బ్యాంకులు, మెటల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు
సెన్సెక్స్ లాభం 320 పాయింట్లు
127 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
ముంబై: ఐరోపా సమాఖ్య(ఈయూ)తో మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాలతో ముగిసింది. బ్యాంకులు, మెటల్ షేర్లకు భారీ కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా సెన్సెక్స్ 320 పాయింట్లు పెరిగి 81,857 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 127 పాయింట్లు బలపడి 25,175 వద్ద నిలిచింది.
⇒ దేశీయ ఆటో రంగ కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి. భారత్–ఈయూల మధ్య కుదిరిన స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందంతో ఐరోపా దేశాల నుంచి దిగుమతి అయ్యే లగ్జరీ కార్లు చౌకగా లభించనున్నాయి. దీంతో మార్కెట్లో మరింత పోటీతత్వం పెరుగుతుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఫలితంగా మహీంద్రాఅండ్‌మహీంద్రా 4%, హ్యుందాయ్ మోటార్స్ 4% పతనమయ్యాయి. మారుతీ సుజుకీ 1.50%, టాటా మోటార్స్ పీవీ 1.22%, ఎంఆర్‌ఎఫ్ 1.20%, అశోక్ లేలాండ్ 0.50% నష్టపోయాయి.
⇒ ఈయూతో స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందంతో రెడీమేడ్ గార్మెంట్స్, కాటన్, హోమ్ టెక్స్‌టైల్స్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గి ఎగుమతులు మరింత పెరగొచ్చనే ఆశావహ అంచనాలతో దేశీయ టెక్స్‌టైల్స్ కంపెనీ షేర్లకు డిమాండ్ నెలకొంది. ఇండో కౌంట్ ఇండస్ట్రీస్, కేఆర్‌పీ మిల్స్ 6% ర్యాలీ చేశాయి. వెల్‌స్పన్ లివింగ్ 4.22%, అలోక్ ఇండస్ట్రీస్ 2.50%, ట్రిడెంట్ 2%, అరవింద్ అరశాతం లాభపడ్డాయి. భారత టెక్స్‌టైల్, రెడీమేడ్ వ్రస్తాల ఎగుమతులకు అమెరికా తర్వాత యూరోపియన్ యూనియన్ రెండో అతిపెద్ద మార్కెట్‌గా ఉంది.


