
హైదరాబాద్‌లో భూముల ధరలు ఆకాశంలోకి దూసుకుపోయాయి. కోకాపేట, రాయదుర్గం వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లోని స్థలాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. 2017లో రాయదుర్గంలో ప్రభుత్వం నిర్వహించిన వేలంలో ఎకరం రూ.42.59 కోట్లకు గౌరా వెంచర్స్ దక్కించుకోగా.. తాజాగా నాలెడ్జ్ సిటీలో ఎంఎస్‌ఎన్ సంస్థ ఏకంగా రూ.177 కోట్లు వెచ్చించింది. కేవలం 8 ఏళ్లలో రాయదుర్గంలో భూముల ధరలు 320 శాతం మేర పెరిగాయి. ఇది కేవలం ఒక లావాదేవీ మాత్రమే కాదు ఇది అభివృద్ధికి సంకేతం. నగర మౌలిక సదుపాయాలు, వాణిజ్య సాంద్రత, అభివృద్ధి, ప్రభుత్వ విధానాలపై సంస్థాగత, పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. – సాక్షి, సిటీబ్యూరో
పాన్ ఇండియా మూవీ లాగే..
బాహుబలి నుంచి తెలుగు సినీ పరిశ్రమ ఎలాగైతే పాన్ ఇండియా స్థాయి మొదలైందో.. అలాగే గత ప్రభుత్వ హయాంలో కోకాపేట భూముల వేలంలో ఎకరం రూ.100 కోట్లు పలకడంతో మొదలైంది. అగ్రశ్రేణి జాతీయ డెవలపర్లు నగరంలో భూములను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. నగరంలోని మౌలిక సదుపాయాలు, సాంకేతిక పర్యావరణ వ్యవస్థలు ముంబై, బెంగళూరు కంటే మెరుగ్గా ఉన్నాయి. రాయదుర్గం వేలంతో మన నగరం దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోటీ పడటం దాటి ముందుకు దూసుకుపోతుందనే సంకేతాన్ని అందిస్తోంది. పట్టణ విలువలను పునరి్నర్వచిస్తుంది.
అర్బన్ బ్రాండింగ్
పారదర్శక వేలం, విధాన స్థిరత్వంతో హైదరాబాద్ ఇప్పుడు ప్రాంతీయ పవర్‌హౌస్ మాత్రమే కాదు ప్రపంచ వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందింది. నాలెడ్జ్ సిటీ ప్రాంతం దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్, ఇన్నోవేషన్ కారిడార్. ఇది హెటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాలకు చేరువలో ఉండటం అదనపు అడ్వాంటేజ్. గత ఆర్థిక సంవత్సరంలో నగరంలో 1.2 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలను నమోదు చేసింది. ఐటీ, ఐటీఈఎస్‌లో 52 శాతం, ఆరోగ్య సంరక్షణ, ఫార్మా రంగంలో 18 శాతం, రిటైల్, హాస్పిటాలిటీలో 12 శాతం ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఇది రియల్టీ రంగానికి వైవిధ్యభరితమైన గ్రోత్ ఇంజిన్.
విశ్వాసం పెరుగుతోంది
వేలంలో రికార్డ్ ధర పలకడం స్థానిక రియల్ ఎస్టేట్ సామర్థ్యానికి, పెట్టుబడి దారుల్లో విశ్వాసానికి సూచిక. అపరిమిత ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్‌ఎస్‌ఐ), క్లియర్ ల్యాండ్ టైటిల్స్, ఫాస్ట్ ట్రాక్ అనుమతులతో కూడిన ప్రైమ్ ల్యాండ్స్‌కు బడా నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపిస్తుంటాయి. టెక్ సంస్థలు, కార్పొరేట్, సంస్థాగత పెట్టుబడిదారులు నుంచి నిరంతర డిమాండ్‌ను ముందుగానే అంచనా వేస్తున్నారనేది సూచిస్తుంది. రాయదుర్గంలో భూమి విలువ వృద్ధితో మాదాపూర్, గచ్చిబౌలి, కోకాపేట వంటి చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుతుంది.
➤ అధిక ధరలకు భూములను కొనుగోలు చేసే ధోరణి దీర్ఘకాలంలో స్థిరాస్తి రంగానికి ఏమాత్రం మంచిది కాదు. 95 శాతం బిల్డర్లు, తుది వినియోగదారులు(ప్లాట్లు లేదా వాణిజ్య స్థల కొనుగోలుదారులు) ప్రతికూలమే. భూమి విలువలు స్థిరంగా పెరగాలే తప్ప రాత్రికి రాత్రే పెరిగితే తుది కొనుగోలుదారులకు అఫర్డబులిటీ ఉండదు. నగరం శివార్లకు విస్తరించే బదులుగా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమై ట్రాఫిక్ జామ్‌లు, మౌలిక సదుపాయాలపై ఒత్తిడికి దారి తీస్తుంది.
➤ ఏ ఉత్పత్తి ధర అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. డిమాండ్, సరఫరా అనేది ఇందులో అత్యంత కీలకం. రియల్ ఎస్టేట్ విషయానికొస్తే అతి ముఖ్యమైనది ప్రాంతం. అందుకే దేశ ఆర్థిక రాజధానిలో దక్షిణ ముంబైలో ఫ్లాట్ కొనుగోలుకు అత్యధిక ధర చెల్లిస్తుంటారు. అక్కడ 10 నుంచి 45 నిమిషాల ప్రయాణ దూరంలోనే భారీ భూమి లభ్యత ఉన్నప్పటికీ, అనేక సమాంతర రోడ్లు అభివృద్ధి చేసినా, మురికివాడలు కొత్త రూపు సంతరించుకుంటున్నా, కొత్త విమానాశ్రయం వచ్చినా.. దక్షిణ ముంబైలోని ప్రాపరీ్టలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దేశంలోని అన్ని మెట్రో నగరాలదీ ఇదే కథ. సేమ్ అలాగే మన నగరంలో పశ్చిమ హైదరాబాద్ పరిస్థితి. మన దగ్గర భారీ మూలధనాన్ని సేకరించగల డెవలపర్లు చాలా తక్కువ. ధరలు అసాధారణంగా పెరిగి భారీ మూలధనం అవసరమైతే అది ధనవంతులైన కొద్ది మంది చేతుల్లోకి వెళ్లిపోతుంది. దీంతో స్థిరమైన డెవలపర్లు కూడా మార్కెట్ నుంచి వైదొలిగే పరిస్థితి ఏర్పడుతుంది.
ఇదీ చదవండి: ఇలాంటి ఇళ్ల కొనుగోలుకు కస్టమర్ల ఆసక్తి!
➤ అపార్ట్‌మెంట్‌లో రూ.3-4 కోట్లతో ఫ్లాట్ కొనాలంటే మధ్యతరగతి ఉద్యోగులు జీవితకాలం ఈఎంఐ చెల్లించే పరిస్థితి. వేలం మధ్యతరగతి ప్రజలకు మంచిది కాదు. కేపీహెచ్‌బీ హౌసింగ్ బోర్డ్ తరహాలో ప్రభుత్వమే మహేశ్వరం, శామీర్‌పేట, మేడ్చల్, సంగారెడ్డి, కొత్తూరు, శంషాబాద్ ప్రాంతాలలో వెంచర్లను అభివృద్ధి చేయాలి. ల్యాండ్ పూలింగ్ విధానంతో ఉద్యోగులు, మధ్యతరగతి వర్గాలకు స్కీమ్‌లలో భారీ లేఅవుట్‌ను వేయాలి.