
అమెరికా హెచ్-1బి వీసాలపై భారతీయ ఐటీ ఉద్యోగుల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ వీసాలకు వార్షిక ఫీజును యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష డాలర్లు చేశారు. అంటే దాదాపు రూ.88 లక్షలపైనే. దీంతో ఈ హెచ్-1బి వీసాలపై ఇప్పటికే అక్కడ పనిచేస్తున్నవారు, కొత్తగా వెళ్లాలనువారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఈ నేపథ్యంలో హెచ్-1బి వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఐటీ ఉద్యోగులు ఎంత సంపాదిస్తున్నారు.. వారి జీతాలు, వాస్తవ స్థితిగతుల గురించి ఈ కథనంలో చూద్దాం..
అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఐటీ నిపుణులు, ముఖ్యంగా ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి భారతీయ ఐటీ సంస్థలచే నియమితులైనవారు మరీ అంత ఎక్కువ జీతాలేమీ పొందడం లేదు. వారి జీతంలో అత్యధికం బేస్ పే (ప్రాథమిక జీతం)కు ఉండటం వల్ల మొత్తం ప్యాకేజీ చూడగానే ఆకర్షణీయంగా కనిపించినా, అమెరికన్ టెక్ కంపెనీలతో పోల్చితే గణనీయమైన తేడా స్పష్టమవుతుంది.
జీత నిర్మాణం
అమెరికాలో ఈ ఉద్యోగుల బేస్ పే మొత్తం జీతంలో 70-90% వరకు ఉంటుంది. ఇది యూఎస్ కార్మిక విభాగం (U.S. Department of Labor) నిర్ణయించిన వేతన స్థాయిలపై ఆధారపడి ఉంటుంది. జాబ్ రోల్, అనుభవం, పని ప్రదేశాన్ని బట్టి మారుతుంది. సాధారణంగా, భారతీయ సంస్థలు తమ హెచ్-1బి ఉద్యోగులకు 65,000 నుండి 90,000 డాలర్ల మధ్య బేస్ పేని అందిస్తుంటాయి.
అదే ఉద్యోగులు స్వదేశానికి తిరిగి వచ్చాక కొన్ని సంస్థలు ఆ జీతాన్ని భారీగా తగ్గించేస్తున్నాయి. ఇది మొత్తం ప్యాకేజీలో 10% కంటే తక్కువగా ఉండటం గమనార్హం. అయితే పీఎఫ్, గ్రాట్యుటీ వంటి లీగల్ బెనిఫిట్ల నిర్వహణకు ఇది ఉపయోగపడుతుంది.
అలవెన్సులు, బోనసులు
బేస్ పే పైన, కొన్ని ఆన్‌సైట్ అలవెన్సులు – హౌసింగ్, కాల్ (Cost of Living) అడ్జస్ట్మెంట్లు, రీలొకేషన్ సపోర్ట్ – జీతంలో 5-20% వరకు ఉంటాయి. అయితే, ఇవి ప్రాంతం, సంస్థ విధానంపై ఆధారపడి, యూఎస్ లోని స్థానిక ఉద్యోగుల అలవెన్సులతో పోలిస్తే తక్కువగా ఉంటాయి.
బోనస్‌లు సాధారణంగా జీతంలో 10% లోపు ఉంటాయి. సీనియర్ ఉద్యోగులకు కొంత మెరుగుదల కనిపించినా, అవి యూఎస్ కంపెనీలు ఇచ్చే ప్రోత్సాహకాలతో పోల్చితే తక్కువగానే ఉంటాయి. ఉదాహరణకు, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి సంస్థలు హెచ్-1బి ఉద్యోగులకు 120,000 – 200,000 డాలర్ల వరకు బేస్ పే, అదనపు ఈక్విటీ, స్టాక్ ఆప్షన్లు, గణనీయమైన బోనస్‌లు అందిస్తున్నాయి.
ప్రయోజనాలు
హెచ్-1బి ఉద్యోగులకు హెల్త్ బెనిఫిట్స్ కింద ఆరోగ్య బీమా, డెంటల్, కంటి బీమా వంటి ప్రాథమిక ప్రయోజనాలు అందిస్తున్నారు. ఇవి సాధారణంగా కుటుంబ సభ్యులను కూడా కవర్ చేస్తాయి. అయితే, భారతీయ ఐటీ సంస్థలలో స్టాక్ ఆప్షన్లు, ఈక్విటీ వంటి లాంగ్-టర్మ్ ఇన్సెంటివ్‌లు చాలా అరుదుగా ఉంటాయి. ప్రత్యక్షంగా యూఎస్ కంపెనీలచే నియమితులైన ఉద్యోగులకు మాత్రమే ఇవి సాధారణంగా లభ్యమవుతాయి.
ఈ పరిస్థితులలో హెచ్-1బి వీసాపై ఉన్న భారతీయ ఉద్యోగులు అమెరికాలో మెరుగైన జీవన ప్రమాణాలు అందుకుంటున్నా, తమ స్థానిక సహోద్యోగులతో పోల్చితే జీతాల పరంగా తక్కువగానే అందుకుంటున్నారు. దీన్నిబట్టి అమెరికాలో హెచ్-1బి వీసాల ప్రస్తుత పరిస్థితి గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని అర్థమవుతుంది.