
హమాస్.. నిన్న, మొన్నటి వరకూ మిలిటెట్లు(నిషేధిత ఉగ్రవాద సంస్థ). ఇప్పుడు వారి పేరు మారింది.. వారి బ్రాండ్ కూడా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఒత్తిడితో ఇజ్రాయిల్‌తో శాంతి ఒప్పందంలో భాగంగా ఇప్పుడు హమాస్ కాస్త ‘ది గాజా సెక్యూరిటీ ఫోర్సెస్’గా రూపాంతరం చెందింది. తాజాగా వీరి బ్రాండ్ పేరును విడుదల చేసింది హమాస్.
దీనిలో భాగంగా సుమారు ఏడు వేల మంది హమాస్ మిలిటెంట్లు సాధారణ పౌరుల వలే మారిపోవడానికి సిద్ధమయ్యారు.. ఈ మేరకు ఇజ్రాయిల్ రక్షణ దళాలు(ఐడీఎఫ్).. గాజాలో ఇటీవల ఉపసంహరించుకున్న ప్రాంతాలపై నియంత్రణను తిరిగి స్థాపించడానికి పౌర దుస్తులలో దర్శనమిస్తున్నారు. మొన్నటి వరకూ చీకటిలో యుద్ధం చేసిన వీరు.. ఇప్పుడ జన జీవన స్రవంతిలోకి వచ్చి నేరుగా గాజాకు అండగా ఉంటామంటున్నారు.
మా వారిని విడిచిపెడతారని ఆశిస్తున్నాం..
మరొకవైపు గడువులోగా బందీలను స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు హమాస్ తెలిపింది. వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. ట్రంప్ రేపు ఉదయం ఇజ్రాయెల్‌లో అడుగుపెట్టే సమయానికి హమాస్ చేతిలో బందీలు విడుదల అవుతారని ఇజ్రాయెల్ భావిస్తోంది.
రెండేళ్ల నాటి యుద్ధం.. ముగిసిన వేళ..
హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సుమారు రెండేళ్ల క్రితం గాజాలో ప్రారంభించిన విధ్వంసక యుద్ధం ముగిసిన జాడలు కనిపిస్తు న్నాయి. అక్డోబర్ 10వ తేదీ మధ్యాహ్నం నుంచి గాజాలో ప్రశాంత వాతావరణం నెలకొంది. పాలస్తీని యన్లపై కాల్పులు, వైమానిక దాడులు నిలిచిపోయాయి. ఆ ప్రాంతంలో కాల్పుల విరమణ ఒప్పందం మధ్యాహ్నం నుంచి అమల్లోకి వచ్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం సైతం ధ్రువీకరించింది.
యుద్ధానికి విరామం ఇవ్వడానికి, మిగిలిన బందీలను పాలస్తీనా ఖైదీలతో మార్పిడి చేయడానికి సంబంధించిన ఒప్పందాన్ని ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు ప్రధాని నెతన్యాహూ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆర్మీ ఈ మేరకు ప్రకటించడం గమనార్హం. దీంతో, సెంట్రల్ గాజాలోని వాడి గాజాలో గుమికూడిన వేలాది మంది పాలస్తీనియన్లు ఉత్తర ప్రాంతంలోని తమ సొంత నివాసాల దిశగా నడక సాగించారు.
ఒప్పందం ప్రకారం...గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలను ఉపసంహరించుకున్న అనంతరం హమాస్ తమ వద్ద బందీలుగా ఉన్న 48 మందిని విడుదల చేయాల్సి ఉంటుంది. వీరిలో కనీసం 20 మంది మాత్రమే సజీవంగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఇందుకు బదులుగా 2 వేల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెడుతుంది. వీరి జాబితాను శుక్రవారం అధికారులు విడుదల చేశారు. ఇందులో పాలస్తీనా అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత మర్వాన్ బర్ఘౌటి కూడా ఉన్నారు. బందీలు, ఖైదీల విడుదల ఆదివారం రాత్రి లేదా సోమవారం మొదలవుతుందని మధ్యవర్తులుగా వ్యవహరించిన ఈజిప్టు అధికారులు తెలిపారు.
సిద్ధంగా మానవతా సాయం
గాజాలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో మానవతా సాయం తీసుకువచ్చిన ట్రక్కులు సాధ్యమైనంత త్వరగా చేరుకునేందుకు ఈజిప్టు, గాజా మధ్యనున్న రఫా సహా ఐదు సరిహద్దులను తెరిచి ఉంచనున్నారు.
సుమారు 1.70 లక్షల టన్నుల మందులు, ఆహారం, ఇతర అత్యవసరా లను గాజాలోకి తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని ఐరాస మానవతా సాయం చీఫ్ టామ్ ఫ్లెచర్ తెలిపారు. సానుకూల సంకేతాలు అందిన వెంటనే రంగంలోకి దిగుతామని చెప్పారు. ఇజ్రాయెల్‌తో కుదిరిన డీల్ ప్రకారం కాల్పుల విరమణ ఒప్పందం అమలును పర్యవేక్షించేందుకు 200 మంది సైనికులను గాజాకు పంపుతామని అమెరికా అధికారులు చెప్పారు.
వారి మెడపై కత్తి ఉంది..: నెతన్యాహూ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెరపైకి తెచ్చిన కాల్పుల విరమణ ప్రణాళికలో పేర్కొన్న హమాస్ నిరాయుధీకరణ, గాజా భవిష్యత్తు పాలన వంటి అంశాలపై ఎటువంటి స్పష్టత లేదు. ‘ట్రంప్ ప్రకటనలో తర్వాతి భాగం హమాస్ నిరాయుధీకరణే. ఇది సులువుగా జరిగితే సరేసరి. లేదంటే బలవంతంగానైనా సాధిస్తాం. మెడపై కత్తి ఉందని తెలిసే హమాస్ ఒప్పందానికి వచ్చింది.
ఇప్పటికీ కత్తి మెడపైనే ఉంది’అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ పేర్కొనడం గమనార్హం. కాగా, శుక్రవారం మధ్యాహ్నం అధికారికంగా కాల్పుల విరమణ ప్రారంభమవడానికి కొద్ది గంటల ముందుగానే బలగాల ఉపసంహరణ పూర్తయిందని ఇజ్రాయెల్ బ్రిగేడియర్ జనరల్ ఎఫ్పీ డెఫ్రిన్ చెప్పారు. ఉపసంహరణ అంశం సున్నితత్వం దృష్ట్యా గాజాలోని ఇటీవల స్వాధీనం చేసుకున్న 50 శాతం ప్రాంతంలో బలగాలు కొనసాగుతాయని ఓ సైనికాధికారి పేర్కొనడం విశేషం.
ఇది ఇజ్రాయిల్‌కు పరోక్ష వార్నింగేనా?
ప్రస్తుతం ఇజ్రాయిల్-హమాస్‌లు అమెరికా ఒత్తిడితో శాంతి ఒప్పందానికి ముందుకొచ్చినా ఇరు వర్గాల్లో ఎక్కడో భయం ఉంది. వారి మధ్య చోటు చేసుకుంది మామాలు యుద్ధం కాదు. విధ్వంసకర యుద్ధం. ఈ క్రమంలోనే వారి మధ్య శాంతి ఒప్పందం జరిగినా కూడా రెండు వర్గాలు జాగ్రత్తగా ఉండాలనే ముందస్తు ప్రణాళికతో సిద్ధమైనట్లు తెలుస్తున్నాయి. హమాస్ ఏమీ చేసే పరిస్థితి లేకే ఒప్పందానికి వచ్చిన ఇజ్రాయిల్ ప్రధాని నెతాన్యాహూ స్పష్టం చేసిన నేపథ్యంలో హమాస్ కూడా వారు మొత్తం ఆయుధాలను వదిలేయడానికి సిద్ధంగా లేరనేది అర్ధమవుతోంది.
తాము ఉంటాం.. కానీ ది గాజా సెక్యూరిటీ ఫోర్సెస్ గా ఉంటామని చెబుతున్నారు. జస్ట్ మేము మారాం.. అంతే.. మా లక్ష్యం మారలేదు’ అని సందేశాన్ని ది గాజా సెక్యూరిటీ ఫోర్సెస్ ఏర్పాటు ద్వారా పంపినట్లు అయ్యింది. అంటే అవసరమైన పక్షంలో మళ్లీ తాము యుద్ధం చేయడానికి సిద్ధమేనని పరోక్ష సంకేతాలు పంపారు.
ఇప్పుడు హమాస్.. ది గాజా సెక్యూరిటీ ఫోర్సెస్’ రూపొంతరం చెందడానికి ప్రధాన కారణం మాత్రం ఇజ్రాయిల్‌ను పూర్తిగా నమ్మలేని స్థితి. అటు ఇజ్రాయిల్ కూడా హమాస్‌ను పూర్తిగా నమ్మడం లేదు. ఒప్పందానికి కట్టుబడే అటు ఇజ్రాయిల్-ఇటు హమాస్‌లు తమ తమ చెరల్లో ఉన్న బంధీలను విడిచిపెట్టడానికి సిద్ధమయ్యాయి. ఒకవేళ వీరి మధ్య ఏమైనా విభేదాలు తలెత్తితే మళ్లీ యుద్ధం రాదనే విషయం కూడా చెప్పలేమనేది విశ్లేషకుల అభిప్రాయం.
ఇదీ చదవండి:
58 మంది పాక్ సైనికుల మృతి