తుపాను బీభత్సం.. 44 మరణాలు.. మేయర్‌పై దాడి​కి యత్నం | Heavy Rain And Floods In Mexico | Sakshi
Sakshi News home page

Mexico: తుపాను బీభత్సం.. 44 మరణాలు.. మేయర్‌పై దాడికి యత్నం

Oct 13 2025 7:51 AM | Updated on Oct 13 2025 9:01 AM

Heavy Rain And Floods In Mexico

పొజారికా: మెక్సికోలో మధ్య, ఆగ్నేయ ప్రాంతాల్లో తుపాను బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు, వరదలకు సంబంధించిన ఘటనల్లో కనీసం 44 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. వెరాక్రుజ్‌ రాష్ట్రంలో ఈ నెల 6–9 తేదీల మధ్యలో అత్యధికంగా 54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో, కజొనెస్‌ నది పొంగి ప్రవహించింది. శుక్రవారం వేకువజామున పొజారికా వీధుల్లో నాలుగు మీటర్ల మేర వరద ప్రవహించింది. వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి.  

తుపాను బీభత్సం కారణంగా పొజారికాలో ప్రజలు బురద నీటిలోనే జీవనం కొనసాగిస్తున్నారు. వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో పరిస్థితిని పరిశీలించేందుకు అక్కడికి వచ్చిన మేయర్‌పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి ప్రయత్నించారు. ఆయన కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఆగ్రహంతో స్థానికులు.. మేయర్‌ వాహనంపై రాళ్లు రువ్వి, బురద చల్లారు. విపత్తు సమయంలో ముందస్తుగా తమను ఎందుకు హెచ్చరించలేదని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

మరోవైపు.. వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ప్రాణనష్టం పెరిగింది. దీంతో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాల గవర్నర్‌లను సమావేశపరిచి అత్యవసర ప్రతిస్పందన ప్రణాళికను నిర్దేశించారు. కాగా, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement