ఐఫోన్‌ అయితే వాడినా ఓకే | India Refurbished Phone Market Up says Counterpoint | Sakshi
Sakshi News home page

ఐఫోన్‌ అయితే వాడినా ఓకే

Jan 20 2026 4:35 AM | Updated on Jan 20 2026 4:35 AM

India Refurbished Phone Market Up says Counterpoint

మొబైల్‌ మార్కెట్‌లో సైలెంట్‌ రివల్యూషన్‌ 

రీఫర్బిష్డ్‌ ఫోన్లకు డిమాండ్‌ 

కొత్త ఫోన్ల రేట్లు పెరుగుతుండటమే కారణం 

2025లో రీఫర్బిష్డ్ మార్కెట్‌ 8 శాతం వృద్ధి

దేశీయంగా కొత్త డివైజ్‌ల రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో సెకండ్‌హ్యాండ్‌ స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్‌ నెలకొంది. దీంతో రీఫర్బిష్డ్ ఫోన్ల మార్కెట్‌ గణనీయంగా విస్తరిస్తోంది. కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ ప్రకారం 2025లో 7–8 శాతం మేర వృద్ధి చెందిన సెకండరీ మార్కెట్‌ ఈ ఏడాది కూడా అదే జోరు కనబర్చవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు మెరుగుపడుతుండటం, ఆన్‌లైన్‌–ఆఫ్‌లైన్‌ మాధ్యమాల ద్వారా నేరుగా కస్టమర్లకు మరింత అందుబాటు స్థాయిలో లభిస్తుండటంలాంటి అంశాలు రీఫర్బిష్డ్‌ ఫోన్ల విక్రయాలు పెరిగేందుకు దోహదపడగలవని పేర్కొన్నారు.  

కొత్త వ్యూహాలు.. థర్డ్‌ పార్టీలు రీఫర్బిష్‌ చేసి, అమ్మే డివైజ్‌లలో నాణ్యత సరిగ్గా లేకపోవడం, రిటర్నులు ఎక్కువగా వస్తుండటంతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లాంటి దిగ్గజాలు గతేడాది ఈ విభాగం నుంచి తప్పుకున్నప్పుడు కొంతకాలం అమ్మకాలు నెమ్మదించినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సదరు ప్లాట్‌ఫాంలపై ఆధారపడిన విక్రేతల వ్యాపారం తాత్కాలికంగా దెబ్బతిందని వివరించాయి. దీనితో నేరుగా వినియోగదారులను చేరుకునే వ్యూహాలకు క్యాషిఫై, కంట్రోల్‌జెడ్‌లాంటి సంస్థలు పదును పెట్టాయి. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలను, ఆఫ్‌లైన్‌ రిటైల్‌ నెట్‌వర్క్‌లను విస్తరించాయి.   

ప్రభావం ఇంకా తెలియడం లేదు.. చాలామటుకు బ్రాండ్స్‌ దగ్గర 60–90 రోజుల వరకు సరిపడేంత నిల్వలు ఉండటం వల్ల రేట్ల పెంపు ప్రభావం పూర్తి స్థాయిలో ఇంకా తెలియడం లేదు. కొత్త డివైజ్‌ల రేట్లు 15–20 శాతం పెరిగాయంటే చాలు, కోవిడ్‌ కాలంలోలాగా రీఫర్బిష్డ్ ఫోన్లకు డిమాండ్‌ భారీగా పెరుగుతుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. అప్పట్లో సరఫరాపరమైన సవాళ్ల వల్ల కొత్త ఫోన్లకు కొరత ఏర్పడి, కొనుగోలుదార్లు సెకండ్‌హ్యాండ్‌ డివైజ్‌ల వైపు మళ్లాల్సి వచి్చంది. ప్రస్తుతం కూడా మెమరీ, చిప్‌ల వ్యయాలు పెరిగి కొత్త డివైజ్‌ల రేట్లు గణనీయంగా పెరుగుతున్నాయని క్యాషిఫై వర్గాలు వివరించాయి.  

ఎంట్రీ లెవెల్‌ షాక్‌.. అత్యధిక మార్కెట్‌ వాటా ఉండే ఎంట్రీ లెవెల్‌ స్మార్ట్‌ఫోన్ల విభాగంలో రేట్ల పెంపు షాక్‌ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రూ. 10,000గా ఉన్న హ్యాండ్‌సెట్స్‌ రేటు వచ్చే ఆరు నెలల్లో దాదాపు 50 శాతం పెరిగి రూ. 15,000కు చేరొచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇదే అతి పెద్ద సెగ్మెంట్‌ కావడంతో తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని, దీనితో కస్టమర్లు రీఫర్బిష్డ్ డివైజ్‌ల వైపు డిమాండ్‌ మళ్లొచ్చని ఆశిస్తున్నట్లు వివరించాయి. అయితే, రేట్లు పెరగడమనేది మరో ప్రతికూల పరిణామానికి కూడా దారి తీయొచ్చని భావిస్తున్నారు. 

యూజర్లు తమ పాత డివైజ్‌లను మరింత కాలం అట్టే పెట్టుకునేందుకు ప్రాధాన్యతనివ్వొచ్చని, ఫలితంగా మార్కెట్లో సరఫరా తగ్గొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏటా అమ్ముడయ్యే ఫోన్లలో దాదాపు 50 శాతం డివైజ్‌లు రీఫర్బిష్డ్ లేదా ఎక్సే్చంజ్‌ మార్కెట్లోకి రావడానికి అనువైనవిగానే ఉంటున్నాయి. కానీ ఇందులో సగం మాత్రమే మార్కెట్లోకి వస్తున్నాయి. మిగతా వాటిని యూజర్లు నిరుపయోగంగా డ్రాలలో పడేయడమో లేక తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఇవ్వడమో చేస్తున్నారు. ఈ–వ్యర్థాలు, పాత డివైజ్‌ల విక్రయ విలువ గురించి అవగాహన లేకపోవడమే ఇందుకు కారణంగా ఉంటోంది. 

ఐఫోన్లే కావాలి.. రీఫర్బిష్‌ చేసిన యాపిల్‌ ఐఫోన్లకు భారీగా డిమాండ్‌ నెలకొంది. వాటి లభ్యత కూడా పెరుగుతోంది. దీనితో 2019లో సుమారు 2 శాతంగా ఉన్న ఐఫోన్ల మార్కెట్‌ వాటా ఇప్పుడు 9 శాతానికి చేరుకుంది. రీఫర్బిష్డ్ సంస్థల మొత్తం అమ్మకాల్లో వీటి వాటా దాదాపు 60 శాతంగా ఉంటోందని పరిశ్రమ అంచనా. లేటెస్ట్‌ డివైజ్‌ల ప్రారంభ ధర ఎక్కువగా ఉండటంతో, యాపిల్‌ డివైజ్‌లను మొదటిసారిగా వాడే వారు, వేరే బ్రాండ్స్‌ బదులుగా దాదాపు అదే రేటుకో అంతకన్నా కాస్త తక్కువ రేటుకో లభించే పాత ఐఫోన్లనే తీసుకోవడంవైపు మొగ్గుచూపుతున్నారు. యాపిల్‌లో ఎంట్రీ లెవెల్‌ మోడల్‌ లేకపోవడంతో ఈ ధోరణి కొనసాగవచ్చని భావిస్తున్నారు. ఆండ్రాయిడ్‌లో ఏడాది, రెండేళ్ల పాత ఫోన్లతో పోలిస్తే నాలుగైదేళ్లు పాతబడ్డ యాపిల్‌ ఫోన్లకు కూడా డిమాండ్‌ బాగా ఉంటోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.  

– సాక్షి బిజినెస్‌ డెస్క్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement