ఇజ్రాయెల్‌లో సంబరాలు.. హమాస్‌ నుంచి బందీల విడుదల | Israel Hostages Released by Hamas: Red Cross Facilitates Safe Return | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌లో సంబరాలు.. హమాస్‌ నుంచి బందీల విడుదల

Oct 13 2025 11:25 AM | Updated on Oct 13 2025 12:48 PM

Israel 7 Hostage released By Hamas begins in Gaza

జెరూసలేం: దాదాపు రెండేళ్లుగా హమాస్‌ చెరలో బందీలుగా ఉన్న వారికి విముక్తి లభించింది. గాజాలో బందీల విడుదల మొదలైంది. తొలివిడతలో తాజాగా ఏడుగురు ఇజ్రాయెల్‌ బందీలను హమాస్‌.. రెడ్‌ క్రాస్‌కు అప్పగించింది. ఆ తర్వాత కొద్ది సేపటికి మిగిలిన వారిని విడుదల చేసినట్టు తెలుస్తోంది. దీంతో, ఇప్పటికే రెడ్‌క్రాస్‌ వాహనశ్రేణి ఖాన్‌ యూనిస్‌కు చేరుకుంది.

ఈ క్రమంలో ప్రధాని నెతన్యాహు, ఆయన సతీమణి బందీలకు స్వాగతం పలుకుతూ సందేశం విడుదల చేశారు. ఈ మేరకు టైమ్స్‌ ఆఫ్‌ ఇజ్రాయెల్‌ వెల్లడించింది. మరోవైపు.. బందీల కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు.. తమ వారి కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు బయటకు వచ్చాయి. బందీలు హమాస్‌ నుంచి విడుదల అవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో సంబురాలు చేసుకుంటున్నారు. హమాస్‌పై యుద్ధంలో తాము విజయం సాధించినట్టు సంబురాలు జరుపుకుంటున్నారు. 

 

ఇదిలా ఉండగా.. 2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసి 1200 మందిని హత్య చేసి, 251 మందిని హమాస్‌ అపహరించిన విషయం తెలిసిందే. వారిలో కొంత మందిని గతంలో విడుదల చేసింది. కొందరిని ఇజ్రాయెల్‌ సైన్యం రక్షించింది. మరికొంత మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక తొలి దశలో భాగంగా ఇజ్రాయెల్, హమాస్‌ ఇటీవల కాల్పుల విరమణకు అంగీకరించాయి. శుక్రవారం నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది.

ఇందులో భాగంగా తమ వద్ద ఉన్న 48 మంది బందీలను హమాస్‌ విడిచిపెట్టనుంది. ఇందులో 20 మంది సజీవంగా ఉన్నారు. ఇందుకు ప్రతిగా 2వేల మందికి పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్‌ విడుదల చేయనుంది. వీరంతా సోమవారం సాయంత్రం జైళ్ల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ విడుదల కార్యక్రమం ముగిసిన తర్వాత ట్రంప్‌ శాంతి ప్రణాళికలో రెండో దశపై చర్చలు ప్రారంభమవుతాయి. ఇందులో హమాస్‌ ఆయుధాలను త్యజించడం.. గాజా నుంచి ఇజ్రాయెల్‌ దళాల ఉపసంహరణ ప్రధాన అంశాలు. ఈ చర్చలకు అమెరికా, ఈజిప్టు, ఖతార్‌ మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement