
స్వయంగా పర్యవేక్షించిన పుతిన్
మాస్కో: ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ముగించే విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ మధ్య హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో జరగాల్సిన భేటీ అనూహ్యంగా రద్దయ్యింది. ఈ సమావేశం ఎప్పుడు జరుగుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అసలు జరుగు తుందో లేదో కూడా తెలియడం లేదు. ట్రంప్‌ను కలుసుకోవడానికి పుతిన్ ఇష్టపడడం లేదని సమాచారం.
ఈ నేపథ్యంలో పుతిన్ బుధవారం రష్యా వ్యూహాత్మక అణు దళాల విన్యాసాలను పర్యవేక్షించడం గమనార్హం. ఈ విషయాన్ని పుతిన్ టీవీలో ప్రకటించారు. అలాగే ఆయన రష్యా సైనికాధికారులను ఉద్దేశించి ఆన్‌లైన్‌లో మాట్లాడారు. న్యూక్లియర్ డ్రిల్స్‌లో భూఉపరితలం, సముద్రం, గగనతలానికి సంబంధించిన దళాలు పాల్గొన్నట్లు తెలిపారు. ఈ విన్యాసాల్లో భాగంగా ఖండాంతర బాలిస్టిక్ మిస్సైళ్లు, గగనతల క్రూయిజ్ మిస్సైళ్లను ప్రాక్టికల్‌గా ప్రయోగించినట్లు రష్యా అధికార వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి.
పుతిన్ స్వయంగా పర్య వేక్షించారని పేర్కొన్నాయి. వ్యూహాత్మక అణు జలాంతర్గామి బ్రియాన్స్‌క్, టీయూ 095 ఎంఎస్ వ్యూహాత్మక బాంబర్లు సైతం ఇందులో పాల్గొన్నట్లు తెలిపాయి. పుతిన్, ట్రంప్ భేటీపై ప్రస్తుతానికి తమ కు ఎలాంటి సమాచారం లేదని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ స్పష్టంచేశారు. పుతిన్‌తో సమావేశంపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ప్రకటించారు. మరోవైపు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మధ్య జరగాల్సిన సమావేశం కూడా నిరవధికంగా వాయిదా పడడం గమనార్హం.