శాంతి చర్చల వేళ సంచలనం.. హమాస్‌ ప్రత్యర్థుల ఊచకోత | Masked fighters In Gaza City as Hamas fights with rival groups | Sakshi
Sakshi News home page

శాంతి చర్చల వేళ సంచలనం.. హమాస్‌ ప్రత్యర్థుల ఊచకోత

Oct 15 2025 7:22 AM | Updated on Oct 15 2025 7:22 AM

Masked fighters In Gaza City as Hamas fights with rival groups

గాజా: ఇజ్రాయెల్‌ బందీల విడుదల అనంతరం హమాస్‌ సాయుధ గ్రూపు చూపు ఇప్పుడు ప్రత్యర్థి వర్గాలపై పడింది. గాజా ప్రాంతంపై పట్టు తిరిగి సాధించేందుకు విరోధి సాయుధ శ్రేణులను ఏరి పారేసే పనికి పూనుకుంది. ఈ పరిణామం అమెరికా మధ్యవర్తిత్వంతో నెలకొన్న కాల్పుల విరమణ మనుగడపై కొత్త అనుమానాలను తెరపైకి తెస్తోంది. ఇప్పటికైనా శాంతి నెలకొందని సంతోష పడుతున్న పాలస్తీనియన్లను హమాస్‌ వైఖరి భయపెడుతోంది.

వివరాల ప్రకారం.. హమాస్‌ ఫైరింగ్‌ స్క్వాడ్‌ తాజాగా ప్రత్యర్థి వర్గాలకు చెందిన 8 మందిని కాల్చి చంపినట్లు సమాచారం. మొత్తమ్మీద 50 మందిని ఇప్పటి వరకు మట్టుబెట్టి ఉంటుందని వైనెట్‌ వార్తా సంస్థ తెలిపింది. అంతర్గత భద్రతను హమాస్‌ చూసుకుంటుందని ట్రంప్‌ ప్రకటించిన కొద్దిసేపట్లోనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నట్లు ఆ సంస్థ వ్యాఖ్యానించింది. కళ్లకు గంతలు కట్టి, బంధించిన వారిని ముసుగులు ధరించిన హమాస్‌ సభ్యులు దాదాపు బహిరంగంగానే కాలుస్తున్నట్లుగా ఉన్న వీడియోను షఫఖ్‌ న్యూస్‌ ప్రసారం చేసింది.

దీనిపై స్పందించిన హమాస్‌.. ఇజ్రాయెల్‌ బలగాలకు సహకరించడంతోపాటు నేర కార్యకలాపాల్గో పాల్గొన్నందుకే వీరిని శిక్షించామని తెలిపింది. అయితే, హమాస్‌ చర్యలు గాజాలోని డొగ్‌ముష్‌ వంటి గ్రూపులతో హింసాత్మక ఘర్షణలకు దారి తీస్తున్నాయి. డొగ్‌ముష్‌ వర్గం గాజాలోని అత్యంత శక్తివంతమైన సాయుధ గ్రూపుల్లో ఒకటి. హమాస్‌ భద్రతా విభాగంతో జరిగిన కాల్పుల్లో డొగ్‌ముష్‌కు చెందిన 52 మంది చనిపోయారని వైనెట్‌ పేర్కొంది. ఈ పోరులో 12 మంది హమాస్‌ సాయుధులు కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో హమాస్‌ సీనియర్‌ నేత బస్సెమ్‌ నయీమ్‌ కుమారుడు కూడా ఉన్నట్లు వైనెట్‌ పేర్కొంది. ప్రత్యర్థుల ప్రాంతాల్లోకి గుట్టుచప్పుడు కాకుండా అంబులెన్సుల్లో వెళ్లిన హమాస్‌ శ్రేణులు శత్రు సంహారం చేస్తున్నారని తెలిపింది. పౌరుల ప్రాణాలకు ప్రమాదం కలిగించేలా వ్యవహరిస్తోందంటూ హమాస్‌పై విమర్శలు వస్తున్నాయి.

కొన్ని గ్రూపులకు ఇజ్రాయెల్‌ సాయం
అత్యంత అధునాతన, భారీ ఆయుధాలు కలిగిన డొగ్‌ముష్‌కు ఎప్పట్నుంచో హమాస్‌తో విభేదాలున్నాయి. ఈ గ్రూపునకు ఇజ్రాయెల్‌ మద్దతుందనే అనుమానాలు కూడా ఉన్నాయి. రఫాలోని యాసెర్‌ అబూ షబాబ్‌ సారథ్యంలోని గ్రూపు సహా గాజాలోని పలు ముఠాలకు పరిమితంగా సాయం, ఆయుధాలు అందిస్తున్నట్లు ఇజ్రాయెల్‌ ఇటీవల ప్రకటించడం గమనార్హం. ఇటీవల హమాస్‌ శ్రేణులు యాసెర్‌ అబూ షబాబ్‌ సన్నిహితుడొకరిని చంపేసినట్లు ప్రకటించుకున్నాయి. షబాబ్‌ను వదిలేది లేదని కూడా తెలిపాయి.

హమాస్‌లోని యారో యూనిట్‌ హింసాత్మక ప్రతీకార చర్యల్లో ఆరితేరిందని నిపుణులు అంటున్నారు. ఇన్నాళ్లూ సొరంగాల్లో రహస్యంగా నక్కుతూ పనిచేసిన హమాస్‌ సాయుధులు ఇప్పుడు తమ శత్రువుల అంతం చూసే పనిలో నిమగ్నమైనట్లు చెబుతున్నారు. శాంతి ఒప్పందాన్ని అనుసరించే ఉద్దేశం హమాస్‌ లేనట్లు కనిపిస్తోందంటున్నారు. ‘ఆయుధాలను ఉంచుకోవాలనే ఉద్దేశంతోనే హమాస్‌ ఇప్పటికీ ఉంది. నిరాయుధీకరణ రెండో దశ చర్చలు ప్రారంభమయ్యేటప్పటికి గాజాపై పట్టు నిలుపుకోవాలనే పట్టుదలతో ఉంది’అని విశ్లేషకులు అంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement