
ఆదాయం 7–8 శాతం పెరగొచ్చు
క్రిసిల్ రేటింగ్స్ అంచనా
దేశీ టైర్ల తయారీ పరిశ్రమ ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) 7–8 శాతం వరకు పెరగొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. ముఖ్యంగా పాత టైర్లను మార్చడం రూపంలోనే సగం విక్రయాలు ఉంటాయని తెలిపింది. అసలు తయారీదారుల (ఓఈఎం) వాటా తగ్గే అవకాశం ఉన్నప్పటికీ.. మొత్తం మీద ఈ విభాగంలో వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. ప్రీమియమైజేషన్ పెరుగుతుండడం అమ్మకాలకు ఊతమిస్తుందని అంచనా వేసింది.
అయితే వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగిపోయిన తరుణంలో చైనా తయారీదారులు చౌక రేట్లపై టైర్లను భారత్ మార్కెట్లోకి కుమ్మరించే సవాళ్లు పొంచి ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. స్థిరమైన ముడి సరుకుల ధరలు, సామర్థ్యాన్ని మెరుగ్గా వినియోగించుకోవడం ఫలితంగా టైర్ల పరిశ్రమ నిర్వహణ లాభం 13–13.5 శాతం స్థాయిలో ఉంటుందని అంచనా వేసింది. లీన్ బ్యాలన్స్ షీట్లు (నిల్వలు తగ్గించుకోవడం), మూలధన వ్యయాలను క్రమంగా నిర్వహించడం వంటివి ఈ రంగం రుణ పరపతిని స్థిరంగా ఉంచుతాయని తెలిపింది. దేశంలో అన్ని రకాల వాహన టైర్ల అమ్మకాల్లో 85 శాతం వాటా కలిగిన టాప్–6 కంపెనీలను పరిశీలించించినప్పుడు ఇదే తెలుస్తున్నట్టు పేర్కొంది. మొత్తం డిమాండ్‌లో 75 శాతం దేశీ మార్కెట్ నుంచి, మిగిలినది ఎగుమతుల రూపంలో ఉంటుందని అంచనా వేసింది.
ఇదీ చదవండి: అనధికార ఆస్తులకు బీ-ఖాతాలు జారీ
టారిఫ్ సవాళ్లు..
ఎగుమతుల విషయంలో రిస్క్‌లను క్రిసిల్ రేటింగ్స్ ప్రస్తావించింది. గత ఆర్థిక సంవత్సరంలో (2024–25) భారత్ నుంచి టైర్ల ఎగుమతుల్లో 17 శాతం అమెరికాకే వెళ్లాయని.. పరిశ్రమ మొత్తం పరిమాణంలో ఇది 4–5 శాతంగా ఉన్నట్టు తెలిపింది. ప్రతీకార సుంకాలను ఎదుర్కోవాల్సి వస్తే అప్పుడు పోటీపరమైన సానుకూలతలు కనుమరుగవుతాయని పేర్కొంది. చైనాపై అమెరికా భారీ టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో.. అదనపు సరఫరాలు ధరల పరంగా సున్నిత మార్కెట్ అయిన భారత్‌లోకి మళ్లే అవకాశం లేకపోలేదని అభిప్రాయపడింది. చౌక దిగుమతులకు కళ్లెం వేసేందుకు వీలుగా.. చైనా నుంచి వచ్చే భారీ ట్రక్, బస్ రేడియల్ టైర్లపై యాంటీ డంపింగ్, కౌంటర్ వేయిలింగ్ డ్యూటీలను కేంద్రం విధించడాన్ని గుర్తు చేసింది. కానీ, ఇతర విభాగాల్లో చౌక దిగుతులు ఒత్తిళ్లకు దారితీయొచ్చని పేర్కొంది.