
బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) 2024 సెప్టెంబర్ వరకు జారీ చేసిన బీ-ఖాతా ఆస్తుల క్రమబద్ధీకరణకు కర్ణాటక రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ చర్య వల్ల ఆయా ఆస్తులను తర్వాత ఏ-ఖాతాకు అప్‌గ్రేడ్ చేసుకునేందుకు వీలవుతుంది. ప్రభుత్వ చర్యలతో ఆస్తుల యజమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న చట్టపరమైన స్పష్టత రానుందని భావిస్తున్నారు.
‘ఆస్తులకు బీ-ఖాతా ధ్రువపత్రాలు ఇచ్చేటప్పుడు కొన్ని ప్రమాణాలు నిర్దేశిస్తాం. ఆస్తి యజమానులు ప్రమాణాలను పాటిస్తే బీ-ఖాతా జారీ చేస్తారు. తర్వాత పక్కా డాక్యుమెంట్లతో ఏ-ఖాతాకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. కొన్ని లోపాలున్న ఆస్తులకు పరిమిత మినహాయింపులతో బీ-ఖాతా సర్టిఫికెట్లు జారీ చేస్తాం’ అని న్యాయ మంత్రి హెచ్‌కే పాటిల్ కేబినెట్ సమావేశంలో తెలిపారు. క్రమబద్ధీకరించిన తర్వాత బీ-ఖాతా ఆస్తి యజమానులకు చట్టపరమైన హోదా దక్కుతుంది. గతంలో అనుమతించని అమ్మకాలు, బ్యాంకు రుణాలు, తనఖాలకు వీలు కల్పించేలా ఏ-ఖాతాకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
బీ-ఖాతా అంటే ఏమిటి?
బీ-ఖాతా అనేది చట్టపరమైన, ప్రణాళికా నిబంధనలను పూర్తిగా పాటించని ఆస్తుల కోసం బీబీఎంపీ నిర్వహించే ఒక రకమైన ఆస్తి రికార్డు. వీటిలో అనధికార లేఅవుట్లలోని భవనాలు, అనుమతి లేని నిర్మాణాలు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు లేనివి ఉన్నాయి. ఈ ఆస్తులు పూర్తిగా చట్టబద్ధం కానప్పటికీ యజమానులు ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పన్ను ప్రయోజనాల కోసం వారి వివరాలను నమోదు చేయాలి. ఇప్పటివరకు ఇలాంటి లోపాలున్న ఆస్తులు పూర్తిగా చట్టబద్ధమైనవిగా పరిగణించబడలేదు. అమ్మకం, భవన అనుమతులు పొందడం లేదా ట్రేడ్ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఆంక్షలు ఎదురయ్యేవి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సాధారణంగా వాటిపై రుణాలు ఇవ్వవు. స్థానిక చట్టాలకు పూర్తిగా అనుగుణంగా ఉండే ఏ-ఖాతా ప్రాపర్టీలతో పోలిస్తే, బీ-ఖాతా ఆస్తులు సాధారణంగా తక్కువ మార్కెట్ విలువ, పరిమిత చట్టపరమైన ప్రయోజనాలను కలిగి ఉంటాయని నిపుణులు అంటున్నారు.
ఇదీ చదవండి: ‘డ్రాప్ చేసి ఇంటికి వచ్చేలోపు దుబాయ్ వెళ్లింది’
అనధికారిక నిర్మాణాలు, ప్రణాళికారహిత అభివృద్ధి బీ-ఖాతాల సమస్యకు దారితీసింది. వీటిని నియంత్రించాలని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో పేర్కొంది. కర్ణాటక టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ చట్టం నియంత్రణ పరిధిలోకి బీ-ఖాతా ఆస్తులను తీసుకురావాలనే డిమాండ్ ఉంది. 2024 సెప్టెంబర్ 30 తర్వాత సృష్టించిన లేదా నిర్మించిన అనధికారిక ఆస్తులకు బీ-ఖాతా జారీ చేయడాన్ని గ్రేటర్ బెంగళూరు గవర్నెన్స్ చట్టం నిషేధించింది. బీ-ఖాతా అనే భావనను 2009లో ప్రవేశపెట్టారని, అందువల్ల 2009కి ముందు జారీ చేసిన అన్ని ఖతాలు ఏ-ఖాతాలేనని తెలిపింది.
గృహ కొనుగోలుదారులకు ప్రయోజనం
క్రమబద్ధీకరించిన తర్వాత బీ-ఖాతా ఆస్తి యజమానులకు చట్టపరమైన యాజమాన్య ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తామని న్యాయవాది ఆకాశ్ బంటియా తెలిపారు. ఈ చట్టపరమైన స్పష్టత వారి ఆస్తులను తాకట్టు పెట్టడానికి, బ్యాంకు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తుందని చెప్పారు. ఈ క్రమబద్ధీకరణ చర్య యాజమానికి అధికారిక రుజువుగా కూడా పనిచేస్తుందన్నారు. దీంతో వేలాది మంది నివాసితులకు దీర్ఘకాలిక ఉపశమనం లభిస్తుందని తెలిపారు.