8 కంపెనీల లిస్టింగ్‌కు ఓకే.. సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ | SEBI Okays IPO Plans of 8 Companies | Sakshi
Sakshi News home page

IPOs: 8 కంపెనీల లిస్టింగ్‌కు ఓకే.. సెబీ గ్రీన్‌ సిగ్నల్‌

Jan 6 2026 8:25 AM | Updated on Jan 6 2026 11:49 AM

SEBI Okays IPO Plans of 8 Companies

సరికొత్త రికార్డులను సృష్టిస్తూ రెండేళ్లుగా కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్లు ఈ కేలండర్‌ ఏడాది(2026)లోనూ దూకుడు చూపనున్నాయి. ఇప్పటికే పీఎస్‌యూ దిగ్గజం కోల్‌ ఇండియా అనుబంధ సంస్థ భారత్‌ కోకింగ్‌ కోల్‌ లిస్టింగ్‌ బాట పట్టగా.. హిందుస్తాన్‌ ల్యాబొరేటరీస్‌ ఐపీవోకు దరఖాస్తు చేసింది. తాజాగా 8 కంపెనీల ప్రాస్పెక్టస్‌లకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వివరాలు చూద్దాం..

కొత్త ఏడాదిలో విభిన్న రంగాలకు చెందిన 8 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు సెబీ నుంచి అనుమతి పొందాయి. జాబితాలో ఆర్‌కేసీపీఎల్‌ లిమిటెడ్, చార్టర్డ్‌ స్పీడ్, గ్లాస్‌ వాల్‌ సిస్టమ్స్‌(ఇండియా), జెరాయ్‌ ఫిట్‌నెస్, శ్రీరామ్‌ ఫుడ్‌ ఇండస్ట్రీ, టెంప్‌సెన్స్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌(ఇండియా), ఇందిరా ఐవీఎఫ్, రేస్‌ ఆఫ్‌ బిలీఫ్‌ చేరాయి. ఈ కంపెనీలన్నీ 2025 జూలై– సెపె్టంబర్‌ మధ్య కాలంలో సెబీకి దరఖాస్తు చేశాయి. ఐపీవోలు విజయవంతమైతే ఈ కంపెనీలన్నీ బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్‌కానున్నాయి. ప్రధానంగా ఫెర్టిలిటీ సర్వీసులందించే ఇందిరా ఐవీఎఫ్, రేస్‌ ఆఫ్‌ బిలీఫ్‌ గోప్యతా మార్గంలో ఐపీవోకు దరఖాస్తు చేసి అనుమతి పొందాయి.

ఆర్‌కేసీపీఎల్‌  
నిర్మాణం, మౌలిక సదుపాయాల కంపెనీ ఆర్‌కేసీపీఎల్‌ లిమిటెడ్‌ ఐపీవో ద్వారా రూ. 1,250 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు అనుగుణంగా రూ. 700 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 550 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఆఫర్‌ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను కార్యకలాపాలు, బ్యాలెన్స్‌షీట్‌ పటిష్టతకు వినియోగించనుంది. రూ. 200 కోట్లు వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు, రూ. 130 కోట్లు నిర్మాణ సంబంధ పరికరాల కొనుగోలుకి వెచ్చించనుంది. రూ. 188 కోట్లు రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కేటాయించనుంది.

చార్టర్డ్‌ స్పీడ్‌ 
ప్రయాణికుల చేరవేత కంపెనీ చార్టర్డ్‌ స్పీడ్‌ లిమిటెడ్‌ ఐపీవోలో భాగంగా రూ. 655 కోట్ల విలువైన ఈక్విటీ ని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 200 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 855 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. నిధుల్లో రూ. 396 కోట్లు రుణ చెల్లింపులకు వెచి్చంచనుండగా, రూ. 97 కోట్లు ఎలక్ట్రిక్‌ బస్సులపై ఇన్వెస్ట్‌ చేయనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కేటాయించనుంది.  

గ్లాస్‌ వాల్‌  
ఫ్యాసేడ్‌ సిస్టమ్స్‌ తయారీ, ఇన్‌స్టలేషన్‌ కంపెనీ గ్లాస్‌ వాల్‌ సిస్టమ్స్‌(ఇండియా) లిమిటెడ్‌ ఐపీవోలో భాగంగా రూ. 60 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 4.02 కోట్ల షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఆఫర్‌ చేయనున్నారు.  

శ్రీరామ్‌ ఫుడ్‌ 
ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లకు బియ్యం ఎగుమతి చేసే శ్రీరామ్‌ ఫుడ్‌ ఇండస్ట్రీ ఐపీవోలో భాగంగా 2.12 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 52 లక్షల షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. 2014లో ఏర్పాటైన కంపెనీ బీ2బీ పద్ధతిలో బియ్యం ఎగుమతులను చేపడుతోంది.

జెరాయ్‌ ఫిట్‌నెస్‌ 
ఫిట్‌నెస్‌ పరికరాల తయారీ కంపెనీ జెరాయ్‌ ఫిట్‌నెస్‌ ప్రమోటర్లు ఐపీవోలో భాగంగా 43.92 లక్షల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ చేయనున్నారు. దీంతో ఐపీవో నిధులు కంపెనీ ప్రమోటర్లకు చేరనున్నాయి. కంపెనీ కస్టమర్లలో కమర్షియల్‌ జిమ్స్, హోటళ్లు, కార్పొరేషన్లు, దేశ, విదేశాలలోని రియల్టీ ప్రాజెక్టులున్నాయి. జిమ్‌ పరికరాలను జపాన్, యూఏఈ, ఆ్రస్టేలియా, స్వీడన్‌ తదితర దేశాలకు ఎగుమతి చేస్తోంది.  

టెంప్‌సెన్స్‌ 
థర్మల్‌ ఇంజినీరింగ్, కేబుళ్ల తయారీ కంపెనీ టెంప్‌సెన్స్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌(ఇండియా) ఐపీవోలో భాగంగా రూ. 118 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.79 కోట్ల షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. 

ఇందిరా ఐవీఎఫ్, రేస్‌ ఆఫ్‌ బిలీఫ్‌ 

ఫెర్టిలిటీ సేవల కంపెనీలు ఇందిరా ఐవీఎఫ్, రేస్‌ ఆఫ్‌ బిలీఫ్‌ గోప్యతా మార్గంలో సెబీకి ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసి అనుమతి పొందాయి. ఇందిరా ఐవీఎఫ్‌ మెయిన్‌ బోర్డులో లిస్ట్‌కానున్నట్లు 2025 జూలైలో ప్రకటించింది. గోప్యతా విధానంలో దరఖాస్తు చేయడం ద్వారా కంపెనీలు ముసాయిదా ప్రాస్పెక్టస్‌ వివరాలను రహస్యంగా ఉంచేందుకు వీలుంటుంది. పబ్లిక్‌ ఇష్యూకి వచ్చే ముందు వివరాలు వెల్లడించే సంగతి తెలిసిందే.

గత రెండేళ్ల రికార్డులిలా 
2025 కేలండర్‌ ఏడాదిలో ప్రైమరీ మార్కెట్లు కదం తొక్కాయి. సరికొత్త చరిత్రకు తెరతీస్తూ 102 కంపెనీలు లిస్టయ్యాయి. తద్వారా రూ. 1.76 లక్షల కోట్లు సమీకరించాయి. దీంతో 2024లో 90 కంపెనీలు ఐపీవోలు చేపట్టడం ద్వారా సమీకరించిన రూ. 1.6 లక్షల కోట్ల రికార్డ్‌ వెనుకబడింది. అంతకుముందు 2023లో 57 కంపెనీలు మాత్రమే పబ్లిక్‌ ఇష్యూకి వచ్చి రూ. 49,436 కోట్లు సమకూర్చుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement