
ఆదాయ వృద్ధి ప్రభావితం కావొచ్చు
సీక్వెన్షియల్‌గా చూస్తే కోలుకున్న డిమాండ్
న్యూఢిల్లీ: జూన్ త్రైమాసికంలో తమ ఆదాయం వృద్ధిపై వాతావరణ మార్పులు ప్రభావం చూపించి ఉండొచ్చని ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు పేర్కొన్నాయి. అకాల వర్షాలు, వేసవి సీజన్ స్వల్పకాలం పాటే ఉండడం, కీలక ముడి సరుకులపై ద్రవ్యోల్బణం ప్రభావం ఆదాయం వృద్ధిపై ఉంటుందని తెలిపాయి. దీంతో సింగిల్ డిజిట్‌కే ఆదాయం వృద్ధి పరిమితం కావొచ్చని అంచనా వేశాయి. అయితే సీక్వెన్సియల్‌గా చూస్తే (మార్చి త్రైమాసికం నుంచి) డిమాండ్ జూన్ త్రైమాసికంలో కోలుకున్నట్టు చెప్పాయి.
ముఖ్యంగా పట్టణ మార్కెట్లలో అమ్మకాలు పుంజుకున్నట్టు వెల్లడించాయి. భారత వ్యాపారం జూన్ త్రైమాసికంలో సాధారణం కంటే తక్కువ పనితీరును చూపించినట్టు గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ తెలిపింది. అయినప్పటికీ అమ్మకాల్లో అధిక సింగిల్ డిజిట్ వృద్ధిని సాధిస్తామని పేర్కొంది. స్టాండలోన్ వ్యాపారం ఎబిట్డా మార్జిన్ క్యూ1లో సాధారణ స్థాయి కంటే దిగువనే ఉండొచ్చని తెలిపింది.
భారత్ తర్వాత తమకు అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న ఇండోనేషియాలో ధరల పరమైన ఒత్తిళ్లు ఎదురైనట్టు గ్రోద్రేజ్ కన్జ్యూమర్ వెల్లడించింది. దీంతో అమ్మకాల్లో వృద్ధి ఫ్లాట్‌గా ఉండొచ్చని అంచనా వేసింది. తమ కన్సాలిడేటెడ్ ఆదాయం జూన్ త్రైమాసికలో తక్కువ సింగిల్ డిజిట్‌కు పరిమితం కావొచ్చని డాబర్ సైతం తెలిపింది. ఇక కన్సాలిడేటెడ్ ఆపరేటింగ్ మార్జిన్ ఆదాయ వృద్ధి కంటే తక్కువకే పరిమితం కావొచ్చొని పేర్కొంది. వ్యక్తిగత సంరక్షణ, గృహ ఉత్పత్తుల అమ్మకాలు మంచి పనితీరు చూపించొచ్చని తెలిపింది. అంతర్జాతీయ వ్యాపా రం మాత్రం డబుల్ డిజిట్ వృద్ధిని (స్థిర కరెన్సీ మారకంలో) నమోదు చేయొచ్చని పేర్కొంది.
మోస్తరు వృద్ధి..
జూన్ త్రైమాసికంలో తమ నిర్వహణ లాభం మోస్తరు వృద్ధిని చూపించొచ్చని మారికో అంచనా వేసింది. కీలక ముడి సరుకు అయిన కొబ్బరి ధరలు అధికంగా ఉండడానికి తోడు అసాధారణ వర్షాలు ప్రభావం చూపించినట్టు తెలిపింది. స్థూల మార్జిన్లపై ఒత్తిడి ఉంటుందని వివరించింది. గ్రామీణ మారెక్ట్ నుంచి జూన్ క్వార్టర్‌లో స్థిరమైన డిమాండ్ కనిపించినట్టు వెల్లడించింది. ఈ–కామర్స్, క్విక్ కామర్స్ తదితర ఛానళ్ల ద్వారా స్థిరమైన వృద్ధి కొనసాగినట్టు తెలిపింది.