టెక్స్‌టైల్స్‌కు టర్నింగ్ పాయింట్
ఈయూతో ఎఫ్‌టీఏ.. గేమ్ ఛేంజర్
రూ. 22.9 లక్షల కోట్ల ఎగుమతుల మార్కెట్లో దూకుడుకు చాన్స్
న్యూఢిల్లీ: భారత్, యూరోపియన్ యూనియన్(ఈయూ) మధ్య తాజాగా కుదిరిన స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) ప్రధానంగా దేశీ వస్త్ర(టెక్స్‌టైల్స్) పరిశ్రమకు గేమ్‌ఛేంజర్ కానుంది. 27 దేశాల ఈయూతో ఎఫ్‌టీఏ కారణంగా దేశీ టెక్స్‌టైల్స్ ఎగుమతులకు బూస్ట్ లభించనుంది. టారిఫ్‌ల ప్రభావంతో బంగ్లాదేశ్, పాకిస్తాన్, టర్కీ తదితర దేశాలతో పోటీలో భారత్ సవాళ్లు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజా ఒప్పందంతో దాదాపు జీరో డ్యూటీల ద్వారా 264 బిలియన్ డాలర్ల(రూ. 22.9 లక్షల కోట్లు) విలువైన ఈయూ మార్కెట్‌కు భారత్ ఎగుమతులు ఊపందుకునే వీలున్నట్లు కేంద్ర జౌళి శాఖ పేర్కొంది. ప్రస్తుతం దేశీ టెక్స్‌టైల్స్, దుస్తుల ఎగుమతులకు యూఎస్ తదుపరి ఈయూ రెండో పెద్ద మార్కెట్‌గా నిలుస్తోంది.
దేశీ టెక్స్‌టైల్స్, దుస్తుల ఎగుమతుల ఆదాయంలో 28 శాతం వాటా ఆక్రమిస్తున్న యూఎస్.. భారత్ గూడ్స్‌పై 50 శాతం టారిఫ్‌లను విధించిన విషయం విదితమే. కాగా.. టారిఫ్‌లవల్ల పోటీ దేశాలతో సవాళ్లు ఎదుర్కొంటున్న దేశీ వస్త్ర పరిశ్రమకు ఎఫ్‌టీఏ జోష్‌నివ్వనున్నట్లు జౌళి శాఖ పేర్కొంది. ఇది శ్రామిక ఆధారిత రంగం కాగా.. ఎఫ్‌టీఏ ప్రభావంతో ధరలతో పోటీ పడటమేకాకుండా మరిన్ని మార్కెట్లలో విస్తరించేందుకు వీలు కలగనున్నట్లు తెలియజేసింది. దీంతో 264 బిలియన్ డాలర్ల(రూ. 22.9 లక్షల కోట్లు) విలువైన ఎగుమతుల మార్కెట్లో మరింతగా పోటీ పడేందుకు దారి ఏర్పడనున్నట్లు వెల్లడించింది.
ప్రత్యక్షంగా టెక్స్‌టైల్స్ రంగం 4.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం భారత్ నుంచి 36.7 బిలియన్ డాలర్ల(రూ. 3.19 లక్షల కోట్ల) విలువైన గ్లోబల్ టెక్స్‌టైల్, దుస్తుల ఎగుమతులు నమోదవుతున్నాయి. వీటిలో ఈయూ వాటా 7.2 బిలియన్ డాలర్లుకాగా.. తాజా ఒప్పందంతో యార్న్, కాటన్ యార్న్, రెడీమేడ్ గార్మెంట్స్ తదితర ప్రొడక్టులకు భారీ అవకాశాలు ఏర్పడనున్నట్లు జౌళి శాఖ వివరించింది.
ఫార్మా ఎగుమతులకు దన్ను
ఈయూతో ఎఫ్‌టీఏ కారణంగా దేశీ ఫార్ములేషన్లు, ఏపీఐలు, విలువైన ఔషధాల ఎగుమతులు బలపడనున్నట్లు ఫార్మాక్సిల్ చైర్మన్ నమిత్ జోషీ పేర్కొన్నారు. దేశీ ఫార్మాస్యూటికల్ రంగానికి నిర్మాణాత్మక పోటీతత్వాన్ని పెంచుతుందని అభిప్రాయపడ్డారు. ప్రధానంగా నాణ్యతా సామర్థ్యాలుగల దేశీ ఫార్మా ఎంఎస్‌ఎంఈలకు దన్ను లభిస్తుందని తెలియజేశారు.
మైలురాయిగా..
భారత్, ఈయూ మధ్య ఎఫ్‌టీఏను మైలురాయిగా లగ్జరీ బ్రాండ్ల ఆటో రంగ దిగ్గజాలు మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, స్కోడా ఆటో, ఫోక్స్‌వేగన్, ఆడి, స్టెల్లాంటిస్ అభివర్ణించాయి. దీంతో సాంకేతిక ఆవిష్కరణలకు ప్రోత్సాహాన్నివ్వడమేకాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు సైతం దన్నుగా నిలుస్తుందని అభిప్రాయపడ్డాయి.


