
మరో వేలానికి సన్నద్ధం
రాయదుర్గ్ నాలెడ్జ్ సిటీలో ఎకరా గుర్తింపు
రూ.200 కోట్లు పలకవచ్చని అంచనా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలోని రాయదుర్గ్‌లో భూముల వేలం కాసుల వర్షం కురిపిస్తుండటంతో మరిన్ని భూముల వేలానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నెల మొదటి వారంలో రెండు ల్యాండ్ పార్సిళ్లకు నిర్వహించిన వేలంలో ఎకరా ధర గరిష్టంగా రూ.177 కోట్లు పలికిన విషయం తెలిసిందే. సుమారు 19 ఎకరాలకు నిర్వహించిన ఈ వేలం ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.3,135 కోట్లు సమకూరాయి.
ఈ నేపథ్యంలో రాయదుర్గ్‌లోని హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ లే ఔట్‌లో వచ్చే నెల 10న సుమారు ఎకరా భూమిని వేలం వేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) ఈ నెల 16న నోటిఫికేషన్ జారీ చేసింది. వేలం ప్రక్రియ, ఇతర అంశాలపై ఔత్సాహిక కొనుగోలుదారులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 22న రాయదుర్గ్‌లోని టీ హబ్‌లో (t-hub) ప్రీబిడ్ సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్, ఈఎండీ చెల్లించేందుకు నవంబర్ 4ను గడువుగా నిర్దేశించారు.
ఎకరా రూ.200 కోట్లు?
రాయదుర్గ్ (Raidurg) పాన్‌మక్తాలోని సర్వే నంబరు 83/1లోని 14ఏ/1, 14బీ/1 ప్లాట్లను టీజీఐఐసీ వేలం వేస్తోంది. ఈ రెండు ప్లాట్ల విస్తీర్ణం కలుపుకుని 4,718.22 చదరపు గజాలు (సుమారు ఎకరా విస్తీర్ణం) కాగా, ఒక్కో చదరపు గజం అప్‌సెట్ ధరను (వేలం ప్రారంభ ధర)ను రూ.3.10 లక్షలుగా, ఎకరా ధరను సుమారు రూ.146 కోట్లుగా నిర్ణయించింది. వేలం పాటలో ఎకరా ధర రూ.200 కోట్ల మార్క్‌ను అధిగమించే అవకాశముందని టీజీఐఐసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇటీవలి వేలంలో 17 మంది బిడ్డర్లు పోటీ పడిన నేపథ్యంలో తాజా వేలానికి కూడా భారీగా పోటీ ఉంటుందని భావిస్తున్నారు. రాయదుర్గ్‌లో టీజీఐఐసీ (TGIIC) అదీనంలో 470 ఎకరాలు ఉండగా, గడిచిన దశాబ్ద కాలంలో 200 ఎకరాలకుపైగా విక్రయించారు. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో మరో పది ఎకరాల మేర వేలానికి సిద్ధంగా ఉండగా, 50 ఎకరాలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. దీంతో కోర్టు వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించేలా టీజీఐఐసీ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది.