
ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందానికి హమాస్ సిద్ధంగా ఉందని.. బందీల విడుదలకు అంగీకరించిందిని.. గాజాలో దాడులు ఆపాలని.. అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయెల్‌కు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ మాటను లెక్కచేయకుండా మళ్లీ దాడులు కొనసాగిస్తోంది. శనివారం గాజాలో ఇజ్రాయెల్ బలగాలు జరిగిపిన దాడుల్లో ఆరుగురు మరణించారు.
బందీల విడుదలతో పాటు ట్రంప్ ప్రతిపాదనలో పలు అంశాలకు హమాస్ అంగీకరించిందని.. అమెరికా ఈ యుద్ధాన్ని ముగించే దిశగా ముందుకు వెళ్తోందని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. అటుపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు సైతం ‘ట్రంప్ గాజా ప్లాన్’(Trump Gaza Plan) తొలి దశ తక్షణమే అమలు కాబోతోందని అన్నారు. ఆ వెంటనే ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ సైతం దీనిని ధృవీకరించారు. దీంతో పలు దేశాల అధినేతలూ ట్రంప్ కృషికి అభినందనలు తెలియజేశారు కూడా. అయితే..
అనూహ్యాంగా.. ఈ ప్రకటనలు వెలువడిన గంటల వ్యవధిలోనే గాజాపై ఇజ్రాయెల్ బలగాలు(Israel Attacks Gaza Agian) విరుచుకుపడ్డాయి. గాజా సిటీలో జరిపిన దాడుల్లో నలుగురు పౌరులు మృతి చెందగా.. దక్షిణ భాగంలోని ఖాన్ యూనిస్ వద్ద మరో ఇద్దరు చనిపోయినట్లు అక్కడి అధికారులు ధృవీకరించారు. అయితే తాజా దాడులపై ఇజ్రాయెల్, అమెరికా, హమాస్ వైపుల నుంచి స్పందన రావాల్సి ఉంది.
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సరిహద్దులో హమాస్ సంస్థ జరిపిన మెరుపు దాడిలో 1,200 మంది మరణించారు. మరో 251 మంది బంధీలుగా తీసుకెళ్లారు. పాలస్తీనియన్ భూభాగాల్లో ఇజ్రాయెల్ సెటిల్‌మెంట్ల విస్తరణ.. వాళ్ల చేతుల్లో పాలస్తీనా పౌరులు హింసకు గురి కావడం, అల్-అక్సా మసీదు వద్ద ఘర్షణలు, జెనిన్ శరణార్థి శిబిరంపై దాడులు.. ఈ వరుస పరిణామాలు హమాస్ దాడికి కారణాలు. ఈ భారీ దాడికి ప్రతిగా..
ఇజ్రాయెల్ గాజాపై ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్ చేపట్టింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా జరిపిన దాడుల్లో 66, 000 మందికి పైగా మరణించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారు. విధ్వంసంతో పాటు గాజాను దిగ్భంధించి.. మానవతా సాయాన్ని అందకుండా ఇజ్రాయెల్ బలగాలు చేశాయి. విద్యుత్ కొరత, తిండి, నీరు లేక అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
అయితే తాము హమాస్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతున్నామని, పౌరులను రక్షణ కవచంలా వాళ్లు ఉపయోగించుకుంటున్నారంటూ ఇజ్రాయెల్ చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో ట్రంప్ ఎంట్రీతో పరిస్థితి మారింది. అదే సమయంలో బంధీల విడుదల కోసం ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెరుగుతూ వస్తోంది.. ఈ తరుణంలో..
ట్రంప్ ప్రతిపాదించిన 20-పాయింట్ల శాంతి ఒప్పందానికి హమాస్ అంగీకారం తెలిపింది. ప్రస్తుతం 48 మంది బంధీలు ఉన్నారని, వారిలో 20 మంది జీవించి ఉన్నారని తెలుస్తోంది. తొలి దశలో భాగంగా.. బంధీల విడుదలకు సిద్ధంగా ఉందని తెలిపింది.