బడ్జెట్ సమావేశాల్లో సహకారం కోరనున్న కేంద్రం
ముఖ్యమైన బిల్లులపై విపక్షాలకు వివరించే అవకాశం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28నుంచి మొదలుకానున్న దృష్ట్యా, సభా కార్యక్రమాల అజెండాపై చర్చించేందుకు కేంద్రం మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు పార్లమెంట్ అనెక్స్‌లో జరిగే ఈ సమావేశానికి అన్ని పార్టీల పార్లమెంటరీ ఫోర్‌లీడర్లు హాజరుకానున్నారు.
లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు సజావుగా సాగేలా ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల సహకారం కోరనుంది. ప్రతిపక్ష పార్టీలు ఉభయ సభల కార్యకలాపాల్లో పాల్గొని, కీలక బిల్లులపై చర్చకు సహకరించాలని రిజిజు ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. ఈ నెల 28న బడ్జెట్ సమావేశాల తొలిరోజు లోక్‌సభ, రాజ్యసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. ఫిబ్రవరి ఒకటిన ఆదివారం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 13 వరకు జరుగనుండగా, రెండో విడత మార్చి 9న ప్రారంభమై ఏప్రిల్ 2వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మార్చి వీబీ జీ రామ్ జీ తేవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఇప్పటికే దేశ వ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తోంది. దీనిపై పార్లమెంట్ వేదికగా మరోమారు కాంగ్రెస్ తన ఆందోళనను కొనసాగించే అవకాశాలున్నాయి.
తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని తీవ్రంగా వ్యతిరేకించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియను తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపడుతోంది. కేంద్ర నిధుల విడుదలలో తమపట్ల వివక్ష కొనసాగుతోందని మరోపక్క తమిళనాడు ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తోంది. ఇక బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్ల తీరును సైతం విపక్ష పార్టీలు కేంద్రాన్ని తప్పుపడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మంగళవారం జరిగే అఖిలపక్ష భేటీ కీలకం కానుంది.


