- కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన ఐసీఏఐ
- బడ్జెట్ సమావేశాల్లో పరిగణనలోకి తీసుకోనున్న కేంద్రం?
- ఇప్పటికే అమెరికా, జర్మనీ వంటి దేశాల్లో అమలు
- మన దేశంలో అమల్లోకి వస్తే.. దంపతులకు ఎన్నో ప్రయోజనాలు
భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తుంటే.. వేర్వేరుగా ఆదాయపన్ను రిటర్న్స్(ఐటీఆర్) దాఖలు చేయడం సహజమే..! అయితే.. పన్ను వెసులుబాటు విషయంలో ఇరువురూ తంటాలు పడాల్సిన పరిస్థితులు ఎదురవుతుంటాయి. హౌసింగ్ లోన్, పిల్లల ట్యూషన్ ఫీజులు, ఇంటి అద్దె, ఎడ్యుకేషన్ లోన్, విద్యుత్తు వాహనాల కొనుగోలు, మెడికల్ ఇన్సూరెన్స్.. ఇలా క్లెయిమ్ చేసుకునే సమయంలో ఇబ్బందులు తప్పవు. ఇకపై ఆ సమస్య లేకుండా దంపతులకు ఉమ్మడి ఐటీఆర్ వెసులుబాటును కల్పించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి చర్యలు తీసుకుంటున్నారని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి.
ఐసీఐఏ ప్రతిపాదనలతో..
నిజానికి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఐఏ) కేంద్ర ప్రభుత్వానికి ఉమ్మడి ఐటీఆర్ ప్రతిపాదనలు చేసింది. ఈ విధానం వల్ల దంపతులు ఒకే ఐటీఆర్ చెల్లించే వెసులుబాట్లు ఉంటాయి. ఇప్పటికే అమెరికా, జర్మీన వంటి దేశాల్లో ఈ విధానం కొనసాగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదికలో ఐసీఐఏ వెల్లడించింది. ఫిబ్రవరి 1న ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ అంశంపై ఓ ప్రకటన చేసే అవకాశాలున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
వేతన జీవులకు ఊరటనిచ్చేందుకు..
వేతన జీవులకు ఊరటనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్‌లో కొత్తపన్ను విధానంలో ఉన్నవారికి రూ.12 లక్షల వార్షికాదాయం వరకు పన్ను మినహాయింపునిచ్చిన విషయం తెలిసిందే..! పలు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడు కూడా వరాల జల్లులు కురిపించే అవకాశాలున్నట్లు సమాచారం. ఇక వేతన సవరణ సంఘం సిఫార్సులను సైతం అమలు చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
ఉమ్మడి పన్నుల వల్ల ప్రయోజనాలెన్నో..!
ఉమ్మడి పన్ను విధానం వల్ల ఎన్నెన్నో ప్రయోజనాలుంటాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి పన్ను విధానానికి ఆదాయపన్ను చట్టం అంగీకరించదు. ఇందుకోసం పార్లమెంట్ చట్టంలో సవరణలు చేయాల్సి ఉంటుంది. ఉమ్మడి పన్ను వల్ల దంపతులిద్దరూ తమ క్లెయిమ్‌లను కలిపి చేసుకోవచ్చు. దంపతుల్లో ఒకరికి చాలా ఎక్కువ వేతనం, మరొకరికి తక్కువ ఉండడం సహజమే..! ఇలాంటి సందర్భాల్లో ఉమ్మడి ఐటీఆర్ వల్ల, పన్ను భారం భారగా తగ్గే అవకాశాలుంటాయి. ఈ విధానం అందుబాటులోకి వస్తే.. పన్ను ఎగవేతలకు కూడా చెక్ పెట్టవచ్చని ఐసీఏఐ భావిస్తోంది.


