దేశీయ ద్విచక్ర వాహన రంగంలో సింహభాగం ఆక్రమించిన మోటార్‌సైకిళ్ల విభాగం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వైపు ఆశగా చూస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ వాహన ప్రోత్సాహకాలు కేవలం స్కూటర్లు, మూడు చక్రాల వాహనాలకే పరిమితమవ్వడంపై తయారీదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాబోయే కేంద్ర బడ్జెట్‌లోనైనా తమకు తగిన గుర్తింపు, సబ్సిడీలు లభిస్తాయని ఆశిస్తున్నారు.
పథకాలు ఉన్నా.. ప్రయోజనం తక్కువే!
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఫేమ్-2 (2019-2024) పథకం కానీ, ఇటీవల ప్రారంభించిన పీఎం ఈ-డ్రైవ్ (ప్రధాని ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్) స్కీమ్ కానీ ప్రధానంగా ఈ-స్కూటర్లకే మేలు చేశాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. రట్టన్‌ఇండియా ఎంటర్‌ప్రైజెస్ చైర్‌పర్సన్ అంజలి రట్టన్ మాట్లాడుతూ.. ‘భారతదేశ ద్విచక్ర వాహన మార్కెట్‌లో దాదాపు 70 శాతం అమ్మకాలు మోటార్‌సైకిళ్లవే. స్కూటర్ల వాటా కేవలం 30 శాతమే. అయినప్పటికీ ఎలక్ట్రిక్ విభాగంలో స్కూటర్లకే పెద్దపీట వేశారు. ఈ దశలో మోటార్‌సైకిళ్లకు ప్రోత్సాహకాలు అందించకపోతే ఈవీ తయారీ వేగం మందగిస్తుంది’ అన్నారు.
పరిశ్రమ డిమాండ్లు ఇవే..
అహ్మదాబాద్‌కు చెందిన ‘మ్యాటర్’ వంటి సంస్థలు కూడా ఇదే వాదనను వినిపిస్తున్నాయి. ఈవీ మోటార్‌సైకిల్ రంగం పుంజుకోవాలంటే ప్రభుత్వం నుంచి మద్దతు అవసరమని తయారీదారులు కోరుతున్నారు. కొనుగోలుదారులకు సబ్సిడీలతో పాటు ఉత్పత్తిదారులకు రాయితీలు కల్పించాలని చెబుతున్నారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను (PLI) మరింత సరళతరం చేయాలని కోరుతున్నారు. పరిశోధన, అభివృద్ధికి నిధులు కేటాయిస్తే ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడిన బైక్‌లను భారత్‌లోనే తయారు చేయవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: కొందామా.. అమ్ముదామా?


