
షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సు అనంతరం, భారత్–రష్యా సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు రష్యా బంపరాఫ్ ఇచ్చింది. ముడి చమురుపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. సెప్టెంబర్ చివరి, అక్టోబర్‌లో లోడ్ అయ్యే ఉరల్స్ గ్రేడ్ చమురు బ్యారెల్‌కు 3నుంచి 4 డాలర్ల వరకు తగ్గింపు ఇవ్వనున్నట్లు బ్లూంబర్గ్ నివేదిక వెల్లడించింది.
ఎస్‌సీవో సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇద్దరూ ఒకే కారులో ప్రయాణిస్తూ, దాదాపు గంట పాటు చర్చలు జరిపారు. ఈ సమావేశం అనంతరం, రష్యా భారత్‌కు చమురు డిస్కౌంట్ ప్రకటించడం గమనార్హం.
మరోవైపు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ట్రంప్ ప్రభుత్వం భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులపై 50శాతం టారిఫ్ విధించింది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్..ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి భారత్ మద్దతిస్తుందని అక్కసు వెళ్లగక్కారు.
అయితే,భారత్ మాత్రం రష్యా చమురు కొనుగోళ్లను సమర్థిస్తోంది. చమురు ఎక్కడ తక్కవ దొరికితే అక్కడ నుంచి కొనుగోలు చేస్తామని కుండబద్దలు కొట్టి చెప్పింది. అమెరికా విధించిన టారిఫ్‌లను భారత్ వ్యతిరేకిస్తోంది. ఈ పరిణామాలు భారత్ అంతర్జాతీయ వ్యూహాత్మక సంబంధాల్లో కీలక మలుపు తిరగనుంది. చమురు వ్యాపారం కేవలం ఆర్థిక అంశం మాత్రమే కాదు. ఇది అంతర్జాతీయంగా పలుదేశాల్ని ప్రభావితం చేసే శక్తివంతమైన సాధనమని నిపుణులు అభివర్ణిస్తున్నారు.
Always a delight to meet President Putin! pic.twitter.com/XtDSyWEmtw
— Narendra Modi (@narendramodi) September 1, 2025