
ప్రీమియం ఇళ్ల విక్రయాల్లో 170 శాతం వృద్ధి
16 శాతం తగ్గిన అఫర్డబుల్ హౌసింగ్ సేల్స్
ఈ క్యూ3లో 8 నగరాల్లో 87,605 యూనిట్ల అమ్మకాలు
హైదరాబాద్‌లో 9,601 ఫ్లాట్ల విక్రయాలు
నైట్‌ఫ్రాంక్ ఇండియా తాజా నివేదికలో వెల్లడి
సాధారణ ఇళ్లకు కాలం చెల్లింది. ప్రైవసీ, ఆధునిక వసతులు ఉండే విలాసవంతమైన వాటికే ఆదరణ పెరుగుతోంది. ఏడాది కాలంలో దేశంలోని 8 ప్రధాన నగరాలలో 87,605 ఇళ్లు అమ్ముడుపోగా.. ఇందులో రూ.10–20 కోట్ల ధర ఉండే లగ్జరీ యూనిట్ల విక్రయాలు 170 శాతం వృద్ధి చెందగా.. రూ.50 లక్షలలోపు ధర ఉండే అఫర్డబుల్ హౌసింగ్ అమ్మకాలు 16 శాతం తగ్గాయి. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టే డెవలపర్లు కూడా ప్రీమియం ఇళ్ల నిర్మాణానికే మొగ్గు చూపిస్తున్నారు. - సాక్షి, సిటీబ్యూరో
ప్రపంచవ్యాప్తంగా ప్రతికూలతలు కొనసాగుతున్నప్పటికీ.. స్థిరమైన దేశీయ వినియోగం, ప్రభుత్వ మూలధన వ్యయం కారణంగా భారత ఆర్థిక దృక్పథం స్థిరంగా ఉంది. ఈ ఏడాది రెండో త్రైమాసికం క్యూ2)లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి అంచనాలను 7.8 శాతం వద్ద అధిగమించింది. స్థిరమైన దేశీయ పెట్టుబడులు, జీఎస్టీ సవరణలు, వడ్డీ రేట్ల తగ్గింపులతో దేశంలో స్థిరాస్తి విక్రయాలు ఆశాజనంగానే ఉన్నాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికం (జులై–సెప్టెంబర్, క్యూ3)లో ప్రధాన నగరాలలో 87,605 ఇళ్లు సేల్ కాగా.. 88,655 యూనిట్లు లాంచ్ అయినట్లు నైట్‌ఫ్రాంక్ నివేదిక తెలిపింది.
పెరుగుతున్న ఇన్వెంటరీ..
2025 క్యూ3లో 87,603 యూనిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 1 శాతం ఎక్కువ. పుణె మినహా అన్ని నగరాలలో విక్రయాలు స్థిరంగానే ఉన్నాయి. ముంబైలో అత్యధికంగా 24,706 యూనిట్లు అమ్ముడుపోయాయి. అమ్మకాల వృద్ధి స్థిరంగానే ఉన్నప్పటికీ అమ్ముడుపోని ఇన్వెంటరీ 2020 నుంచి స్థిరంగా పెరుగుతూనే ఉంది. విక్రయాల కంటే సరఫరా మించిపోతున్నాయి. ఈ ఏడాది క్యూ3 నాటికి దేశంలోని 8 ప్రధాన నగరాల్లో అమ్ముడుపోని ఇన్వెంటరీ 5,06429 యూనిట్లున్నాయి. వీటి విక్రయానికి 5.8 త్రైమాసికాల సమయం పడుతుంది. వీటిల్లో అత్యధికంగా రూ.50 లక్షలలోపు ధర ఉన్న ఇళ్లు 1,8,0616 ఉన్నాయి.
హైదరాబాద్‌లో..
హైదరాబాద్‌లో ఈ క్యూ3లో 9,601 యూనిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 5 శాతం ఎక్కువ. అలాగే ఈ క్యూ3లో 9,764 యూనిట్లు లాంచ్ అయ్యాయి. గతేడాది క్యూ3తో పోలిస్తే 10 శాతం ఎక్కువ. నగరంలో ఏడాదితో ఇళ్ల ధరలు 13 శాతం మేర పెరిగాయి.
ఆఫీసు అధరహో..
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సప్లయి చెయిన్‌లో నష్టాలు, ఇంధన వ్యయాలు, మూలధన ప్రవాహాలను ప్రభావితం చేయడంతో కార్యాలయ విభాగం కాస్త తడబడింది. 2025 క్యూ3లో 1.78 కోట్ల చ.అ. కార్యాలయ స్థల లావాదేవీలు జరిగాయి. వార్షిక
ప్రాతిపదికన 6 శాతం క్షీణించినప్పటికీ.. 2024 క్యూ3తో పోలిస్తే మాత్రం అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. బెంగళూరు, ముంబై, ఎన్‌సీఆర్‌లు లావాదేవీలలో సగం వాటాలను కలిగి ఉన్నాయి. 42 లక్షల చ.అ.లతో బెంగళూరు ముందంజలో ఉంది. ఈ త్రైమాసికంలో హైదరాబాద్, చెన్నైలు వ్యాల్యూమ్ వృద్ధిలో అత్యధిక వాటాలను కలిగి ఉన్నాయి. హైదరాబాద్ 45 శాతం, చెన్నై 51 శాతం వాల్యూమ్‌లను కలిగి ఉన్నాయి.
బ్యాక్ ఆఫీసు టు జీసీసీ..
ఒకప్పుడు బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాలకు మాత్రమే పరిమితమైన ఇండియా.. నేడు గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు(జీసీసీ)లకు ప్రధాన కేంద్రంగా మారింది. ప్రతిభ, నైపుణ్యం కలిగిన కారి్మకులు, తక్కువ జీవన వ్యయం, అందుబాటులో స్థిరాస్తి ధరలు, ప్రభుత్వ ప్రోత్సాహకర విధానాలు కారణంగా బహుళ జాతి సంస్థలు జీసీసీల ఏర్పాటుకు ఇండియాను ఎంచుకుంటున్నాయి. 2025 క్యూ3లో లీజుకు తీసుకున్న వ్యాల్యూమ్‌లో గ్రేడ్–ఏ ఆఫీసు లావాదేవీలు 88 శాతం వాటాను కలిగి ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్(రీట్స్) విస్తరణ, గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు(జీసీసీ), ఫ్లెక్సిబుల్ ఆఫీస్‌లకు ప్రాధాన్యత పెరుగుతుండటమే ఈ డిమాండ్‌కు ప్రధాన కారణం. ఈ క్యూ3లో జీసీసీలు 57 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్‌ను లీజుకు తీసుకోగా. ఆ తర్వాత థర్డ్ పారీ్ట/ఐటీ సరీ్వస్ ప్రొవైడర్లు 32 లక్షల చ.అ., ఫ్లెక్సిబుల్ ఆఫీసు స్పేస్ 38 లక్షల చ.అ. లావాదేవీలు జరిగాయి.
100 కోట్ల చ.అ. స్టాక్..
ప్రస్తుతం 8 ప్రధాన నగరాలలో ఆఫీసు స్పేస్ స్టాక్ 100 కోట్ల చ.అ.లను దాటింది. ఈ క్యూ3లో 1.24 కోట్ల చ.అ. కార్యాలయ స్థలం పూర్తయ్యింది. ఈ త్రైమాసికంలో డెలివరీ అయిన కార్యాలయ స్థలంలో బెంగళూరు తొలి స్థానంలో నిలిచింది. ఈ నగరంలో 59 లక్షల చ.అ. స్థలంతో 48 శాతం వాటాను కలిగి ఉంది. అత్యధికంగా కోల్‌కతాలో 14 శాతం, ముంబైలో 11 శాతం, ఎన్‌సీఆర్(న్యూఢిల్లీ)లో
9 శాతం, బెంగళూరులో 6 శాతం మేర ఆఫీసు స్పేస్ అద్దెలు పెరిగాయి.
ఇదీ చదవండి: నిర్మాణ సామగ్రిపై తగ్గిన జీఎస్టీ.. గృహాలకు పెరగనున్న డిమాండ్
నగరంలో..
హైదరాబాద్‌లో ఈ క్యూ3లో 29 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 33 శాతం అధికం. అయితే 2025 క్యూ2లో 19 లక్షల చ.అ., క్యూ1లో 40 లక్షల చ.అ. లావాదేవీలు పూర్తయ్యాయి. అలాగే నగరంలో ఈ క్యూ3లో 16 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ డెలివరీ అయ్యింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 61 శాతం ఎక్కువ. నగరంలో ఈ క్యూ3లో ఆఫీసు స్పేస్ అద్దెలు 9 శాతం మేర పెరిగాయి.