ఇల్లు కొనాలంటే.. చుట్టుపక్కల ఇవి ఉండాల్సిందే.. | Healthcare facilities is most priority in buying home | Sakshi
Sakshi News home page

ఇల్లు కొనాలంటే.. చుట్టుపక్కల ఇవి ఉండాల్సిందే..

Oct 18 2025 5:00 PM | Updated on Oct 18 2025 5:22 PM

Healthcare facilities is most priority in buying home

సాక్షి, సిటీబ్యూరో: గృహ కొనుగోలుదారుల అభిరుచులు మారుతున్నాయి. గతంలో ధర ప్రాధాన్యంగా గృహ కొనుగోలు నిర్ణయం తీసుకునే కస్టమర్లు.. ఆ తర్వాత వసతులను పరిగణలోకి తీసుకున్నారు. నేటి యువతరం ఇల్లు కొనేటప్పుడు చుట్టుపక్కల ఆరోగ్య సౌకర్యాలు ఎలా ఉన్నాయనేది ప్రధానంగా చూస్తున్నారు.

అత్యవసరంలో ఎంత సమయంలో ఆసుపత్రికి చేరుకోవచ్చు? ఎంత సమీపంలో వైద్య సదుపాయాలు ఉన్నాయనేది ఆరా తీస్తున్నారు. ఇంట్లో పిల్లలు, పెద్దల ఆరోగ్య అవసరాల రీత్యా వీటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇల్లు విశాలంగా ఉండటమే కాదు కమ్యూనిటీలో సకల సౌకర్యాలు ఉండాలనేది నేటి గృహ కొనుగోలుదారుల మాట.

పిల్లల కోసం క్రీడా సదుపాయాలు, పెద్దలకు క్లబ్‌ హౌస్, జిమ్, స్విమ్మింగ్‌ పూల్‌ వంటి సదుపాయాలు ఉండాలని భావిస్తున్నారు. ఎక్కువ ఖాళీ స్థలం వదిలి, పచ్చదనం అధికంగా ఉంటే ఇష్టపడుతున్నారు. చిన్న కుటుంబాల నేపథ్యంలో పిల్లల ఆలనాపాలనా చూసే డే కేర్‌ సౌకర్యాలు ఉండాలని గృహ కొనుగోలుదారులు చూస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ కార్యాలయాలకు వెళితే పిల్లలను చూసుకోవడం కష్టం అవుతుంది. వర్క్‌ ఫ్రం హోమ్‌ ఉన్నా పిల్లలపై శ్రద్ధ పెట్టలేని పరిస్థితి. కమ్యూనిటీలో డే కేర్‌ సదుపాయాలు ఉండాలని కోరుకుంటున్నారు.

వీకెండ్‌ ఎంజాయ్‌..

వీకెండ్‌ వస్తే కుటుంబంతో కలిసి ఆహ్లాదంగా గడిపేందుకు షాపింగ్‌ మాల్స్, థియేటర్లు ఎంత దూరంలో ఉన్నాయనేవి కూడా కొనుగోలు ఎంపికలో భాగమైపోయాయి. పచ్చని ప్రకృతిని ఆస్వాదించాలని కోరుకునే నివాసితులు శివారు ప్రాంతాలలో ఫామ్‌హౌస్‌లు, విల్లాల కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇల్లు కొనేటప్పుడు ఆఫీసుకు ఎంత దూరంలో ఉందనేది కస్టమర్ల ప్రాధామ్యాలలో ఒకటి. నగరంలో ట్రాఫిక్‌లోనే అధిక సమయం వృథా అవుతుంది కాబట్టి దూరం, సమయం అనేది ప్రధానంగా మారాయి. ప్రజా రవాణా సౌకర్యాలు ఎలా ఉన్నాయనేది పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement