
క్యూ1 ఆదాయాలపై అంచనాలు
వివిధ విభాగాల్లో తగ్గిన డిమాండ్
రాణించనున్న మిడ్ క్యాప్ కంపెనీలు
నేడు టీసీఎస్‌తో ఫలితాల సీజన్ షురూ...
వివిధ విభాగాలవ్యాప్తంగా డిమాండ్ నెమ్మదించడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీ ఐటీ కంపెనీల ఆదాయాల వృద్ధి ఒక మోస్తరు స్థాయికే పరిమితం కావొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. అయితే, మధ్య స్థాయి కంపెనీలు మాత్రం మెరుగ్గా రాణించవచ్చని విశ్లేషకులు, బ్రోకరేజీ సంస్థలు లెక్కలు వేస్తున్నాయి. ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలరు బలహీనపడటమనేది సీక్వెన్షియల్‌గా 100–200 బేసిస్ పాయింట్ల మేర ఆదాయాల వృద్ధికి కలిసి రావచ్చనే అభిప్రాయం నెలకొంది.
ఐటీ దిగ్గజాల ఆర్థిక ఫలితాల సీజన్ గురువారం నుంచి ప్రారంభమవుతోంది. జూలై 10న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), 14న హెచ్‌సీఎల్ టెక్, 16న టెక్ మహీంద్రా.. ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ ఫలితాలను ప్రకటించనున్నాయి. అలాగే జూలై 17న ఎల్‌టీఐమైండ్‌ట్రీ, 23న ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాలు వస్తాయి. ‘క్యూ2లో ఐటీ రంగం ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉండొచ్చు. ప్రథమ శ్రేణి సంస్థల ఆదాయ వృద్ధి స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఒక మోస్తరు స్థాయికే పరిమితం కావచ్చు.
అదే సమయంలో మధ్య స్థాయి కంపెనీలు పటిష్టమైన వృద్ధి సాధించవచ్చు’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ ఒక నివేదికలో పేర్కొంది. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ 2026 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీలు గతంలో ప్రకటించిన గైడెన్స్‌నే కొనసాగించే అవకాశం ఉందని వివరించింది.
అమెరికా టారిఫ్‌లు, స్థూల ఆర్థిక పరిస్థితులపరమైన సవాళ్లు మొదలైన అంశాలు క్లయింట్ల వ్యయాలపై ప్రభావం చూపవచ్చని, కాకపోతే త్రైమాసికం ప్రారంభంలో భావించినంతగా డిమాండ్ పడిపోలేదని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ తెలిపింది. ‘చేసే ఖర్చుకు తగ్గట్లుగా పనితీరును మెరుగుపర్చుకోవడం, మౌలిక సదుపాయాలను ఆధునీకరించుకోవడం, ఏఐ తదితర అంశాలకు సంబంధించిన డీల్స్ గణనీయంగానే ఉన్నాయి’ అని వివరించింది.
90 రోజుల విరామం సానుకూలం..
టారిఫ్‌ల వడ్డనకు అమెరికా 90 రోజులు విరామం ప్రకటించడమనేది, ఐటీ కంపెనీలకు అతి పెద్ద మార్కెట్‌పై గల భయాలను కాస్త తగ్గించిందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తెలిపింది. గత రెండు నెలలుగా నిఫ్టీ ఐటీ 10 శాతం పైగా ర్యాలీ చేయడం ఇందుకు నిదర్శనమని వివరించింది. అయినప్పటికీ కొత్త డీల్స్‌కి పెద్దగా ఊతం లభించలేదని పేర్కొంది.
ఈ నేపథ్యంలో కోఫోర్జ్, పర్సిస్టెంట్ మినహా ఐటీ కంపెనీలు, ఈఆర్‌అండ్‌డీ (ఇంజనీరింగ్ రీసెర్చ్, డెవలప్‌మెంట్) సంస్థల ఆదాయాలు ఒక మోస్తరు స్థాయికే పరిమితం కావచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. డాలర్ల మారకంలో ఆదాయం కొంత మెరుగ్గా ఉంటుందని వివరించింది. ఆదాయాల వృద్ధిపరంగా మిడ్–క్యాప్, లార్జ్ క్యాప్ కంపెనీల మధ్య వ్యత్యాసం గణనీయంగా పెరుగుతోందని పేర్కొంది. ‘కన్జూమర్, తయారీ, ఆటో, లాజిస్టిక్స్, కమ్యూనికేషన్ విభాగాల్లో డిమాండ్ నెమ్మదించింది’ అని తెలిపింది.
ఇతర బ్రోకరేజీల అంచనాలు..
మోతీలాల్ ఓస్వాల్: భౌగోళిక రాజకీయ పరిస్థితులు, టారిఫ్‌లపరంగా అనిశ్చితి వల్ల కొత్తగా భారీ డీల్స్ కుదుర్చుకోవడంపై ప్రతికూల ప్రభావం పడినప్పటికీ, ప్రస్తుత ఒప్పందాలు యథాప్రకారంగానే అమలవుతున్నాయి. క్లయింట్లు ప్రాజెక్టులను వాయిదా వేయడం, ప్రస్తుతం కొనసాగుతున్న పనుల పరిధిని కుదించడం గానీ చేయలేదు. క్యూ1 ఫలితాల్లో ఇది ప్రతిఫలించవచ్చు.
లార్జ్–క్యాప్స్‌కి సంబంధించి త్రైమాసికాలవారీగా ఆదాయాలు, కాంట్రాక్టుల విలువ పెద్ద ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు. త్రైమాసికాలవారీగా లార్జ్ క్యాప్స్ వృద్ధి ‘మైనస్ 2.5% నుంచి ప్లస్ 1.5%’ మధ్యలో ఉండొచ్చు. ‘మైనస్ 2.0% నుంచి ప్లస్ 7% మధ్య వృద్ధి’తో మిడ్–క్యాప్స్ మరోసారి ఆకర్షణీయమైన పనితీరు కనపర్చవచ్చు. బలహీన డాలరు వల్ల 100–200 బేసిస్ పాయింట్ల మేర ప్రయోజనం లభించవచ్చు.
ప్రభుదాస్ లీలాధర్: టారిఫ్‌లపరమైన అనిశ్చితి కాస్త తగ్గినప్పటికీ, వాటి ప్రభావం పడే విభాగాల్లో డిమాండ్ పుంజుకోలేదు. ప్ర స్తుత పరిస్థితులరీత్యా ఆదాయాల వృద్ధి బలహీనంగానే ఉండొచ్చు.