
అనుమతికి మించి పార్కింగ్ స్థలం విక్రయం
డ్రైవ్ వేలను సైతం వదలని పలువురు బిల్డర్లు
టీజీ రెరాలో పెరుగుతున్న ఈ తరహా ఫిర్యాదులు
‘గ్రోహె–హురన్ ఇండియా రియల్ ఎస్టేట్ రిచ్ లిస్ట్‌లో చోటు సంపాదించుకున్న నగరానికి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఇది. హైదరాబాద్‌లోని ఓ ప్రాజెక్ట్‌లో ద్విచక్ర వాహనం కోసం కేటాయించిన పార్కింగ్ స్థలాన్ని.. కార్‌గా ఏమార్చి కొనుగోలుదారునికి విక్రయించి సొమ్ము చేసుకుంది. భవన నిర్మాణ అనుమతి పత్రంలో బైక్ పార్కింగ్ స్థలాన్ని డ్రాయింగ్‌లో కారు బొమ్మగా మార్చారని ఆరోపిస్తూ ఓ ఫిర్యాదుదారుడు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ–రెరా)ను ఆశ్రయించాడు. ఫిర్యాదు స్వీకరించిన టీజీ–రెరా అప్రూవల్ ప్లాన్‌ను తప్పనిసరిగా అనుసరించాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు’.. గృహ కొనుగోలుదారులకు పార్కింగ్ స్థలం విక్రయంలో పేరు మోసిన నిర్మాణ సంస్థ తీరే ఇలా ఉంటే చిన్నాచితక డెవలపర్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమధ్య కాలంలో బిల్డర్ల అక్రమ పార్కింగ్ విక్రయాలపై టీజీ–రెరాకు కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు వస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో
జీవో నంబరు 168 ప్రకారం 2 వేల గజాలపైన నిర్మించే నివాస భవన నిర్మాణాలలో 33 శాతం బిల్టప్ ఏరియాను పార్కింగ్‌కు కేటాయించాలి. ఇందులో 30 శాతం ఆ భవనంలోని నివాసితులకు, 3 శాతం సందర్శకుల కోసం కేటాయించాల్సి ఉంటుంది. అలాగే వాణిజ్య భవన నిర్మాణాలలో అయితే 44 శాతం బిల్టప్ ఏరియాను పార్కింగ్‌కు కేటాయించాల్సి ఉంటుంది. ఇందులో 40 శాతం రిటైల్ స్టోర్లకు, 4 శాతం సందర్శకులకు కేటాయించాలి. 2.5/4.5 మీటర్ల పొడవు, వెడల్పుతో కారు పార్కింగ్‌ను కేటాయించాలి. దీనికంటే తక్కువ ఉండకూడదు. కానీ, ప్రస్తుతం ఈ నిబంధనలను తూ.చ. తప్పకుండా అనుసరించే డెవలపర్లు చాలా తక్కువే.
లాటరీ పద్ధతిలో పార్కింగ్ ప్లేస్..
ఏ గృహ కొనుగోలుదారుడికి ఎక్కడ పార్కింగ్ ప్లేస్ కేటాయించాలనే అంశంపై కూడా నిబంధనలు ఉన్నాయి. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) వచ్చిన మూడు నెలలలోపు అసోసియేషన్ ఏర్పాటు కావాలి. నివాసితులకు పార్కింగ్ ప్లేస్‌ల కేటాయింపు కోసం ఆఫీస్ బేరర్స్ సమక్షంలో లాటరీ పద్ధతిలో కేటాయించాలి. 600 గజాలలోపు నిర్మించే స్టిల్ట్+5 అంతస్తుల భవనాలకైతే డీమ్‌డ్ టు సాటిస్‌ఫై ఉంటుంది. బహుళ అంతస్తుల భవనాలలో అక్రమ పార్కింగ్ విక్రయాలపై సమస్యలు ఎక్కువగా జరుగుతుంటాయి.
టీడీఆర్‌తోనూ పార్కింగ్ సమస్యలే..
సాధారణంగా డెవలపర్లు అనుమతి ఉన్న దాని కంటే అదనంగా పార్కింగ్ ప్లేస్‌లను విక్రయిస్తుంటారు. ఉదాహరణకు అప్రూవల్ డ్రాయింగ్‌లో 450 కార్ల పార్కింగ్ ప్లేస్‌లకు అనుమతి లభిస్తే.. 600ల పార్కింగ్ ప్లేస్‌లుగా మార్చి విక్రయిస్తుంటారు. డిమాండ్‌ను బట్టి ఒక్కో కారు పార్కింగ్‌ను రూ.1–5 లక్షల చొప్పున అమ్ముకుంటుంటారు. కొందరు డెవలపర్లు స్టిల్+4 అంతస్తులకు నిర్మాణ అనుమతులు తీసుకొని, ఆ తర్వాత ట్రాన్స్‌ఫర్ డెవలప్‌మెంట్ రైట్స్(టీడీఆర్) తీసుకొని ఇంకో అంతస్తు నిర్మిస్తున్నారు. 400 గజాల్లో 8
అపార్ట్‌మెంట్లు వస్తే.. టీడీఆర్ తీసుకొని ఇంకో అదనపు అంతస్తులో రెండు ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. దీంతో యూనిట్ల సంఖ్య పెరిగి, పార్కింగ్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.
డ్రైవ్ వేలు కూడా పార్కింగ్‌గానే..
ఆరు నెలల్లో 10–12 అక్రమ పార్కింగ్ విక్రయ ఫిర్యాదులే వచ్చాయి. కొందరు డెవలపర్లు డ్రైవ్ వేలను కూడా పార్కింగ్ ప్లేస్‌గా మార్చి విక్రయిస్తున్నారు. ఈ తరహా ఫిర్యాదులలో అప్రూవ్డ్ డ్రాయింగ్ ప్లాన్‌ను తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నాం.
– కే.శ్రీనివాసరావు, సభ్యులు, టీజీ–రెరా