కేంద్ర బడ్జెట్ 2026–27ను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న (ఆదివారం) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. నిజానికి భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందే.. అంటే 1860 ఏప్రిల్ 7న భారత్ బ్రిటిష్ పాలనలో అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న 'జేమ్స్ విల్సన్' తొలి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తరువాత.. 1947 నవంబర్ 26న తొలి బడ్జెట్ (మధ్యంతర బడ్జెట్)ను అప్పటి ఆర్థిక మంత్రి సర్ ఆర్.కే. షణ్ముఖం చెట్టి పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
బ్లాక్ బడ్జెట్ గురించి
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1947 నవంబర్ 26న దేశ ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడానికి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తరువాత క్రమంగా బడ్జెట్లను ప్రవేశపెడుతూనే ఉన్నారు. కానీ 1973లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను 'బ్లాక్ బడ్జెట్' (Black Budget) అన్నారు. ఇంతకీ దీనికి ఆ పేరు ఎందుకు వచ్చింది? దాని వెనుక ఉన్న అసలు విషయం ఏమిటో తెలుసా..
1971లో ఇండియా - పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం దేశాన్ని ఆర్ధిక సంక్షోభానికి గురి చేసింది. యుద్ధం కారణంగా కరువు ఏర్పడింది, మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు కూడా వ్యవసాయం మీద గణనీయమైన ప్రభావం చూపించాయి. ఆ తరువాత 1973లో అప్పటి ప్రధానమంత్రి 'ఇందిరా గాంధీ' (Indira Gandhi) నాయకత్వంలో ఆర్థిక మంత్రి 'యశ్వంతరావు చవాన్' (Yashwantrao Chavan) బడ్జెట్ ప్రవేశపెట్టారు.
రూ. 550 కోట్ల ఆర్థిక లోటు..
దేశ ఆర్ధిక పరిస్థితి దిగజారిందని, కరువు కారణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా తగ్గిందని.. ఈ కారణంగా లోటు బడ్జెట్ పెరిగిందని.. బడ్జెట్ ప్రసంగంలో చవాన్ వెల్లడించారు. ఆ సమయంలో ఏకంగా రూ. 550 కోట్ల ఆర్థిక లోటును ప్రకటించారు. ఈ క్రమంలో బొగ్గు గనులు, బీమా కంపెనీలు, ఇండియన్ కాపర్ కార్పొరేషన్ వంటి కీలక రంగాల జాతీయీకరణకు రూ. 56 కోట్లు కేటాయింపు ప్రకటించారు.
బొగ్గు గనులను జాతీయం చేయడం ద్వారా.. దేశంలో ఇంధన రంగం అభివృద్ధి చెందితుందని ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయాలు భారతదేశ ఆర్ధిక విధానాలపై ప్రభావాన్ని చూపించాయి. ఈ కారణంగానే దీనిని 'బ్లాక్ బడ్జెట్' అని అన్నారు. బ్లాక్ బడ్జెట్ అనే పదం లోటును మాత్రమే కాకుండా.. ఆర్థిక సంస్కరణల తక్షణ అవసరాన్ని కూడా హైలైట్ చేసింది.


