మోదీ మాటిచ్చారు..! | Donald Trump says Modi pledged to stop buying Russian oil | Sakshi
Sakshi News home page

మోదీ మాటిచ్చారు..!

Oct 17 2025 4:36 AM | Updated on Oct 17 2025 4:36 AM

Donald Trump says Modi pledged to stop buying Russian oil

రష్యా నుంచి ముడిచమురు కొనడం ఆపేస్తామన్నారు  

ఉక్రెయిన్‌పై యుద్ధం ముగించడానికి ఇదొక కీలకమైన ముందడుగు   

చైనా కూడా ఇక భారత్‌ దారిలో నడవాలి   

మోదీ నా మిత్రుడు, గొప్ప నాయకుడు.. ఆయనకు నేనంటే ప్రేమ  

యుద్ధం ముగిశాక రష్యాతో ఇంధన బంధం పునరుద్ధరించుకోవచ్చు  

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పషీ్టకరణ  

ట్రంప్‌ ప్రకటనను ఖండించిన భారత విదేశాంగ శాఖ  

వాషింగ్టన్‌: రష్యా నుంచి భారత్‌ చౌకగా ముడిచమురు కొనుగోలు చేస్తుండడం పట్ల చాలా రోజులుగా అసహనంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తామంటూ తన మిత్రుడు, భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని స్పష్టంచేశారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని నిలిపివేసే విషయంలో ఇదొక కీలకమైన ముందడుగు అవుతుందని అన్నారు. 

చమురు కొనడం ఆపేస్తే రష్యాపై ఒత్తిడి పెరుగుతుందని, తద్వారా ఉక్రెయిన్‌పై దండయాత్ర ఆగిపోతుందని ఉద్ఘాటించారు. వైట్‌హౌస్‌లోని ఓవల్‌ ఆఫీసులో బుధవారం ట్రంప్‌ మీడియాతో మాట్లాడారు. రష్యా నుంచి భారత్‌ ముడిచమురు కొనుగోలు చేస్తుండడం తమకు ఎంతమాత్రం సంతోషం కలిగించడం లేదని తేల్చిచెప్పారు. ఇలాంటి కొనుగోళ్ల వల్ల రష్యాకు ఆర్థికంగా మేలు జరుగుతోందని, అంతిమంగా ఆ సొమ్మంతా ఉక్రెయిన్‌పై యుద్ధానికే ఖర్చవుతోందని తెలిపారు. 

ఎవరైనా సరే రష్యాకు ఆర్థికంగా సాయం అందించడం మానుకోవడం మంచిదని హితవు పలికారు. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న మతిలేని యుద్ధంలో లక్షల మంది బలైపోయారని ట్రంప్‌ ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే రష్యా నుంచి చమురు కొనడం నిలిపివేస్తామంటూ ఈరోజు తన మిత్రుడు మోదీ మాట ఇచ్చారని పేర్కొన్నారు. ఇక చైనా సైతం అదే దారిలో నడుస్తుందని తాము ఆశిస్తున్నట్లు తెలియజేశారు. చైనా ప్రభుత్వం రష్యా నుంచి చమురు దిగుమ తి చేసుకోవడం ఆపేస్తే మంచిదని సూచించారు.  

త్వరలోనే ఆ ప్రక్రియ పూర్తవుతుంది  
ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు అంటూ ట్రంప్‌ ప్రశంసించారు. తానంటే మోదీకి ఎంతో ప్రేమ అని వ్యాఖ్యానించారు. ఇక్కడ ప్రేమ అనే పదాన్ని మరోలా అర్థం చేసుకోవద్దని మీడియా ప్రతినిధులను కోరారు. మోదీ రాజకీయ జీవితానికి ఇబ్బందులు సృష్టించాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. మోదీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ‘‘భారత్‌ను చాలా ఏళ్లుగా గమనిస్తున్నా. అదొక నమ్మశక్యంకాని దేశం. ప్రతి సంవత్సరం ఒక కొత్త నాయకుడు అధికారంలోకి వస్తుంటారు. 

కొందరైతే కొన్ని నెలలపాటే ఉండొచ్చు కూడా. కానీ, నా స్నేహితుడు మోదీ చాలాఏళ్లుగా వరుసగా అధికారంలో కొనసాగుతున్నారు. రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తామంటూ ఆయన నాకు మాట ఇచ్చారు. నిజంగా నాకు తెలియదు గానీ అదొక బ్రేకింగ్‌ స్టోరీ కావొచ్చు! మోదీ వెంటనే ఆ పని చేయకపోవచ్చు. నా అంచనా ప్రకారం కొంత సమయం పట్టొచ్చు. కానీ, త్వరలోనే ఆ ప్ర క్రియ పూర్తవుతుంది. ఉక్రెయిన్‌పై యుద్ధం ముగిసిన తర్వాత రష్యాతో వాణిజ్య సంబంధాలను భారత్‌ పునరుద్ధరించుకోవచ్చు’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.  

పాక్‌ను అనబోయి..
భారత్‌లో ఏడాదికొక పాలకుడు అధికారంలోకి వస్తాడంటూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పాకిస్తాన్‌ పరిస్థితిని ట్రంప్‌ పొరపాటున భారత్‌కు అన్వయించి మాట్లాడినట్లు సోషల్‌ మీడియాలో చర్చ జరుగతోంది. ట్రంప్‌ మానసిక ఆరోగ్యంపై అనుమానాలు తలెత్తుతున్నాయని జనం పోస్టులు చేస్తున్నారు. నిజానికి భారత్‌లో ఏడాదికొక ప్రధానమంత్రి మారిపోయిన సందర్భాలు లేవు. పాకిస్తాన్‌లోనే అలాంటి పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే.

అంతా అబద్ధం
‘మోదీ, ట్రంప్‌ ఫోన్‌ సంభాషణ జరగలేదు’   
రష్యా చమురు విషయంలో ప్రధాని మోదీ హామీ ఇచ్చారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటనను భారత విదేశాంగ శాఖ గురువారం ఖండించింది. బుధవారం మోదీ, ట్రంప్‌ మధ్య ఫోన్‌లో ఎలాంటి సంభాషణ జరగలేదని తేల్చిచెప్పింది. ట్రంప్‌ చెప్పిందంతా అబద్ధమని పరోక్షంగా స్పష్టంచేసింది. దేశ అవసరాలు, ప్రయోజనాల కోణంలోనే రష్యా నుంచి ముడిచమురు కొంటున్నామని, ఇందులో మరో మాటకు తావులేదని ఒక ప్రకటనలో వెల్లడించింది. తమ ఇంధన విధాన నిర్ణయాలకు స్థిరమైన ధరలు, నిరంతరాయమైన సరఫరానే పతిప్రాదిక అని పేర్కొంది. మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా ఇంధన దిగుమతుల్లో మార్పులుచేర్పులు చేసుకుంటున్నామని ఉద్ఘాటించింది. ఇంధన వనరుల్లో వైవిధ్యం కొనసాగిస్తున్నామని విదేశాంగ శాఖ వివరించింది.  

ట్రంప్‌ను చూస్తే మోదీకి భయం:  రాహుల్‌  
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎద్దేవా చేశారు. కీలకమైన ప్రభుత్వ నిర్ణయాలను మోదీ అమెరికాకు ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చినట్లు కనిపిస్తోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వ పాలనలో విదేశాంగ విధానం పూర్తిగా కుప్పకూలిందని మండిపడ్డారు. 

రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తామంటూ మిత్రుడు మోదీ మాట ఇచ్చారని ట్రంప్‌ ప్రకటించడంపై రాహుల్‌ గురువారం తీవ్రంగా స్పందించారు. రష్యా చమురు విషయంలో భారత ప్రభుత్వం తరఫున నిర్ణయాలు తీసుకొని, ప్రకటనలు చేసే అధికారాన్ని ట్రంప్‌కు మోదీ కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

 ట్రంప్‌ వల్ల తరచుగా ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికీ అభినందన సందేశాలు పంపిస్తున్నారని ప్రధానమంత్రిపై ధ్వజమెత్తారు. ఈ మేరకు రాహుల్‌ ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. మోదీకి పలు ప్రశ్నలు సంధించారు. భారత ఆర్థిక శాఖ మంత్రి అమెరికా పర్యటనను ఎందుకు రద్దు చేశారో చెప్పాలన్నారు. హమాస్‌–ఇజ్రాయెల్‌ యుద్ధాన్ని ముగించే విషయంలో ఈజిప్టులోని షెర్మ్‌ ఎల్‌–õÙక్‌లో జరిగిన భేటీకి ప్రధాని మోదీ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. అమెరికా ఒత్తిడి కారణంగానే ఆపరేషన్‌ సిందూర్‌ ఆగిపోయిందంటూ డొనాల్డ్‌ ట్రంప్‌ పదేపదే చెబుతున్నా ప్రధాని మోదీ ఎందుకు ఖండించడం లేదని రాహుల్‌ గాంధీ నిలదీశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement