
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు ప్రముఖ సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ విప్రో క్యాంపస్ మధ్య నుంచి వాహనాలు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విజ్ఞప్తిని విప్రో వ్యవస్థాపక చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ(Azim Premji) తోసిపుచ్చారు. ఆ స్థలం లిస్టెడ్ కంపెనీకి చెందిన ప్రైవేటు ఆస్తి అని, ప్రజలందరికీ సంబంధించినది కాదని స్పష్టంచేశారు.
బెంగళూరులో ట్రాఫిక్ రద్దీ(Bengaluru Traffic Troubles)పై తీవ్ర విమర్శలు వస్తుండడంతో రద్దీని నియంత్రించేందుకు సిద్ధరామయ్య(Siddaramaiah) సర్కారు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీకి సీఎం లేఖ రాశారు. బెంగళూరులోని విప్రో క్యాంపస్ లోపలి నుంచి కొన్ని వాహనాలను అనుమతించాలని కోరారు. దీనివల్ల ఆ చుట్టుపక్కల రహదారులపై ట్రాఫిక్ రద్దీ 30శాతం తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొద్ది మొత్తంలో వాహనాలను అనుమతించినా ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు గణనీయమైన ఉపశమనం కలుగుతుందని సిద్ధరామయ్య లేఖలో పేర్కొన్నారు. అయితే..
ఈ విజ్ఞప్తిపై విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ నుంచి సానుకూల ప్రకటన వెలువడలేదు. సర్జాపూర్‌లోని విప్రో క్యాంపస్ నుంచి ట్రాఫిక్‌ను అనుమతిస్తే న్యాయ, ప్రభుత్వ పరమైన సమస్యలు వస్తాయని తెలిపారు. సర్జాపూర్ క్యాంపస్ ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న స్పెషల్ ఎకనమిక్ జోన్ (సెజ్) అని గుర్తుచేశారు. తమ క్యాంపస్‌లో నుంచి ట్రాఫిక్‌ను అనుమతించినంత మాత్రాన బెంగళూరులో ట్రాఫిక్ సమస్య పూర్తిగా పరిష్కారం కాదని తెలిపారు.
ఐటీ సంస్థలకు నెలవైన బెంగళూరులోని ఔటర్ రింగ్ రోడ్డులో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతుండడంపై ప్రయాణికులు, పౌర సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బెంగళూరులో రోడ్ల పరిస్థితిపై ‘బ్లాక్‌బక్’(Blackbuck) అనే కంపెనీ సీఈవో రాజేశ్ యాబాజీ పెట్టిన పోస్టు తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ‘గతంలో ఇంటినుంచి కార్యాలయానికి వెళ్లి రావడం తేలికగా ఉండేది. ఇప్పుడు అది కఠినంగా మారిపోయింది. ఆఫీసుకు రావాలంటే మా ఉద్యోగులకు గంటన్నర పడుతుంది. రహదారులన్నీ గుంతలు, దుమ్ముతో నిండిపోయాయి. గత ఐదేళ్లలో ఈ పరిస్థితుల్లో మార్పేమీ రాలేదు. మేము ఇక్కడినుంచి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాం’ అంటూ రాజేశ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇది రాజకీయ దుమారానికి కారణమైంది.
ఇదీ చదవండి: ప్రధాని ఇంటి దగ్గర గుంతలు ఉన్నాయ్.. చూశారా?