
స్థిరమైన వడ్డీ రేట్లు, జీఎస్టీ తగ్గింపులు
25–30 శాతం పెరగనున్న అమ్మకాలు
పండగ అంటే ప్రతి ఇంటా ఆనందమే.. ఫెస్టివల్ సీజన్ (Festive Season) వస్తుందంటే చాలు మార్కెట్లు కళకళలాడుతుంటాయి. దీనికి స్థిరాస్తి రంగం మినహాయింపు కాదు. తెలుగు రాష్ట్రాలలో వినాయక చవితితో ఆరంభమయ్యే పండగ సీజన్ హోలీ వరకూ కొనసాగుతుంది. ఇలాంటి తరుణంలో కేంద్రం వస్తు సేవల పన్ను(జీఎస్టీ) సంస్కరణలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) వడ్డీ రేట్లు స్థిరంగానే ఉంచింది. దీంతో ఈసారి పండగ ప్రాపర్టీ కొనుగోలుదారులకు డబుల్ ధమాకాగా మారింది. - సాక్షి, సిటీబ్యూరో
దీంతో ఈ ఏడాది ఫెస్టివల్ సీజన్‌లో విక్రయాలు 25–30 శాతం అధికంగాఉంటాయని స్థిరాస్తి నిపుణులు అంచనా వేస్తున్నారు. డెవలపర్లలో నూతనోత్తేజం నెలకొంది. పండగ సీజన్‌లో రియల్ రంగానికి (Real Estate) పండగే. కాకపోతే ఈసారి కొనుగోలుదారులకే సిసలైన పండగ అని చెప్పాలి. ఎందుకంటే గతేడాదితో పోలిస్తే ఈసారి గృహ రుణాలపై వడ్డీ భారం తగ్గుముఖం పట్టింది. జీఎస్టీ భారం తగ్గింది. అందుకే ఈ పండగ సీజన్‌లో సొంతింటి కలను సాకారం చేసుకోవాలని భావించేవారికి డబుల్ ధమాకాగా చెప్పొచ్చు.
హైదరాబాద్‌లో ఏడాదిన్నరగా ఇళ్ల విక్రయాలు గణనీయంగా తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాలతో అడుగులు ముందుకు వేస్తుండటంతో కొనుగోలుదారుల్లో ఉత్సాహం పెరుగుతోంది. కాకపోతే ఇళ్ల ధరలు కాస్త తగ్గుముఖం పట్టాలని కొందరు ఎదురుచూస్తుండగా.. మార్కెట్ మెరుగ్గా లేని తరుణంలో కొంటేనే మెరుగని, ఒకసారి అమ్మకాలు పెరిగితే కొనుగోలు చేయడం కష్టమని భావించిన కొందరు కస్టమర్లు నచ్చిన ప్రాజెక్ట్‌లలో ఫ్లాట్లను కొనేందుకు ముందుకొస్తున్నారని పలువురు డెవలపర్లు అభిప్రాయపడుతున్నారు.
ఔత్సాహిక బయ్యర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నప్పటికీ.. కోకాపేట, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్, నియోపొలిస్ వంటి ప్రాంతాల్లో ఫ్లాట్లను ఎంచుకోవడానికి కొనుగోలుదారులు అధిక ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పరిమిత సంఖ్యలో ఉన్న ఫ్లాట్లను ఇప్పుడు కొనకపోతే మరెప్పుడూ కొనలేమనే ఆలోచన బయ్యర్లలో ఏర్పడింది. అందుకే ఆయా ప్రాంతాలలో ఏ కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించినా కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.