
ప్రముఖ మల్టీనేషనల్ ఐటీ కంపెనీ యాక్సెంచర్ (Accenture) గత మూడు నెలల్లో 11,000 మందికిపైగా ఉద్యోగులను తగ్గించింది. రానున్న రోజుల్లో మరిన్న కోతలు ఉంటాయని సంకేతాలు ఇచ్చింది. ఏఐ కార్యాచరణకు సరిపోయేలా ఉద్యోగులకు నైపుణ్యాలు పెంచడం సాధ్యపడకపోతే తొలగించడమే ( layoffs) మార్గమని త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ స్పష్టం చేసింది.
సీఈవో ఏమన్నారంటే..
తాజాగా జరిగిన ఎర్నింగ్ కాల్ సందర్భంగా యాక్సెంచర్ సీఈవో జూలీ స్వీట్ మాట్లాడుతూ.. కార్యాచరణ అవసరాలను ఏఐ సమూలంగా మార్చేస్తున్న తరుణంలో రీస్కిల్లింగ్ సాధ్యంకాని ఉద్యోగాలను కంపెనీ తొలగిస్తుందన్నారు. అయితే ఖచ్చితంగా సంఖ్య ఎంతన్నది ఆమె స్పష్టం చేయలేదు. యాక్సెంచర్లో మూడు నెలల క్రితం మొత్తం 791,000 మంది ఉద్యోగులు ఉండగా ఈ ఆగస్టు చివరి నాటికి ఆ సంఖ్య 779,000 మందికి తగ్గింది.
యాక్సెంచర్ ఆదాయం జూన్-ఆగస్టు 2025 త్రైమాసికంలో 17.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. సంవత్సరానికి 7 శాతం పెరుగుదలను నమోదు చేసింది. సెప్టెంబర్-ఆగస్టు ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 2.5 శాతం విదేశీ మారక ద్రవ్య ప్రభావంతో దాని ఆదాయాలను ప్రభావితం చేసిందని తెలిపింది. కొనసాగుతున్న పోర్ట్ ఫోలియో ఆప్టిమైజేషన్ లో భాగంగా, యాక్సెంచర్ కొన్ని నాన్-కోర్ వ్యాపారాల నుండి నిష్క్రమించనున్నట్లు, 865 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను ఉపసంహరించుకునే ప్రణాళికలను కూడా ప్రకటించింది.