బడ్జెట్ ప్రింట్ స్టార్ట్
హల్వా వేడుకతో ఆర్థిక పండుగకు శ్రీకారం
బడ్జెట్ ముద్రణకు అధికారిక ఆరంభం
లాక్–ఇన్ పీరియడ్ ప్రారంభం
పాల్గొన్న ఆర్థిక మంత్రి సీతారామన్
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌కు ముందు కీలక సంప్రదాయ కార్యక్రమం బడ్జెట్ హల్వా సెరమనీ న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో మంగళవారం ఘనంగా, సందడిగా జరిగింది. ఈ కార్యక్రమంతో బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రక్రియకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోపాటు, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఆర్థిక శాఖ పరిధిలోని వివిధ విభాగాల కార్యదర్శులు, సీనియర్ అధికారులు, బడ్జెట్ తయారీలో పాల్గొన్న సిబ్బంది కలిసి హల్వాను పంచుకున్నారు.
భారత సంప్రదాయంలో శుభారంభానికి తీపి పంచుకోవడం ఆనవాయితీ కావడంతో, బడ్జెట్ ప్రక్రియ ప్రారంభానికి ఇది ప్రతీకగా కొనసాగుతోంది. వచ్చే నెల (ఫిబ్రవరి)1 న ఆర్థిక మంత్రి పార్లమెంట్‌కు బడ్జెట్‌ను సమరి్పంచనున్నారు. హల్వా వేడుక తర్వాత ఆర్థిక మంత్రి సీతారామన్ బడ్జెట్ ముద్రణ విభాగాన్ని సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. మొత్తం బడ్జెట్ బృందానికి ఈ సందర్భంగా ఆమె అభినందనలు తెలియజేశారు.
బడ్జెట్ వరకు దిగ్బంధం
బడ్జెట్ రూపకల్పనలో పాలుపంచుకున్న అధికారులు, సిబ్బంది పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రసంగం ముగిసే వరకు నార్త్ బ్లాక్‌లోనే (లాకిన్) ఉండిపోతారు. బాహ్య ప్రపంచంతో వారికి ఎలాంటి సమాచార, సంబంధాలు ఉండవు. బడ్జెట్ తుది పత్రాలు ఎట్టి పరిస్థితుల్లోనూ లీక్ అవ్వకుండా ఈ విధానాన్ని పాటిస్తుంటారు. ఇలా లాకిన్‌లో ఉండే అధికారులు, సిబ్బందికి అభినందన పూర్వకంగా హల్వా వేడుక నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. నార్త్‌బ్లాక్ బేస్‌మెంట్‌లోని ప్రింటింగ్ ప్రెస్‌లోనే 1980 నుంచి 2020 వరకు బడ్జెట్ ప్రతులను ముద్రించే వారు. ఆ తర్వాత నుంచి పరిమితంగా కొన్ని పత్రాలను ముద్రించి, మిగిలిన మొత్తం డిజిటల్ రూపంలోకి మారింది. 1950కు పూర్వం రాష్ట్రపతి భవన్‌లో బడ్జెట్ పత్రాల ముద్రణ నడిచింది. డాక్యుమెంట్లు లీక్ అవ్వడంతో 1950లో మింట్‌రోడ్‌కు మార్చారు. ఆ తర్వాత 1980లో నార్త్‌బ్లాక్‌కు మారింది.


