మూడిస్ రేటింగ్స్ నివేదిక
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర సర్కారు తీసుకున్న పన్ను తగ్గింపు నిర్ణయాలు ఆదాయ వృద్ధిని అడ్డుకుంటాయని.. దీంతో ద్రవ్యపరమైన మద్దతుకు పెద్ద అవకాశాల్లేవని మూడిస్ రేటింగ్స్ అభిప్రాయం వ్యక్తం చేసింది.
‘‘ఆదాయ వృద్ధిలో బలహీనత స్పష్టంగా కనిపిస్తోంది. ద్రవ్య స్థిరీకరణ పరంగా అవరోధాలు ఎదుర్కోవచ్చు. కొన్ని పన్ను తగ్గింపులను కూడా చూశాం. ఇది ఆదాయ వృద్ధికి మరింత అడ్డుగా మారొచ్చు. కనుక ద్రవ్యపరమైన మద్దతుకు అవకాశాలు తక్కువగానే ఉన్నాయి’’అని మూడిస్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ పెట్చ్ పేర్కొన్నారు.
సెప్టెంబర్ చివరికి నికర పన్ను వసూళ్లు 12.29 లక్షల కోట్లుగా ఉన్నట్టు ప్రభుత్వ డేటా ఆధారంగా తెలుస్తోంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.12.65 లక్షల కోట్ల కంటే స్వల్పంగా తగ్గడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ప్రభుత్వం వేసుకున్న పన్ను వసూళ్ల అంచనాల్లో 43.3 శాతమే సెప్టెంబర్ చివరికి (ఆరు నెలల్లో) సమకూరింది.
క్రితం ఆర్థిక సంవత్సరం ఆదాయం అంచనాల్లో 49 శాతం మేర తొలి ఆరు నెలల్లో రావడం ఉంది. ఆదాయపన్ను మినహాయింపును కొత్త విధానంలో రూ.7 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచుతూ కేంద్రం ప్రకటించడం తెలిసిందే. ఇక సెప్టెంబర్ 22 నుంచి జీఎస్‌టీ శ్లాబుల్లో తీసుకొచి్చన మార్పులతో 375 ఉత్పత్తులపై పన్ను తగ్గింది. వాస్తవానికి ఈ రేటు తగ్గింపుతో వినియోగం పెరుగుతుందన్నది కేంద్రం అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో ద్రవ్యలోటు 4.4 శాతానికి పరిమితం చేయాలన్నది కేంద్రం లక్ష్యం.
వినియోగం, వ్యయాలే అండ..
ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి దిగిరావడం, వడ్డీ రేట్ల తగ్గింపుతో గృహాల కొనుగోలు శక్తి పెరుగుతుందని, ఇది వినియోగానికి మద్దతునిస్తుందని మార్టిన్ పెట్చ్ అన్నారు. దేశీ వినియోగానికి తోడు మౌలిక వసతుల అభివృద్ధికి చేసే వ్యయాలు భారత ఆర్థిక వృద్ధికి తోడ్పడతాయని.. అమెరికా టారిఫ్‌ల ప్రభావాన్ని సర్దుబాటు చేస్తాయని పేర్కొన్నారు. ఒకవేళ టారిఫ్‌లు ఇక ముందూ గరిష్ట స్థాయిలోనే కొనసాగితే, అది ఇకపై పెట్టుబడులను ప్రతికూలంగా మారొచ్చన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ 2025లో 7 శాతం, 2026లో 6.5 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని గత వారం మూడిస్ అంచనాలు వ్యక్తం చేయడం తెలిసిందే.


