
ప్రపంచ వ్యాప్తంగా లేఆప్స్ కొనసాగుతూనే ఉన్నాయి. దిగ్గజ సంస్థలు సైతం ఉద్యోగులను తగ్గించుకోవడానికి చూస్తున్నాయి. ఈ తరుణంలో జర్మన్ ఎయిర్‌లైన్ గ్రూప్ లుఫ్తాన్స (Lufthansa) కీలక ప్రకటన చేసింది. 2030 నాటికి 4000 ఉద్యోగులను తొలగించనున్నట్లు వెల్లడించింది.
లుఫ్తాన్స తొలగించనున్న ఉద్యోగులలో ఎక్కువ భాగం.. జర్మనీలే ఉన్నారు. కంపెనీ ఖర్చులను తగ్గించి కొత్త సాంకేతికతలకు అనుగుణంగా మారాలనే ఉద్దేశ్యంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాల కోతలు ప్రధానంగా పైలట్లు, క్యాబిన్ సిబ్బంది లేదా గ్రౌండ్ స్టాఫ్ మొదలైనవారు ఉన్నారు. జర్మనీ రెండో సంవత్సరం ఆర్థిక మాంద్యం ఎదుర్కొంటున్న సమయంలో ఈ ప్రకటన వెలువడింది.
లుఫ్తాన్స కంపెనీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,03,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. దీని నెట్‌వర్క్‌లో యూరోవింగ్స్, ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్, స్విస్, బ్రస్సెల్స్ ఎయిర్‌లైన్స్ మాత్రమే కాకుండా.. ఇటలీకి చెందిన కొత్త ఫ్లాగ్‌షిప్ క్యారియర్‌గా ఇటీవల కొనుగోలు చేసిన ఐటీఏ ఎయిర్‌వేస్ కూడా ఉన్నాయి.
ఉద్యోగులను తొలగించనున్న కంపెనీల జాబితాలో జర్మన్ దిగ్గజం లుఫ్తాన్స మాత్రమే కాకుండా.. పారిశ్రామిక ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కంపెనీ బాష్ కూడా ఉంది. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 13,000 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు తెలిపింది. ఇది దాని ఉద్యోగులలో మూడు శాతానికి సమానం.