న్యూఢిల్లీ: దేశంలోని 15 ప్రధాన ద్వితీయ శ్రేణి నగరాల్లో ఇళ్ల అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో 4% పెరిగి రూ.37,409 కోట్లకు చేరినట్లు స్థిరాస్తి డేటా అనలిటిక్ సంస్థ ప్రాప్‌ఈక్విటీ నివేదిక తెలిపింది. వార్షిక ప్రాతిపదికన గృహ విక్రయాల సంఖ్య (వాల్యూమ్స్ పరంగా) 4% తగ్గి 39,201 యూనిట్లకు పరిమితమైనట్లు నివేదిక పేర్కొంది. ఇక కొత్తగా మార్కెట్‌లోకి వచి్చన హౌసింగ్ యూనిట్ల సంఖ్య(కొత్త సప్లై) 10% క్షీణించి 28,721కు దిగివచి్చంది.
⇒ అహ్మదాబాద్, సూరత్, గాంధీ నగర్, వడోదర, జైపూర్, నాసిక్, నాగ్‌పూర్, మొహాలి, భువనేశ్వర్, లక్నో, భూపాల్, కొయంబత్తూర్, గోవా త్రివేండ్రం, కొచి్చ.... ఈ 15 నగరాల్లో అతిపెద్ద రియల్ ఎస్టేట్ మార్కెట్ అహ్మదాబాద్‌లో వార్షిక ప్రాతిపదికన ఇళ్ల అమ్మకాలు 6% తగ్గి 13,021 యూనిట్లకు పరిమితమయ్యాయి. సూరత్‌లో విక్రయాలు 8% క్షీణించి 4,936 యూనిట్లకు దిగివచ్చాయి. కొత్త ప్రాజెక్టుల ఆవిష్కరణ, అమ్మకాల్లో 60% గుజరాత్‌లోని ప్రధాన నగరాలైన అహ్మదాబాద్, సూరత్, గాంధీ నగర్, వడోదరల్లో నమోదయ్యాయి.
⇒ భారత ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ప్రధాన శక్తి కేంద్రాలుగా టైర్–2 నగరాలు ఎదుగుతున్నాయని ప్రాప్‌ఈక్విటీ ఫౌండర్, సీఈఓ సమీర్ జసుజా తెలిపారు. ఉద్యోగ అవకాశాల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రాంతాల మధ్య మెరుగుతున్న అనుసంధానం(కనెక్టివిటీ) అంశాలు రియల్ ఎస్టేట్ విభాగాల్లో డిమాండ్‌ను పెంచుతున్నాయని పేర్కొన్నారు.
⇒ సెప్టెంబర్ త్రైమాసికంలో కొత్త గృహ ప్రాజెక్టుల లాంచింగ్ క్షీణించడమనేది మందగమనానికి సంకేతంగా కాకుండా, రియల్ ఎస్టేట్ డెవలపర్లు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమని స్టోన్‌క్రాఫ్ట్ గ్రూప్ వ్యవస్థాపకుడు కీర్తి చిలుకూరి తెలిపారు.


