
హైదరాబాద్‌లో భూమి ధరలు రికార్డులు బద్ధలు కొడుతున్నాయి. ఎకరా భూమి ఏకంగా రూ.177 కోట్లు పలికిందంటే ఆశ్చర్యమేస్తోంది. రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఆశించిన స్థాయిలో లేవన్న వార్తలొస్తున్న వేళ ఒక కంపెనీ ఇంత మొత్తం పెట్టిందంటటే నమ్మశక్యం కాదు. వేలం పాటలో కొన్నమాటైతే వాస్తవం. అయితే కొనుగోలు ధర పూర్తిగా చెల్లించినప్పుడే ఈ విలువ ధృవీకరణ అవుతోంది.
తెలంగాణలో రియల్ ఎస్టేట్ కుదేలైందన్నది దుష్ప్రచారమేనని వాస్తవం లేదని, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గత ఏడాది సెప్టెంబర్లో రూ.2800 కోట్ల విలువైన ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగితే, అది రూ.4804 కోట్లు అని రియల్ ఎస్టేట్ రంగం వృద్ధికి ఇదే ఆధారమని కూడా ఆయన వ్యాఖ్యానించారు అయితే జనాభిప్రాయం దీనికి భిన్నంగా ఉంది. ఆర్థిక వ్యవస్థ కాస్త బాగున్న రోజుల్లో బుక్ అయిన ఇళ్లు, అపార్టుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతుండవచ్చని, ప్రస్తుతం బుకింగ్ ఎంత మేరకన్నది కూడా చూడాలంటున్నారు వారు. వాస్తవానికి రియల్ ఎస్టేట్ రంగం తెలంగాణతోపాటు దేశాద్యంతం కూడా మందగతిలోనే ఉందని వారు చెబుతున్నారు.
కొన్ని రోజుల క్రితం తెలంగాణ పారిశ్రామిక వసతుల కల్పన సంస్థ రాయదుర్గ్‌లోని 7.67 ఎకరాల భూమిని వేలానికి పెడితే ఎంఎస్‌ఎన్ రియాల్టీ సంస్థ ఎకరానికి రూ.177 కోట్ల చొప్పున మొత్తం రూ.1350 కోట్లకు దక్కించుకుంది. పెస్టీజ్ రియాల్టీ ఇంకో 11 ఎకరాలను ఎకరాకు రూ.141.5 కోట్ల చొప్పున సొంతం చేసుకుంది. ఈ వేలం ద్వారా మొత్తం రూ.2913 కోట్ల ఆదాయం దక్కిందన్నమాట. రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీల రూపంలో ఇంకో రూ.225 కోట్లు కూడా రానున్నాయి. అయితే గతానుభవాలను దృష్టిలో ఉంచుకుంటే.. వేలం పాడిన ఈ సంస్థలు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేంతవరకూ కొనసాగుతాయా అన్న అనుమానం వస్తుంది. 2023లో కోకాపేటలో ఎకరాకు రూ.100.75 కోట్లు పలికిన విషయం తెలిసిందే. అప్పటితో పోలిస్తే ధర సుమారు 76 శాతం పెరిగిందన్నమాట. హైదరాబాద్ సాధిస్తున్న సుస్థిరాభివృద్ధి, గ్లోబల్ బిజినెస్ హబ్‌గా మారడం, మౌలిక వసతులు తదితరాలు ఇందుకు కారణమని అధికారులు అంటున్నారు. ప్రభుత్వ విధానాలపై పెట్టుబడిదారుల నమ్మకానికి నిదర్శనమని టీజీఐఐసీ ఎండీ శశాంక అభిప్రాయపడ్డారు. ఇవన్నీ వాస్తవమైతే ఫర్వాలేదు కానీ.. బలవంతంగా మార్కెట్‌ను పెద్దగా చూపించే ప్రయత్నం చేస్తే మాత్రం బెడిసికొడుతుందని రియల్ ఎస్టేట్ రంగం అనుభవజ్ఞులు చెబుతున్నారు.
ఎకరా భూమికి రూ.177 కోట్లు, రూ.141.5 కోట్లు పెట్టి కొన్న కంపెనీలు నిర్మాణాలు పూర్తయిన తరువాత ఎంత కాదన్నా అన్ని ఖర్చులు కలుపుకుని చదరపు అడుగు రూ.30 - 40 వేల కు అమ్ముకోవాల్సి వస్తుందని కొందరు బిల్డర్ల అంచనా. అయితే ఆ ప్రాంతంలో ఎఫ్‌ఎస్‌ఏ ఎక్కువ కాబట్టి ఏభై, అరవై అంతస్థుల నిర్మాణానికి కూడా అనుమతులు లభిస్తాయని... ఆ రకంగా చదరపు అడుగుకు రూ.10 - 20 వేలకు అమ్ముకున్నా గిట్టుబాటు అవుతుందని మరికొందరి అంచనా. మరీ ఎక్కువ ధర పెడితే కంపెనీలు కూడా కొనుగోలుకు ఆలోచిస్తాయని చెబుతున్నారు. పెట్టిన పెట్టుబడిపై ఒక శాతం కూడా గిట్టుబాటు కాదనుకుంటే ఎందరు కొనుగోలు చేస్తారు అని ఒక ప్రముఖ బిల్డర్ ప్రశ్నించారు.
కోకాపేటలో పక్కనే 50 - 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండటంతో దాని ధర రూ.వంద కోట్లయితే తనదీ అంతే పలుకుతుందన్న అంచనాతో గతంలో ఒక కంపెనీ వేలంలో పాల్గొందని సమాచారం. అయితే ఆ అంచనాలు తారుమారు కావడంతో ఆ కంపెనీ తన డిపాజిట్‌ను వదులుకుంది మినహా ఎకరాకు రూ.వంద కోట్లు చెల్లించలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రస్తుత వేలం పాటలలో పాల్గొన్న కంపెనీలలో ఒక రాజకీయ నేత భాగస్వామిగా ఉన్నారు. ఇటీవలే రియల్ ఎస్టేట్ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడియన ఆయన కంపెనీనే ఇంత భారీ మొత్తానికి వేలం పాటలో పాల్గొనడం వెనుక మతలబు ఏమిటన్నది ప్రశ్న.
ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా మాంద్యం ఏర్పడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఆశించిన స్థాయిలో లేవు. అమెరికా ప్రభుత్వ విధానాలు, ప్రత్యేకించి ట్రంప్ సుంకాలు భారత్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఏఐ కారణంగా ఐటీ రంగం అనిశ్చితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు గతంలో మాదిరిగా రుణాలపై అపార్టుమెంట్లు కొనుగోలు చేయడం లేదని అంటున్నారు. పైగా ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసుకున్న భవనాలు, అపార్ట్‌మెంట్లు కొనుగోలుదారులు, అద్దెదారుల కోసం వేచి చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నంతలో హైదరాబాద్ కాస్తో, కూస్తో బెటర్‌గా ఉండవచ్చేమో కాని, ఈ స్థాయిలో ధరపెట్టి కొనుగోలు చేసేంతగా ఉండకపోవచ్చని ఒక నిపుణుడు అభిప్రాయపడ్డారు. ఇంకో సంగతి గుర్తు చేసుకోవాలి. హెచ్‌ఎండీయే ఇటీవలే హైదరాబాద్ శివార్లలో 103 ప్లాట్లను వేలం వేస్తే, మూడు మాత్రమే అమ్ముడుపోయాయి. వేలం ద్వారా రూ.500 కోట్లు వస్తాయని ఆశిస్తే, రూ.38 కోట్లే వచ్చాయి. కొద్ది నెలల వ్యవధిలోనే ఎకరం రూ.177 కోట్లకు కొనేంత మార్పు వస్తుందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ పాలన చివరి రోజుల్లో రియల్ ఎస్టేట్ పడిపోవడం ఆరంభమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ మరింతగా దిగజారిందన్న అపప్రథ ఉంది. దీనిని కప్పిపుచ్చడానికి రేవంత్ ప్రభుత్వం ఏదో మాయాజాలం చేసి ఉండాలని బీఆర్‌ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. రెండు ప్రముఖ సంస్థలపై ఒత్తిడి తెచ్చి, ఇతరత్రా మేలు చేస్తామని ఆఫర్ ఇచ్చి ఈ స్థాయిలో ధర పలికేలా చేశారన్నది కొందరి అనుమానం. ఈ రెండు కంపెనీలు గడువులోపు డబ్బును చెల్లిస్తే రేవంత్ ప్రభుత్వ విశ్వసనీయత, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ అమాంతంగా పెరిగిపోతుంది. దీని ప్రభావం ఫ్యూచర్ సిటీపై కూడా పడుతుంది. అక్కడ కూడా లావాదేవీలు పుంజుకుంటాయి. రీజినల్ రింగ్ రోడ్ల నిర్మాణం, హైదరాబాద్ - విజయవాడ రోడ్లు విస్తరణ, కొత్తగా అమరావతికి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే వంటివి కూడా కార్యాచరణకు వచ్చినప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బాగా పుంజుకునే అవకాశం ఉంది. ఇంతకాలం నేచురల్ గా గ్రోత్ ఉండడం వల్ల భూముల ధరలు పెరిగాయి. అయితే ఇవీ మరీ పెరిగిపోతే మధ్య తరగతికి అందుబాటులో లేకపోతే కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉంటుంది.

::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.