సౌదీ అరేబియా చట్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కఠినమైన షరియత్ నియామాలను అమలు చేసే ఆ దేశంలో చిన్న తప్పుచేసినా శిక్షలు తీవ్రంగా ఉంటాయి. తాజాగా ఇమ్మిగ్రేషన్, కార్మిక భద్రతా చట్టాలను ఉల్లంఘించిన 14 వేలకు పైగా కార్మికులను సౌదీ నుండి బహిష్కరించినట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం వివిధ చట్టాలు ఉల్లంఘించిన 14,621 విదేశీ కార్మికులను దేశం నుంచి బహిష్కరించినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. వీరితో పాటు చట్టాలు ఉల్లంఘించిన 18,054 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అరెస్టైయిన వారిలో 3,853 మందిని చట్టాలు పాటించనందుకు అదుపులోకి తీసుకోగా సరిహద్దు భద్రతా నియమాలను ఉల్లంఘించినందుకు 2,853మంది మందిని, అక్రమంగా దేశంలోకి చొరబడే యత్నం చేసినందుకు 1,491 మంది విదేశీయులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. వీరిలో అధికంగా ఇథియోపియన్లు 59 శాతం, యెమెన్ పౌరులు 40శాతం ఉన్నట్లు పేర్కొన్నారు.
కాగా ఇటీవల అక్రమంగా సౌదీలోకి ప్రవేశించిన వ్యక్తికి అక్కడే పనిచేసే ఓ భారతీయుడు అతని సమాచారం తెలియక లిప్ట్ ఇచ్చాడు. అనంతరం అధికారులు అతనిని పట్టుకున్నారు. దీంతో అక్రమంగా ప్రవేశించిన వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చాడని అతనిని జైలులో వేశారు. అనంతరం అతని ఉద్యోగం సైతం ఊడింది. కనుక సౌదీలో ఉండే విదేశీ కార్మికులు అప్రమత్తంగా ఉండాలని పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని అక్కడ ఉండే భారతీయులు సూచిస్తున్నారు.


