
విలాసవంతమైన గృహాలే కానీ, అందుబాటు ధరల్లో..! ఇదీ ఇప్పుడు నగర రియల్టీ మార్కెట్‌లో కొత్త ట్రెండ్. ఆడంబరాల కంటే గృహ కొనుగోలుదారుల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రాజెక్ట్‌ను తీర్చిదిద్దడమే ఈ అఫర్డబుల్ లగ్జరీ యూనిట్ల ప్రత్యేకత. సాధ్యమైనంత వరకూ నిర్మాణ, నిర్వహణ వ్యయాలను అదుపులో పెట్టుకుంటూ.. ధరలు అందుబాటు ఉండేలా చేసే అధిక సాంద్రత ప్రాజెక్ట్‌లతో ఇది సాధ్యమేనంటున్నారు రియల్టీ పరిశ్రమ నిపుణులు. - సాక్షి, సిటీబ్యూరో
దేశీయ రియల్ ఎస్టేట్ రంగాన్ని కరోనాకు ముందు, తర్వాత అని విభజించక తప్పదు. ఎందుకంటే కోవిడ్ మహమ్మారి కాలంలో ఇంటి అవసరం తెలిసొచి్చంది. వర్క్ ఫ్రం హోమ్, ఆన్‌లైన్ క్లాస్‌లు రకరకాల కారణాలతో ఇంట్లో గడిపే సమయం పెరిగింది. ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దీంతో ఇంట్లో ప్రత్యేకంగా గది, వ్యాయామం, యోగా వంటి ఆరోగ్య అవసరాల కోసం ప్రత్యేక స్థలం అవసరమైంది. దీంతో క్రమంగా నాలుగు గోడల చౌక గృహాలకు బదులుగా విశాలమైన లగ్జరీ ఇళ్లకు డిమాండ్ ఏర్పడింది.
ప్రాంతం, వసతులు, నాణ్యత, గడువు కంటే ఇప్పటికీ గృహ కొనుగోళ్లలో కస్టమర్ల తొలి ప్రాధాన్యత ధరకే.. అందుకే ధరను బ్యాలెన్స్ చేస్తూ కస్టమర్ల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా ప్రాజెక్ట్‌లను చేపట్టేందుకు డెవలపర్లు ఆసక్తి చూపిస్తున్నారు. లగ్జరీ గృహాలు, స్థోమత మధ్య చక్కటి సమతుల్యతను పాటిస్తుండటంతో నగరంలో సరసమైన లగ్జరీ హౌసింగ్ భావన ఊపందుకుంది. అఫర్డబుల్ లగ్జరీ గృహ విభాగం ప్రధాన ప్రయోజనం ఏంటంటే.. డెవలపర్లు గృహ కొనుగోలుదారుల సంపూర్ణ అవసరాలను పరిగణలోకి తీసుకోవడమే. ప్రాజెక్ట్‌ను హైప్ చేయడానికి ఫ్యాన్సీ ఆడంబరాలు, అలంకరణలను జోడించడానికి బదులుగా ఖర్చులను ఆదా చేస్తూ కస్టమర్లకు అవసరమైన వసతులు, సౌకర్యాలను అందించడానికి ప్రయతి్నస్తారు.
యువ కస్టమర్ల ఆసక్తి..
ఈ విలాసవంతమైన ఇళ్ల కొనుగోలుదారులు ఎక్కువగా యువ కస్టమర్ల నుంచే ఆదరణ ఎక్కువగా ఉంది. మీలినియల్స్, అధిక సంపాదన ఆర్జించే జెన్–జెడ్, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వంటి కస్టమర్లు ఎక్కువగా ప్రీమియం ఇళ్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ఐటీ హబ్ నగరాలలో విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ అధికంగా ఉంది. ఈ తరహా గృహ కొనుగోలుదారులు తమ ఆదాయ స్థాయిలకు సరిపోయే ధర, ఎక్కువ వసతులు ఉండే నివాస సముదాయాలను కోరుకుంటున్నారు.
అధిక అద్దెలు కూడా కారణమే..
గృహాల అద్దెలు పెరగడం కూడా విలాసవంతమైన ఇళ్ల డిమాండ్‌కు కారణమే. ఐటీ హబ్ నగరాలలో ఏటా అద్దెలు 9–15 శాతం మేర పెరుగుతున్నాయి. దీంతో పెట్టుబడులపై అధిక రాబడి ఆర్జిస్తున్నారు. దీంతో పెట్టుబడిదారులు ఇప్పుడు సరసమైన లగ్జరీ ప్రాపర్టీలను ఆర్థికంగా చురుకైన ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌గా పరిగణిస్తున్నారు. అద్దె ఆదాయంతో నెలవారీ వాయిదా(ఈఎంఐ) చెల్లింపులతో భర్తీ చేయాలని భావిస్తుండటంతో విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ పెరుగుతుంది.
అత్యాధునిక నిర్మాణ పద్ధతులు
భూముల ధరలు తక్కువగా ఉన్న ప్రాంతాలలో ముఖ్యంగా ద్వితీయ శ్రేణి పట్టణాలు, ప్రాంతాలలో అధిక సాంద్రత కలిగిన ప్రాజెక్ట్‌లను నిర్మించడం ఒక కీలకమైన వ్యూహం. అలాగే డెవలపర్లు ఖర్చులను తగ్గించడానికి అత్యాధునిక నిర్మాణ పద్ధతులు, స్మార్ట్ డిజైన్‌లను అవలంభిస్తున్నారు. సాంకేతికత వినియోగంతో దీర్ఘకాలిక నిర్వహణ వ్యయాలను
నియంత్రిస్తున్నారు. దీంతో నివాస సముదాయాలు పర్యావరణహితంగానే కాకుండా బడ్జెట్ అనుకూలంగా మారుస్తుంది. వ్యవస్థీకృతమైన ఆప్టిమైజ్ లే–అవుట్లతో సమర్థవంతమైన యూనిట్ పరిణామాలను అందించడంతో తక్కువ ధరకే లగ్జరీ వసతులను యాక్సెస్ చేయడంలో సహాయపడుతుంది.
లగ్జరీ ఫీలింగ్..
డెవలపర్లు కార్పెట్ ప్రాంతాన్ని పెంచడానికి స్మార్ట్ డిజైన్ లేఅవుట్లను ఎంపిక చేస్తారు. కాంక్రీట్‌ను సాధ్యమైనంత తక్కువ ఉపయోగించడంతో పాటు విశాలమైన, విలాసవంతమైన వాతావరణాన్ని కల్పించేందుకు పెద్ద సైజు కిటికీలు, తలుపులను ఏర్పాటు చేస్తున్నారు. ఎత్తయిన సీలింగ్‌తో ప్రవేశ ద్వారాన్ని సెవెన్ స్టార్ హోటల్ మాదిరి గా లగ్జరీ ఆంబియెన్స్‌ను కల్పిస్తున్నారు. వేగవంతమైన డెలివరీ, నిర్మాణ వ్యయాన్ని తగ్గించేందుకు మాడ్యులర్ నిర్మాణ పద్ధతులను అమలు చేస్తున్నారు. స్మార్ట్ హోమ్ టెక్నాలజీ, వెల్‌నెస్ ఫీచర్లు, స్థిరమైన పద్ధతులతో నివాస సముదాయాల విలువలను పెంచుతున్నారు.
నిర్మాణ, నిర్వహణ వ్యయాలు..
డెవలపర్లు ఉపయోగిస్తున్న మరో విధానం స్థిరత్వం. ఈ తరహా నిర్మాణాలు ఖర్చు, సమర్థవంతమైన ముందస్తు వ్యయాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే పర్యావరణంపై తక్కువ ప్రభావం ఉండేలా చేస్తుంది. ఈ నిర్మాణాలను తక్కువ ఆర్థిక భారం, పన్ను ప్రయోజనాలతో నిర్మించడంలో సహాయపడుతుంది. స్థిరమైన పద్ధతులను అవలంభించడం వల్ల దీర్ఘకాలిక కార్యాచరణ వ్యయాలు తగ్గుతాయి. అలాగే పర్యావరణ స్పృహ ఉన్న కస్టమర్లను ఆకర్షిస్తాయి. పర్యావరణ అనుకూలమైన నిర్మాణ సామగ్రి, శక్తి సమర్థవంతమైన సాంకేతిక పరిజ్ఞానం వాడకం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు కార్యాచరణ ఖర్చులను తగ్గిస్తుంది.
వెల్‌నెస్, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం
కరోనా తర్వాత నుంచి ప్రజల్లో ఆరోగ్యం, పర్యావరణ స్పృహపై అవగాహన పెరిగింది. దీంతో సస్టెనబులిటీ, గ్రీనరీకి ప్రాధాన్యత ఇచ్చే నివాసాల కొనుగోళ్లు, పెట్టుబడులకు కీలక అంశంగా మారింది. అఫర్డబుల్ లగ్జరీ ఇళ్లకు యువ కస్టమర్ల నుంచి ఎక్కువ ఆసక్తి ఉంటుంది. మిలీనియల్స్, జెన్–జెడ్ గృహ కొనుగోలుదారులు బహుళ ప్రయోజనాలు ఉండే ప్రాపరీ్టలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. వెల్‌నెస్, ఫిట్‌నెస్ సౌకర్యాలు, సోషలైజింగ్ కోసం కమ్యూనిల్ ప్రాంతాలు, బహుళ ఈ–కామర్స్ డెలివరీలు, ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ స్టేషన్లు, పాయింట్లు వంటి అనుకూలమైన మౌలిక సదుపాయాలు కోరుకుంటున్నారు. ఆటోమేటిక్ లైటింగ్ ఏర్పాట్లు, అధునాతన భద్రత వ్యవస్థ, తక్కువ విద్యుత్‌ను వినియోగించే ఉపకరణాలు వంటి స్మార్ట్ హోమ్ టెక్నాలజీలు ప్రామాణికంగా మారుతున్నాయి.
బయోఫిలిక్ డిజైన్లు..
బయోఫిలిక్ డిజైన్ అనేది నివాస, వాణిజ్య నిర్మాణ రంగంలో పెరుగుతున్న ధోరణి. సమృద్ధిగా సహజ కాంతి, ఇండోర్ మొక్కలు, కమ్యూనిటీ గార్డెన్‌లు వంటి వివిధ అంశాల ద్వారా పచ్చని, ప్రకృతిని సృష్టించడం. ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన జీవన పరిస్థితులు. స్థానిక జంతుజాలం, పచ్చని ప్రదేశాలు, స్థానిక మొక్కలతో మార్గాలను ఏకీకృతం చేస్తాయి. కలప, రాయి, టెర్రకోట వంటి సహజ పదార్థాలను ఫ్లోరింగ్, అలంకరణలో ఉపయోగిస్తారు. అలాగే ఆకుపచ్చ, నీలం, మట్టి రంగుల పాలెట్‌తో ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తారు. చిన్న ఇండోర్ ఫౌంటేన్‌లు, టేబుల్ టాప్ వాటర్ ఫౌంటేన్ల వంటివి ఏర్పాటు చేస్తారు. పెద్ద కిటికీలతో సహజ కాంతికి ప్రాధాన్యత ఇస్తారు. గాలి నాణ్యత, నివాసితుల మానసిక స్థితిని మెరుగుపర్చడానికి గాలి వీచేందుకు ప్రోత్సహిస్తారు.
యాంత్రిక వ్యవస్థలపై ఆధారపడటాన్ని తగ్గించి తక్కువ విద్యుత్‌ను వినియోగించే ఉపకరణాలను వాడతారు. ఈ తరహా ప్రాజెక్ట్‌ల కొనుగోలుదారులు మృదువైన ఫినిషింగ్, ఆధునిక డిజైన్లకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అయితే లగ్జరీ, సౌందర్యంపై ఏమాత్రం రాజీపడరు. కొనుగోలుదారుల కార్యచరణ ఖర్చులను తగ్గించే శక్తి సామర్థ్యం, స్థిరమైన లక్షణాలు ఉండే పర్యావరణ అనుకూల ఎంపికలను కోరుకుంటారు. ఈ తరహా ప్రాజెక్ట్‌లకు ప్రాంతం, కనెక్టివిటీకి కూడా ముఖ్యమే. హైవేలు, మెట్రో లైన్‌లతో మంచి కనెక్టివిటీలతో పాటు సామాజిక మౌలిక సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లోని ప్రాపరీ్టలకు నివాసితులకు కోరుకుంటున్నారు.