
పారదర్శకత, క్రమశిక్షణ
చట్టం అమలులో నాల్గో స్థానంలో తెలంగాణ
టీజీ రెరాలో 10,123 ప్రాజెక్ట్‌లు, 4,516 మంది ఏజెంట్ల నమోదు
ప్రీలాంచ్‌లు, సాఫ్ట్ లాంచ్‌ల పేరుతో ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేయకముందే కస్టమర్లు నుంచి ముందస్తుగా డిపాజిట్లు సేకరించడం, వసూలు చేసిన సొమ్ము వ్యక్తిగత అవసరాలకు మళ్లించడం, న్యాయపరమైన చిక్కులతో నిర్మాణ అనుమతులు రాకపోవడం, ఒకవేళ వచ్చినా నిర్మాణ వ్యయ భారంతో నిర్మాణ పనులను మధ్యలోనే ఆపేయడం, సంవత్సరాల కొద్దీ నిర్మాణ పనులు కొనసాగిస్తుండటం.. ఇలా ఒకట్రెండు కాదు సొంతింటి కలకు సవాలక్ష సవాళ్లు. కానీ, ఇవన్నీ రెరా కంటే ముందు మాట. దేశంలో రెరా చట్టం అమలులోకి వచ్చిన తర్వాత డెవలపర్లలో స్థిరాస్తి రంగంలో పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణ పెరిగింది. దీంతో గృహ కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల్లో విశ్వాసం నెలకొంది. – సాక్షి, సిటీబ్యూరో
దేశంలో 2016లో అమలులోకి వచ్చిన రెరా.. రియల్ ఎస్టేట్ రంగంలో ఒక కీలకమైన ఘట్టం. దశాబ్దాలుగా అనిశ్చితి దేశీయ స్థిరాస్తి రంగాన్ని సంఘటితంగా, పారదర్శక, జవాబుదారీతనంగా మార్చింది మాత్రం రెరానే. విక్రయాలు, ప్రాజెక్ట్ డెలివరీ, స్థిరమైన ధరల పెరుగుదలను తీసుకురావడంతో పాటు రియల్టీలోకి సంస్థాగత, ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులకు అవకాశాలను కల్పించిందని నైట్‌ఫ్రాంక్, నరెడ్కో సంయుక్త నివేదిక వెల్లడించింది. అయితే రెరా అమలు అన్ని రాష్ట్రాల్లో ఏకరీతిగా లేకపోయినప్పటికీ.. చట్టం ప్రధాన ఉద్దేశం మాత్రం విప్లవాత్మకమైనదే. దేశం పట్టణీకరణ, ఆర్థిక వృద్ధి ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ప్రస్తుత తరుణంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో రెరా స్థిరమైన, సమానమైన అమలు సాగడం అత్యవసరం.
1.50 లక్షల ప్రాజెక్ట్‌ల నమోదు..
ఇప్పటి వరకు మన దేశంలో నాగాలాండ్ మినహా 27 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో రెరా నోటిఫై అయ్యింది. దేశవ్యాప్తంగా రెరాలో 1.50 లక్షలకు పైగా ప్రాజెక్ట్‌లు, లక్ష కంటే ఎక్కువ మంది ఏజెంట్లు నమోదయ్యారు. ఇప్పటి వరకు 1.50 లక్షలకుపైగా ఫిర్యాదులు పరిష్కృతమయ్యాయి.
ఎస్క్రో అకౌంట్..
దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువ 648 బిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో 52 శాతం వాటా ఉన్న నివాస సముదాయం విభాగంలో పారదర్శకత అత్యవసరం. కస్టమర్ల నుంచి వసూలు చేసే సొమ్ములో 70 శాతాన్ని ప్రత్యేకంగా ఎస్క్రో బ్యాంక్ ఖాతా తెరిచి అందులో వేయాలి. ఆయా సొమ్మును కేవలం నిర్ధిష్ట ప్రాజెక్ట్ నిర్మాణ పనుల కోసం మాత్రమే వెచ్చించాలి.

తెలంగాణ రాష్ట్రంలో..
2016లో రెరా అమలులోకి వచ్చినప్పటి నుంచి మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (మహారెరా) ముందంజలో ఉంది. పారదర్శకత, సామర్థ్యం, చురుకైన అమలుతో దేశంలో అత్యధిక ప్రాజెక్ట్‌లు, ఏజెంట్ల నమోదులో ఇతర రాష్ట్రాల కంటే తొలిస్థానంలో నిలిచింది. మహా రెరాలో ఇప్పటి వరకు 50 వేలకు పైగా ప్రాజెక్ట్‌లు, 52 వేల మంది ఏజెంట్లు రిజిస్టరయ్యారు. ఆ తర్వాత తమిళనాడు, గుజరాత్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ప్రస్తుతం టీజీ రెరాలో 10,123 ప్రాజెక్ట్‌లు, 4516 ఏజెంట్లు రిజిస్టరయ్యారు. 2,340 ఫిర్యాదులు అందగా.. 1,566 పరిష్కృతమయ్యాయి.

రెరా ఎందుకొచ్చిందంటే?
గత దశాబ్దంలో దేశీయ ఆర్థిక వ్యవస్థ రియల్ ఎస్టేట్ రంగంలో వేగవంతమైన విస్తరణకు కారణమైంది. రెరా కంటే ముందు రియల్టీ పరిశ్రమలో అనిశ్చితి ఉంది. ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ అంటూ లేదు. డెవలపర్లను, లావాదేవీలను నియంత్రించడానికి నిర్ధిష్టమైన చట్టాలు లేవు. ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు, హైదరాబాద్, పుణె, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా వంటి ప్రధాన మెట్రో ప్రాంతాలలోనే రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయి.
ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో పెద్దగా రియల్టీ మార్కెట్ ఉండేది కాదు. డెవలపర్లు తరచూ ఊహాజనిత పెట్టుబడులపై ఆధారపడేవారు. లావాదేవీలలో పారదర్శకత లోపించేది. దీంతో అధిక పరపతి, విస్తృత రుణ డిఫాల్ట్‌లు, ప్రాజెక్ట్ డెలివరీలో తీవ్ర జాప్యం, వ్యయాల పెరుగుదల, గృహ కొనుగోలుదారుల నిధులను ఇతర అవసరాలకు మళ్లించడం వంటివి జరిగేవి. ఈ వ్యవస్థాగత వైఫల్యాలతో అనేక ప్రాజెక్ట్‌లు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో కొనుగోలుదారుల విశ్వాసం దెబ్బతింది. లక్షలాది మంది కస్టమర్లు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయారు. స్థిరాస్తి మార్కెట్ కార్యకలాపాలు క్షీణించాయి.
దీంతో విధానపరమైన జోక్యం, కఠిన నిబంధనల అమలు అత్యవసరమయ్యాయి. 2016లో రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ మరియు అభివృద్ధి చట్టం(రెరా)కు దారి తీసింది. స్థిరాస్తి రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం, క్రమబదీ్ధకరణతో పాటు పెట్టుబడిదారులు, కొనుగోలుదారులకు ఆర్థిక భరోసా కల్పిచడమే లక్ష్యంగా రెరా అమలులోకి వచ్చింది.

ఏ దేశంలో ఏ రకమైన నిర్మాణ రంగం చట్టాలంటే?
1920: దక్షిణాఫ్రికా, ది హౌసింగ్ యాక్ట్
1937: అమెరికా, యునైటెడ్ స్టేట్స్ హౌసింగ్ యాక్ట్
1960: సింగపూర్, హౌసింగ్ డెవలప్‌మెంట్ బోర్డ్(హెచ్‌డీబీ)
1965: యూఎస్‌ఏ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (హెచ్‌యూడీ)
1985: యూకే, హౌసింగ్ యాక్ట్
1994: చైనా, అర్బన్ రియల్ ఎస్టేట్ అడ్మినిస్ట్రేషన్ లా
2007: దుబాయ్, యూఏఈ, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ ఏజెన్సీ(రెరా)
2016: ఇండియా, రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్) యాక్ట్
ఇదీ చదవండి: ఇల్లు కొనేవాళ్లకు డబుల్ ధమాకా..