
సిమెంట్, టైల్స్, మార్బుల్, గ్రానైట్, రంగులపై తగ్గిన ట్యాక్స్
దీంతో డెవలపర్లకు తగ్గనున్న ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం
ఆ మేరకు ఆదా కస్టమర్లకు బదలాయిస్తేనే ప్రయోజనం
పట్టణ ప్రాంతంలో చౌక గృహాలకు పెరగనున్న డిమాండ్
కేంద్రం వస్తు సేవల పన్ను(జీఎస్టీ)ని సవరించింది. జీఎస్టీ సంస్కరణలు దేశీయ రియల్ ఎస్టేట్ రంగానికి ప్రధానమైన సానుకూల మార్పు. ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్న జీఎస్టీ 2.0 నిర్మాణ రంగానికి పెద్ద ఉపశమనమే. గృహ, కార్యాలయ, రిటైల్ విభాగాల వృద్ధికి దోహదపడటంతో పాటు సరళీకృత పన్ను విధానంతో పారదర్శకత, స్థిరాస్తి కొనుగోలుదారుల్లో విశ్వాసం పెరుగుతోంది. అయితే నిర్మాణ సామగ్రిపై తగ్గే జీఎస్టీ భారాన్ని.. ఆమేరకు డెవలపర్లు ప్రాపర్టీ కొనుగోలుదారులకు బదలాయిస్తే గనక రానున్న దసరా, దీపావళి పండుగ సీజన్ కస్టమర్లలో రెట్టింపు జోష్ నిండుకుంటుంది.
నిర్మాణ సామగ్రిపై జీఎస్టీ తగ్గింపు..
నిర్మాణ రంగంలో కీలకమైన సిమెంట్, ఇసుక, ఇటుకలు, గ్రానైట్, మార్బుల్స్, టైల్స్, రంగులు వంటి పలు నిర్మాణ సామగ్రి ధరలపై కేంద్రం జీఎస్టీని తగ్గించింది. సాధారణంగా ఇంటి నిర్మాణంలో అయ్యే ఖర్చులో 40–45 శాతం వ్యయం నిర్మాణ సామగ్రిదే ఉంటుంది. తాజా జీఎస్టీ సవరణతో నిర్మాణ సామగ్రిపై అయ్యే ఖర్చులో డెవలపర్‌కు 10–15 శాతం వరకు ఆదా అవుతుంది. ఫలితంగా మొత్తం ఇంటి నిర్మాణ వ్యయం 4–6 శాతం వరకు ఖర్చు తగ్గుతుంది. అయితే ఈ తగ్గింపును డెవలపర్లు గృహ కొనుగోలుదారులకు బదలాయిస్తారా అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
నిర్మాణ పనులు వేగవంతం..
జీఎస్టీ గతంలో మాదిరిగా ఐదు పన్ను శ్లాబులతో గందరగోళంగా లేకుండా రెండు రకాల ట్యాక్స్ ఫ్రేమ్‌వర్క్‌లను కేంద్రం తీసుకొచ్చింది. దీంతో ప్రాపర్టీ కొనుగోలుదారుల్లో పన్ను చిక్కులు తొలుగుతాయి. స్థిరాస్తి రంగంలోకి మరిన్ని సంస్థాగత పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ఇన్‌పుట్ ఖర్చులు తగ్గుతుండటంతో ప్రాజెక్ట్ నిర్మాణ పనులను వేగవంతమవడంతో పాటు కొత్త ప్రాజెక్ట్‌ల లాంచింగ్స్‌కు డెవలపర్లు ఆసక్తి చూపిస్తారు. ప్రస్తుతం దేశంలో పట్టణ మార్కెట్లలో దాదాపు కోటి బడ్జెట్ గృహాల కొరత ఉంది. 2030 నాటికి ఈ సంఖ్య 2.5 కోట్లకు చేరుతుంది. ఇలాంటి సమయంలో కేంద్రం జీఎస్టీ తగ్గింపు చేయడం బడ్జెట్ గృహాలకు పెద్ద ఉపశమనం.
ఏ విభాగంలో ఎంత ప్రయోజనమంటే?
గృహ విభాగం: సిమెంట్‌పై జీఎస్టీ తగ్గింపుతో నిర్మాణ ఖర్చులు 3–5 శాతం మేర తగ్గుతాయి. ముఖ్యంగా రూ.40 లక్షల కంటే తక్కువ ధర ఉండే చౌక గృహాలను నిర్మిస్తున్న డెవలపర్లకు నగదు ప్రవాహం, మార్జిన్లు పెరుగుతాయి. దీంతో ఈ విభాగంలోని బిల్డర్లకు గణనీయమైన ఉపశమనం కలుగుతుంది. ఇప్పటి వరకు నిర్మాణ సామగ్రిపై జీఎస్టీ భారం కారణంగా అందుబాటు గృహాలను నిర్మించేందుకు డెవలపర్లు ఆసక్తి చూపించలేదు. దీంతో మొత్తం కొత్త గృహాల సరఫరాలో అఫర్డబుల్ హౌసింగ్ వాటా 2019లో 40 శాతంగా ఉండగా.. 2025 తొలి అర్ధభాగం నాటికి ఏకంగా 12 శాతానికి పడిపోయింది. అలాగే విక్రయాలలో ఈ విభాగం వాటా 2019లో 40 శాతంగా ఉండగా.. ఇప్పుడది 18 శాతానికి తగ్గింది. తాజాగా కేంద్రం జీఎస్టీ సవరణతో నిర్మాణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. అయితే ఈ తగ్గింపు వ్యయాలను డెవలపర్లు గృహ కొనుగోలుదారులకు బదలాయిస్తే గనక అందబాటు గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
కార్యాలయ విభాగం: ప్రస్తుతం కార్యాలయ విభాగం 12 శాతం జీఎస్టీ ఉంది. ఇన్‌పుట్ క్రెడిట్(ఐటీసీ) కూడా అందుకోవచ్చు. అయితే ఇటీవల పరిణామాలు పరిస్థితిని కొంచెం క్లిష్టతరం చేశాయి. వాణిజ్య ఆస్తుల లీజులపై ఐటీసీని తొలగించారు. దీంతో డెవలపర్లు ఇకపై ప్రాజెక్ట్ సంబంధిత వ్యయాలపై ఐటీసీని క్లెయిమ్ చేయలేరు. దీంతో కార్యాలయ స్థలాలు, ఇతర వాణిజ్య ఆస్తుల కార్యాచరణ ఖర్చులు, అద్దె ధరలు పెరిగే అవకాశం ఉంది. అలాగే రిజిస్టర్ చేయని వాణిజ్య ఆస్తుల అద్దెలు రివర్స్ ఛార్జ్ మెకానిజం(ఆర్సీఎం) ప్రకారం అద్దెదారులు 18 శాతం జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వాణిజ్య ప్రాపర్టీలను అద్దెకు తీసుకునేవారికి ఇది అదనపు భారమే.
రిటైల్ విభాగం: నిర్మాణ సామగ్రిపై జీఎస్టీ తగ్గింపు డెవలపర్లకు ఇన్‌పుట్ ఖర్చులను తగ్గిస్తుంది. దీంతో షాపింగ్ మాల్స్, రిటైల్ కాంప్లెక్స్‌ల నిర్మాణ ఖర్చులు తగ్గుతాయి కాబట్టి రిటైల్ ప్రాజెక్ట్‌ల సరఫరా పెరగడంతో పాటు రిటైల్ అద్దెలలో పోటీ పెరుగుతుంది. జీఎస్టీ సవరణ లాజిస్టిక్ ఖర్చులను కూడా తగ్గిస్తుంది. సరఫరా గొలుసులను క్రమబదీ్ధకరించడంలో సహాయపడుతుంది. అయితే వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించే రిటైల్ ప్రాపరీ్టల అద్దె ఆదాయంపై మాత్రం జీఎస్టీ 18 శాతం చెల్లించాల్సిందే. ఇది ఆయా అద్దెదారులకు కాసింత ఇబ్బందే..
ఏ నిర్మాణ సామగ్రిపై జీఎస్టీ ఎంతంటే?
➤సిమెంట్, రెడీమిక్స్ కాంక్రీట్(ఆర్‌ఎంసీ): గతంలో 28 శాతం జీఎస్టీ ఉండగా.. 18 శాతానికి తగ్గింది.
➤టైల్స్, ఇసుక, ఇటుకలు: 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గింది.
➤రంగులు, వార్నిష్: 28 శాతం నుంచి 18 శాతం తగ్గింది.
➤మార్బుల్, గ్రానైట్: 12 శాతం ఉండగా.. 5 శాతానికి తగ్గింది.