మళ్లీ మొబైల్‌ చార్జీల మోత | Telecom operators hike mobile tariffs by 15percent in june 2026 | Sakshi
Sakshi News home page

మళ్లీ మొబైల్‌ చార్జీల మోత

Jan 11 2026 4:43 AM | Updated on Jan 11 2026 4:43 AM

Telecom operators hike mobile tariffs by 15percent in june 2026

జూన్‌ నాటికి 15 శాతం పెరిగే అవకాశం 

జియో ఐపీవోతో పరిశ్రమ వేల్యుయేషన్‌కి ఊతం 

జెఫ్రీస్‌ నివేదిక

న్యూఢిల్లీ: టెలికం చార్జీల మోతకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఏడాది జూన్‌ నాటికి టారిఫ్‌లను టెల్కోలు సుమారు 15 శాతం పెంచే అవకాశం ఉంది. దీనితో వచ్చే ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ ఆదాయ వృద్ధి రెట్టింపు కానుంది. ఆర్థిక సేవల సంస్థ జెఫ్రీస్‌ ఒక నివేదికలో ఈ విషయాలు పేర్కొంది. 2026 ప్రథమార్ధంలో జియో ప్రతిపాదిత ఐపీవోతో టెలికం పరిశ్రమ వేల్యుయేషన్‌ పెరుగుతుందని రిపోర్టును రూపొందించిన ఈక్విటీ అనలిస్ట్‌ అక్షత్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. 

గతంలో ధోరణులకు తగ్గట్లుగా దాదాపు రెండేళ్ల తర్వాత దేశీయంగా జూన్‌లో మొబైల్‌ టారిఫ్‌లు 15 శాతం మేర పెరగవచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ ఆదాయ వృద్ధి 16 శాతానికి చేరొచ్చని తెలిపారు. డేటా, పోస్ట్‌పెయిడ్‌ వినియోగం పెరుగుతుండటంతో మొబైల్‌ ఏఆర్‌పీయూ (యూజరుపై సగటున వచ్చే ఆదాయం) పెరుగుతోందని నివేదిక తెలిపింది.  

నివేదికలో మరిన్ని విశేషాలు.. 
→ ఇన్వెస్టర్లకు రెండంకెల స్థాయిలో రాబడిని ఇచ్చేందుకు, భారతి ఎయిర్‌టెల్‌కి దాదాపు సరిసమానమైన వేల్యుయేషన్‌ని పొందేందుకు జియో సుమారు 10–20 శాతం మేర మొబైల్‌ టారిఫ్‌లు పెంచవచ్చు. 

→ ఏజీఆర్‌ బాకీలపై ప్రభుత్వం 5 ఏళ్ల మారటోరియం ఇవ్వడం వల్ల 2026–30 ఆర్థిక సంవత్సరాల మధ్య ప్రభుత్వానికి వొడాఫోన్‌ ఐడియా చెల్లించాల్సిన మొత్తం.. 35–85 శాతం మేర తగ్గుతుంది. అయినప్పటికీ చెల్లింపులు జరిపేందుకు 2027–2030 ఆర్థిక సంవత్సరాల మధ్య మొబైల్‌ సరీ్వసుల రేట్లు 45 శాతం మేర పెంచాల్సి ఉంటుంది.  

→ పెట్టుబడి వ్యయాలు తగ్గడం వల్ల టెల్కోల మార్జిన్లు పెరగవచ్చు. 5జీ నెట్‌వర్క్‌ విస్తరణ దాదాపు పూర్తయ్యింది. 2025 ఆర్థిక సంవత్సరం నుంచే పెట్టుబడి వ్యయాలు నెమ్మదిగా తగ్గడం మొదలైంది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే తీరు కొనసాగే అవకాశం ఉంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement