలో మహ్సూద్ ఉన్నారా? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. డ్రోన్ దాడులకు ప్రతిగా ఆఫ్ఘన్ సైన్యం పాక్ సరిహద్దుల్లో కాల్పులను ప్రారంభించింది. హెల్మాండ్ ప్రావిన్స్ లో రెండు పాకిస్థాన్ పోస్టులను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. కునార్, నంగర్హార్, హెల్మాండ్ ప్రాంతాల్లో భీకర కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం.
రంగంలోకి ఇరాన్
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఘర్షణలను నిలువరించేందుకు ఇరాన్ రంగంలోకి దిగింది. ఇరువర్గాలు శాంతిని పాటించాలని పిలుపునిచ్చింది. ఘర్షణలను తగ్గించేందుకు తమ వంతు కృషి చేస్తామని ప్రకటించింది. సౌదీ అరేబియా, ఖతార్ కూడా ఇరుదేశాలు సంయమనం పాటించాలని కోరాయి. నిజానికి ఆఫ్ఘనిస్థాన్ అంతర్జాతీయంగా ఒంటరిగా ఉంది. కేవలం రష్యా మాత్రమే తాలిబన్ల అధికారాన్ని, ప్రభుత్వాన్ని గుర్తించింది. తాజాగా భారత్‌లో ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి పర్యటన తర్వాత.. ఉపఖండంతో తాలిబన్ల మైత్రికి అడుగులు పడ్డాయి.
👉ఇదీ చదవండి: హమాస్ కొత్త బ్రాండ్ పేరు.. ‘ది గాజా సెక్యూరిటీ ఫోర్సెస్’