
గాజా ఉత్తర ప్రాంతంలోని స్వస్థలాలకు వెళ్తున్న పాలస్తీనియన్లు
ధ్రువీకరించిన ఇజ్రాయెల్ మిలటరీ
శుక్రవారం మధ్యాహ్నం నుంచి నెలకొన్న ప్రశాంతత
గాజా/ కైరో: హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ రెండేళ్ల క్రితం గాజాలో ప్రారంభించిన విధ్వంసక యుద్ధం ముగిసిన జాడలు కనిపిస్తు న్నాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి గాజాలో ప్రశాంత వాతావరణం నెలకొంది. పాలస్తీని యన్లపై కాల్పులు, వైమానిక దాడులు నిలిచిపోయాయి. ఆ ప్రాంతంలో కాల్పుల విరమణ ఒప్పందం మధ్యాహ్నం నుంచి అమల్లోకి వచ్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం సైతం ధ్రువీకరించింది.
యుద్ధానికి విరామం ఇవ్వడానికి, మిగిలిన బందీలను పాలస్తీనా ఖైదీలతో మార్పిడి చేయడానికి సంబంధించిన ఒప్పందాన్ని ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు ప్రధాని నెతన్యాహూ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆర్మీ ఈ మేరకు ప్రకటించడం గమనార్హం. దీంతో, సెంట్రల్ గాజాలోని వాడి గాజాలో గుమికూడిన వేలాది మంది పాలస్తీనియన్లు ఉత్తర ప్రాంతంలోని తమ సొంత నివాసాల దిశగా నడక సాగించారు.
24 గంటల్లో 11 మంది మృతి
గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు గాజా వ్యాప్తంగా ఇజ్రాయెల్ ఆర్మీ భారీగా కాల్పులు జరిపిందని స్థానికులు తెలిపారు. ఆర్మీ ప్రకటన తర్వాత కాల్పుల శబ్దాలు వినిపించలేదన్నారు. సైనిక విమానాలు తక్కువ ఎత్తులో ఎగురుతూ కనిపించాయని చెప్పారు. ఇలా ఉండగా, 24 గంటల వ్యవధిలో గాజా వ్యాప్తంగా ఇజ్రాయెల్ ఆర్మీ చేపట్టిన దాడుల్లో 11 మంది పాలస్తీనియన్లు చనిపోగా మరో 49 గాయపడ్డారని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. తమ బలగాలకు ప్రమాదకరమనిపించిన లక్ష్యాలపైనే దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. దీనిపై హమాస్ మండిపడింది.
విడుదలవనున్న మర్వాన్ బర్ఘౌటి
ఒప్పందం ప్రకారం...గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలను ఉపసంహరించుకున్న అనంతరం హమాస్ తమ వద్ద బందీలుగా ఉన్న 48 మందిని విడుదల చేయాల్సి ఉంటుంది. వీరిలో కనీసం 20 మంది మాత్రమే సజీవంగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఇందుకు బదులుగా 2 వేల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెడుతుంది. వీరి జాబితాను శుక్రవారం అధికారులు విడుదల చేశారు. ఇందులో పాలస్తీనా అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత మర్వాన్ బర్ఘౌటి కూడా ఉన్నారు. బందీలు, ఖైదీల విడుదల ఆదివారం రాత్రి లేదా సోమవారం మొదలవుతుందని మధ్యవర్తులుగా వ్యవహరించిన ఈజిప్టు అధికారులు తెలిపారు.
సిద్ధంగా మానవతా సాయం
గాజాలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో మానవతా సాయం తీసుకువచ్చిన ట్రక్కులు సాధ్యమైనంత త్వరగా చేరుకునేందుకు ఈజిప్టు, గాజా మధ్యనున్న రఫా సహా ఐదు సరిహద్దులను తెరిచి ఉంచనున్నారు. సుమారు 1.70 లక్షల టన్నుల మందులు, ఆహారం, ఇతర అత్యవసరా లను గాజాలోకి తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని ఐరాస మానవతా సాయం చీఫ్ టామ్ ఫ్లెచర్ తెలిపారు. సానుకూల సంకేతాలు అందిన వెంటనే రంగంలోకి దిగుతామని చెప్పారు. ఇజ్రాయెల్‌తో కుదిరిన డీల్ ప్రకారం కాల్పుల విరమణ ఒప్పందం అమలును పర్యవేక్షించేందుకు 200 మంది సైనికులను గాజాకు పంపుతామని అమెరికా అధికారులు చెప్పారు.
కత్తి మెడపైనే ఉంది: నెతన్యాహూ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెరపైకి తెచ్చిన కాల్పుల విరమణ ప్రణాళికలో పేర్కొన్న హమాస్ నిరాయుధీకరణ, గాజా భవిష్యత్తు పాలన వంటి అంశాలపై ఎటువంటి స్పష్టత లేదు. ‘ట్రంప్ ప్రకటనలో తర్వాతి భాగం హమాస్ నిరాయుధీకరణే. ఇది సులువుగా జరిగితే సరేసరి. లేదంటే బలవంతంగానైనా సాధిస్తాం. మెడపై కత్తి ఉందని తెలిసే హమాస్ ఒప్పందానికి వచ్చింది. ఇప్పటికీ కత్తి మెడపైనే ఉంది’అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ పేర్కొనడం గమనార్హం. కాగా, శుక్రవారం మధ్యాహ్నం అధికారికంగా కాల్పుల విరమణ ప్రారంభమవడానికి కొద్ది గంటల ముందుగానే బలగాల ఉపసంహరణ పూర్తయిందని ఇజ్రాయెల్ బ్రిగేడియర్ జనరల్ ఎఫ్పీ డెఫ్రిన్ చెప్పారు. ఉపసంహరణ అంశం సున్నితత్వం దృష్ట్యా గాజాలోని ఇటీవల స్వాధీనం చేసుకున్న 50 శాతం ప్రాంతంలో బలగాలు కొనసాగుతాయని ఓ సైనికాధికారి పేర్కొనడం విశేషం.