
న్యూఢిల్లీ: ఈజిప్టులోని ఎర్ర సముద్ర తీర నగరం షర్మ్ ఎల్ షేక్‌లో సోమవారం జరిగే శాంతి శిఖరాగ్ర సదస్సు(పీస్ సమిట్)కు మన దేశం తరఫున కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ హాజరవనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా 20కి పైగా దేశాల నేతలు పాల్గొనే ఈ సమావేశానికి రావాలంటూ ఈజిప్టు అధ్యక్షుడు ఎల్ సిసి ప్రధాని మోదీకి ఆదివారం ఆహ్వానం పంపించారు.
అయితే, ఆయన తన బదులుగా మంత్రి కేవీ సింగ్‌ను పంపిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గాజాతోపాటు పశ్చిమాసియాలో శాంతి నెలకొల్ప డమే లక్ష్యంగా జరిగే కార్యక్రమానికి ఈజిప్టు అధ్యక్షు డు ఎల్ సిసి, ట్రంప్ సహాధ్యక్షత వహించనున్నారు. గాజా శాంతి ఒప్పందంపై ఈ సందర్భంగా సంతకాలు జరుగుతాయి. శిఖరా గ్రానికి ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటె రస్, యూకే ప్రధాని స్టార్మర్, ఇటలీ ప్రధాని మెలోనీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తదితర నేతలు హాజరవ నున్నారు.
బాంబు పేల్చిన హమాస్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందం అమలుపై అప్పుడే అనుమానాలు ముసురుకుంటున్నాయి. ఆదివారం హమాస్ చేసిన ప్రకటనే ఇందుకు తాజా ఉదాహరణ. సోమవారం ఈజిప్టులో జరిగే శాంతి శిఖరాగ్రాన్ని తాము బహిష్కరిస్తున్నామని హమాస్ తెలిపింది. ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందంపై తాము సంతకం చేసేది లేదని స్పష్టం చేసింది.