
‘‘యస్.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పినట్లు అధ్వాన్నమైన రోడ్లు అనేది దేశవ్యాప్తంగా ఉన్న సమస్యే. కానీ, దేశంలో ఎక్కడ కూడా బెంగళూరులో చేసినట్లు మాత్రం రిపేర్లు చేసి ఉండరు..’’ సోషల్ మీడియాలో బెంగళూరు రోడ్ల దుస్థితి గురించి ఓ నెటిజన్ చేసిన జోక్ ట్వీట్ ఇది.
మొన్నటిదాకా బెంగళూరు ట్రాఫిక్ రద్దీ గురించే మాట్లాడుకునేవారు. కానీ, ఈ మధ్య అధ్వాన్నమైన రోడ్ల గురించి కూడా(Bengaluru Roads) చర్చించుకుంటున్నారు. ఓ ప్రముఖ కంపెనీ రోడ్లు బాగోలేకపోవడాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ నగర శివారు నుంచి తరలిపోయింది. దీంతో రాజకీయంగానూ కర్ణాటక కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తామేమీ ఖాళీగా లేమని.. తమ ప్రయత్నం తాము చేస్తున్నామంటూ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar) చెబుతున్నారు. అంతేకాదు.. బెంగళూరు రోడ్ల మరమ్మత్తుల బాధ్యతలను కూడా సంబంధిత మంత్రిగా(పట్టణాభివృద్ధి) ఆయనే పర్యవేక్షిస్తున్నారు. ఈ తరుణంలో..
ఇప్పుడు నెట్టింట విమర్శలు మరింత పెరిగిపోయాయి. బెంగళూరు రోడ్ల రిపేర్ పనులు కొనసాగుతున్న వేళ.. పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారవుతోంది. ఆ ప్యాచ్ వర్క్‌లు రెండు, మూడు రోజులకు మించి ఉండడం లేదు. వీటికి తోడు కొత్తగా కొట్టిన రోడ్లు కూడా 48 గంటలు తిరగకముందే పాడైపోతున్నాయి. ఫలితంగా.. ట్రాఫిక్ జాములు, ప్రమాదాలు పెరిగిపోతున్నాయి.
దీంతో కొందరు ఆ రోడ్లనే ఎక్కుతున్నారు. మొన్నీమధ్యే కాక్స్ టౌన్‌లోని వెబ్‌స్టర్ రోడ్డులో రిపేర్లు చెదిరిపోయి మళ్లీ గుంతలు దర్శనమిచ్చాయి. దీంతో భారతినగర్ ప్రజలు ఆ గుంతలకు పూజలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అది చూసి మరికొందరు కూడా అలాగే గుంతలను పూలతో అలంకరించి.. పసుపు, కుంకుమ చల్లి తమను చల్లగా చూడాలంటూ వీడియోలు చేసి వైరల్ అయిపోయారు.



తాజాగా.. ఓ వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో చన్నసంద్ర సర్కిల్ వద్ద రిపేర్ అయిన రోడ్ల పరిస్థితి తెలియజేస్తూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. చన్నసంద్ర సర్కిల్ వద్ద సెప్టెంబర్ 27న రోడ్డుకు మరమ్మతులు చేశారట. గట్టిగా ఒక్క వాన పడితే ఈ రోడ్డు ఉండదు అంటూ ఆ వ్యక్తి ఆ వీడియోను క్యాప్షన్ ఉంచాడు. దీనికి Greater Bengaluru Authority (@GBA_office) ను ట్యాగ్ చేశాడు.
They repaired this section - Channasandra Circle on 27th September. It's 29th September today and the road is gone. What kind of patchwork doesn't last 48hrs? Are your engineers and contractors so much unqualified @GBA_office?
You see the water in the video? - it's leaking… https://t.co/2NfPTEA1sN pic.twitter.com/kOH0ExjG8J— Auro (@weekendbiker) September 29, 2025
బెంగళూరు రోడ్ల మరమ్మత్తుల బాధ్యతలను గ్రేటర్ బెంగళూరు అథారిటీ.. వివిధ కాంట్రాక్టర్లకు అప్పజెప్పింది. నగరంలో దీర్ఘకాలిక రోడ్డు అభివృధ్ది ప్రాజెక్టులకు రూ.1,100 కోట్లు ఖర్చు చేయబోతుండగా.. ఇందులో కేవలం రోడ్ల మరమ్మత్తుల కోసం రూ.750 కోట్లు కేటాయించారు. గుంతల పూడిక, వైట్ టాపింగ్, బ్లాక్‌టాపింగ్, కొత్త స్మార్ట్ రోడ్ల నిర్మాణం అన్నీ ఇందులోనే జరగనున్నాయి. అక్టోబర్ 31లోగా నగరంలో 10వేల గుంతలను పూడ్చాలంటూ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ డెడ్‌లైన్ విధించారు. అయితే.. వర్షాలు, నిర్మాణ నాణ్యత లోపాలు, నిర్వహణ లోపాల కారణంగా విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి.