ఈవీ ఉంటే.. ఇంటి ధర పెంచుడే.. | EV Boom Sparks Rise In Home Prices Charging Points Now A Key Selling Feature, More Details Inside | Sakshi
Sakshi News home page

ఈవీ ఉంటే.. ఇంటి ధర పెంచుడే..

Oct 18 2025 12:17 PM | Updated on Oct 18 2025 1:19 PM

EV Boom Sparks Rise in Home Prices Charging Points Now a Key Selling Feature

ఇంధన వనరుల ధరలు రోజుకు ఒకలా ఉంటున్న నేపథ్యంలో ప్రజలు ఎలక్ట్రిక్‌ వాహనాలు(ఈవీ) వైపు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తుండటంతో చార్జింగ్‌ స్టేషన్ల అవసరం పెరిగింది. ఒకవైపు పెట్రోల్‌ బంక్‌లు, మెట్రో స్టేషన్ల వద్ద ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటవుతుంటే.. మరోవైపు కొత్తగా నిర్మిస్తున్న నివాస, వాణిజ్య సముదాయాలలోనూ వీటిని ఏర్పాటు చేస్తున్నారు. - సాక్షి, సిటీబ్యూరో

జిమ్, స్విమ్మింగ్‌ పూల్‌ అంటూ ప్రకటించే వసతుల జాబితాలో ఈవీ చార్జింగ్‌ పాయింట్‌ అనే ప్రత్యేకంగా ప్రకటించే స్థాయికి చేరిందంటే ఆశ్చర్యమేమీ లేదు. ప్రస్తుతమున్న సాధారణ నివాస భవనాలలో ధరలు 1 శాతం మేర పెరిగితే.. ఈవీ చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసిన నివాస భవనాలలో ధరలు 25 శాతం వృద్ధి చెందుతాయని జేఎల్‌ఎల్‌ నివేదిక తెలిపింది.

2030 నాటికి ఎలక్ట్రిక్‌ వాహనాల వాటా 40 శాతం కంటే ఎక్కువకు చేరుతుంది. దీంతో ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు ఉన్న భవనాలకు డిమాండ్‌ క్రమంగా పెరుగుతోంది. కొత్త ప్రాజెక్ట్‌లోనే కాకుండా ఇప్పటికే ఉన్న భవనాలలో కూడా ఈవీ పాయింట్ల ఏర్పాటు వ్యవస్థ 2026 నాటికి భారీగా పెరుగుతుంది. భవనాల రకం, సహజ వనరుల పునర్వినియోగం (రెట్రోఫిట్‌) ప్రాజెక్ట్‌ల నివాస తరగతులను బట్టి ధరల పెరుగుదల ఉంటుంది.

ప్రస్తుతం నివాస ప్రాంతాలలో యజమానులు సర్వీస్‌ ప్రొవైడర్ల సహాయంతో ఈవీ స్టేషన్లను ఇన్‌స్టాల్‌ చేస్తున్నారు. పెద్ద స్థాయి ప్రాజెక్ట్‌లు, గేటెడ్‌ కమ్యూనిటీలలో అసోసియేషన్లు వీటిని ఏర్పాటు చేస్తున్నాయి. ఇందుకోసం వినియోగదారులపై నిర్ణీత రుసుములను వసూలు చేస్తున్నారు. రానున్న కొత్త నివాస సముదాయాలలో 5 శాతం పార్కింగ్‌ స్థలాన్ని ఈవీ చార్జింగ్‌ స్టేషన్ల కోసం కేటాయిస్తాయని అంచనా.

ఈవీ స్టేషన్ల ఏర్పాటు కోసం ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింక్స్‌(ఐఓటీ) చార్జింగ్‌ ఉపకరణాలు, ఇంటర్నెట్‌ లభ్యత కూడా అందుబాటులో ఉండాలి కనుక.. ఇప్పటికే ఉన్న పెద్ద రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌లు, బహుళ అంతస్తుల భవనాలలో చార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటు వ్యయం, పరిమిత విద్యుత్‌ సరఫరా సామర్థ్యాలను బట్టి 1 శాతం ప్రీమియం ఉంటుందని పేర్కొన్నారు. 60 శాతం కంటే ఎక్కువ నివాసితులు ఈవీ చార్జింగ్‌ పాయింట్ల అవసరాన్ని కోరుకుంటుంటే ఈ ప్రీమియం 25 శాతం వరకు ఉంటుందని తెలిపారు.

ఆఫీస్‌ స్పేస్‌లలో కూడా..

ఈవీ స్టేషన్లు ఉన్న ఆఫీస్‌ స్పేస్‌లకు కూడా డిమాండ్‌ ఏర్పడింది. కొందరు స్థల యజమానులు వినియోగదారు రుసుముతో ఈవీ స్టేషన్ల సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరికొందరు చార్జింగ్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు భూమిని లీజుకు లేదా రెవిన్యూ షేర్‌ మోడల్‌ ద్వారా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆఫీస్‌ పార్కింగ్‌లలో ఖాళీ ప్లేస్‌లు లేకపోవడమే అసలైన సవాలు.

ఇప్పటికే ఉన్న కొన్ని కార్యాలయాలలోని పార్కింగ్‌లలో ఇలాంటి అవసరాల కోసం కొంత స్థలాన్ని కేటాయించాయి. ప్రభుత్వ విభాగాలు చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసి వాటిని ప్రైవేట్‌ ఆపరేట్లకు లీజుకు ఇవ్వొచ్చు లేదా దీర్ఘకాలానికి సంబంధిత భూమిని సర్వీస్‌ ప్రొవైడర్లకు లీజుకు ఇవ్వొచ్చని జేఎల్‌ఎల్‌ సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement