
భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్' (TCS) తన ఉద్యోగులలో సుమారు 2 శాతం లేదా 12,000 ఉద్యోగాలను తగ్గించుకోవడానికి ప్రణాళిక వేసినట్లు రెండు నెలల క్రితమే ప్రకటించింది. ఆ ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే.. టీసీఎస్ తన ఉద్యోగులను బలవంతంగా రాజీనామా చేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కంపెనీలో ఏం జరుగుతోందనే విషయాన్ని.. ఒక ఉద్యోగి సోషల్ మీడియాలో వెల్లడించారు. మూడు రోజుల క్రితం నన్ను మీటింగ్ రూమ్‌కు పిలిచి, రాజీనామా చేయాలని చెప్పారు. కానీ నేను దాన్ని తిరస్కరించాను. అయితే నాలో భయం మొదలైంది. టీసీఎస్ నేను ఉద్యోగం చేస్తున్న మొదటి కంపెనీ. కాబట్టి నేను కోల్పోవడానికి పెద్దగా ఏమీ లేదు. కానీ రాజీనామా చేయకపోతే.. టెర్మినేషన్ తరువాత బ్యాడ్ రివ్యూ ఇస్తామని కూడా బెదిరించారు. మీకు నచ్చినట్లు చేయండి, రాజీనామా మాత్రం చేయనని చెప్పేశాను. నాలో భయం, బాధ ఉన్నప్పటికీ.. ధైర్యంగా ఉండటానికి ప్రయత్నించానని పేర్కొన్నారు.
మరో ఉద్యోగి కూడా తన అనుభవాన్ని షేర్ చేశారు. నన్ను రాజీనామా చేయమని ఒక ప్యానెల్ ఎదురుచూస్తోంది. నేను రోజూ సక్రంగా పని చేస్తున్నాను. అంతే కాకుండా.. ప్రతి కాల్, మెసేజ్, మెయిల్స్ వంటి వాటికి స్పందిస్తున్నాను. నా కుటుంబంలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి నేను ఒక్కడినే అని, నా ఉద్యోగం పోతే నా పెళ్లి కూడా క్యాన్సిల్ అవుతుందని పేర్కొన్నాను. కానీ ఒకదానికొకటి లింక్ చేయవద్దని హెచ్ఆర్ చెప్పారు. ఇప్పుడు నేను జాబ్ కోసం సెర్చ్ చేసుకుంటున్నానని ఆ ఉద్యోగి వెల్లడించారు.
ఉద్యోగులను తొలగిస్తున్న వేళ.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)కు వ్యతిరేకంగా దేశంలోని ప్రధాన నగరాల్లో IT & ITES ఉద్యోగుల సంఘం (UNITE) ప్రదర్శనలు నిర్వహించింది. కొనసాగుతున్న ఉద్యోగాల కోతలు దాదాపు 30,000 మందిని ప్రభావితం చేస్తాయని ఆరోపించింది . అయితే, టీసీఎస్ ఈ వాదనను తిరస్కరించింది. ఈ తగ్గింపు దాని ప్రపంచ శ్రామిక శక్తిలో దాదాపు 2 శాతం లేదా దాదాపు 12,000 మందికి పరిమితం అని పేర్కొంది.
ఇదీ చదవండి: మాంద్యం ఎఫెక్ట్: భారీ లేఆప్స్ ప్రకటించిన లుఫ్తాన్స
సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (CITU) మద్దతుతో దేశంలో నిరసనలు జరిగాయి. UNITE నాయకులు TCS తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. తొలగింపుల సంఖ్య వెల్లడించిన దానికంటే ఎక్కువగా ఉండవచ్చని హెచ్చరించారు. కాగా టీసీఎస్ కంపెనీలో ప్రపంచ వ్యాప్తంగా 6,00,000 కంటే ఎక్కువమంది పనిచేస్తున్నట్లు సమాచారం.